జానపద కళారూపంగా బుర్రకథ
by Swarupkrishna Murthy
జాతి సంస్కృతిని కళలు, సాహిత్యం ప్రతిబింబిస్తాయి. కళలు జాతికి జీవనాడుల వంటివి. కళలను విస్మరిస్తే జాతి నిర్జీవమవుతుంది. ఇట్లాంటి కళల్లో తెలుగు జానపద సాహిత్య కళారంగంలో ఒక మహత్తర ప్రక్రియ బుర్రకథ. తెలుగు మాట, తెలుగు పాట, తెలుగు వేషం, తెలుగు పలుకు బడి, తెలుగు దనం మూర్తీభవించిన మహత్తర జానపద కళారూపం బుర్రకథ. సమాజంలో ఉన్న అనేక సమస్యలను ప్రదర్శన ద్వారా స్పష్టం చేసిన జానపద కళా ప్రక్రియ బుర్రకథ. దేశ జాతి సంస్కృతిలోని విశిష్టతను, సామాజిక వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసిన కళారూపంగా బుర్రకథ ప్రసిద్ది చెందింది. నిజానికి ఆధునిక కాలంలో ఒక సామూహిక సామాజిక అవసరంగా గుర్తించబడిన ఈ కళారూపం సామాజిక చైతన్యాన్ని కలిగించడానికి, అనేక సామాజిక రుగ్మతలను నిర్మూలించడానికి ప్రయత్నం చేసే దిశలో ఆవిర్భావం చెందిందనడం అనౌచిత్యం కాదు. కమ్యూనిస్టు ఉద్యమాలకు ఊతమిచ్చిన కళారూపం, సామాజిక సమస్యలను జానపద బాణీలో వినిపించడం ద్వారా బహు సామాజిక వర్గాలను ఆకట్టుకున్న కళరూపం బుర్రకథ. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తమ పథకాలను తెలియ చెప్పాడానికి ప్రభుత్వం ఒక మాధ్యమంగా ఎంచుకున్న కళారూపం బుర్రకథ. ఆశు కవిత్వ తత్వం ఈ కళారూపానికి ప్రత్యేక లక్షణం.తందాన పాట అనీ, తంబుర కథ, డక్కీల కథ, బుర్రకథ అని అనేక రూపాంతరాలతో ప్రసిద్దమైన ఈ జానపద క్ళారూపం ఇవ్వాళ ప్రాచుర్ర్యాన్ని కోల్పోతున్నదంటే తెలుగు వాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. జానపద కళారూపాలలో ఇప్పటికే చాలా కళారూపాలను మరుగున పరచుకున్న తెలుగు వాళ్ళు ఇప్పటికే మిగిలి అరకొరగా ఉన్న కళారూపాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ప్రతి పండుగ జాతరలలో జానపద కళారూపాలైన హరి కథ, బుర్రకథ, యక్షగానాలు, బొమ్మలాటలను ఆదరించిన తెలుగు వాళ్ళను నేడు ఆర్కెస్ట్రాలకు, డిస్కోడాన్సులకు లొంగదీసిన సంస్కృతిని నిందించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పల్లె సీమలు జానపద కళారూపాలతో పులకరించేవి. గొబ్బిళ్ళ మధ్య నాట్యమాడే హరిదాసు పాటల్తో తన్మయత్వం చెందే పల్లెసీమ, గంగిరెద్దులాటతో మురిసిపోయే తెలుగు పల్లెపడుచులు, వేమయ్య స్వామి గుర్రం మీద వస్తుంటే సంబరపడే పిల్లమూకలు, తోలుబొమ్మలాటతో మురిసిపోయే తెలుగు ముఖాలు ఇవ్వాళ కనిపిస్తున్నాయా? నిజానికి మన సంస్కృతికి మనం దూరం అవుతున్నామనా వాస్తవాన్ని అంగీకరించక పోతే అది ఆత్మద్రోహమే అవుతుంది.శివరాత్రి జాగరణలో బుర్రకథ, హరికథ వంటివి ఒకప్పుడు సహజంగా ఏ పల్లెసీమలో అయినా కనిపించేవి. ఇవ్వాళ వాటికో కోసం వెతకాల్సిన అవస్థ ఏర్పడిందంతే తరగిపోతున్న జానపద కళాసంస్కృతిని చూసి మనం గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితులున్నాయి.తంబూరాకు ఉపయోగించే బుర్రను బట్టి దీనికి తంబూరా కథ అనే, బుర్రకథ అనీ పేరు వచ్చి ఉండవచ్చునని బుర్రకథ గురించి కొందరి అభిప్రాయము. ఒకప్పటి జంగం కథ ఈ నాటికి బుర్రకథగా మారిందని కొందరి అభిప్రాయం. కాకతీయ యుగం నాటికే జంగం కథలు బహుళ ప్రచారంలో ఉన్నాఇ అని కొందరు, శ్రీనాథుని యుగం నాటికే బుర్రకథలున్నాయి అని కొందరు అభిప్రాయపడినారు. పదునాలుగవ శతాబ్దంలొ వ్రాయబడిన క్రీడాభిరామంలో-” ద్రుతతాళంబున వీర గుంభిత దుందుందుంకిటత్కార” అను పద్యం బుర్రకథను సూచిస్తుందని కాబట్టి శ్రీనాథుని కాలానికి ముందే బుర్రకథ ప్రచారంలో ఉందని తెలుస్తోంది. బుర్రకథ పుట్టుక చాలా ప్రాచీనమైనదే అయినా 1942 ప్రాంతం నాటికి ఈ బుర్రకథ కళారూపంగా పరిణతి చెందిందని చెప్పవచ్చు.బుర్రకథ సామాజిక చైతన్యాన్ని పెంపొందించడానికి అనువైన ఉత్తమ కళారూపం. కమ్యూనిస్టు పార్టీ రాజకీయాల నిమిత్తం, సమాజంలోని అనేక వర్గాలలోని సామూహిక సమస్యల చిత్రీకరణ కోసం బుర్రకథ ఆవిర్భవించింది. బుర్రకథ ఎన్నో ప్రజాఉద్యమాలకు అండగా నిలబడింది. ప్రజా ఉద్యమాలను సృష్టించింది.బుర్రకథను ముగ్గురు వ్యక్తులు నిర్వహిస్తారు. ఒకటి కథకుడు, రెండు,మూడు వంతార్లు. వంతలలో మొదటి వంత రాజకీయ వంత, రెండవ వంత హాస్య వంత. రాజకీయ వంత ప్రస్తుత సామాజికి రాజకీయ అంశాలను గురించిన వ్యఖ్యానలు చేస్తుంటాడు. హాస్య వంత నాటకంలోని విధూషకుని పాత్ర వంటివాడు. కానీ ఇతని హాస్యంలో కేవలం హాస్యమే కాకుండా సామాజిక స్పృహకూడా ఉంటుంది.జానపద కళారూపాలన్నిటిలోనికి ఉత్తమ కళారూపమే బుర్రకథ. ఏ విషయాన్నైనా ఈ బుర్రకథ ద్వారా ప్రజలకు బహిర్గతం చేయవచ్చు. “అంతర్జాతీయ సమస్యలు మొదలుకొని స్థానిక సమస్యల వరకు బుర్రకథకు వస్తువులయ్యాయి”- అంటాడు కె.కె.రంగనాథాచార్యులు. (కళాసాంస్కృతికోద్యమాలు, నూరేళ్ళ తెలుగు నాడు/పుట 144)బుర్ర్రకథ వివిధ ప్రాంతాలలొ ప్రాంతీయ తత్వాన్ని బట్టి కూడ కథా విధానం మార్పు చేర్పులతొ ప్రధర్శింపబడుతూ ఉంటుంది.ఫ్రధర్శన ప్రారంభంలో డక్కీలు వాయింపు మొదలు పెడతారు. రెండవ దశలో ఆలాపన ఉంటుంది. మూడవ దశలో కథకు సంబందించిన సంధర్భం వస్తుంది. నాల్గవ దశలో కవుల ప్రస్తావన ఉంటుంది. పై నాలుగు దశలలో ఏదో ఒక సందర్భంలో వారు చెప్పే బురాకథ గురించి చెబుతూ జానపద కళారూపంలో ఈ కళారూపం ప్రసిద్దమైనదిగా కొనియాడతారు. ఐదవ దశలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతారు. కథా ప్రారంభం సాధారణంగా దేవ గాంధారి రాగంతో మొదలవుతుంది. గాంధారి రాగాన్ని ఆలపించడంచేత , గాంధారి రాగంతో ప్రారంభంకావడంచేత ఈ కళాకారులను గాంధారోళ్ళు అని పిలవడం జరిగింది. కడప జిల్లా ముద్దనూరు వద్ద కమ్మవారిపల్లె గ్రామంలో గాంధరోళ్ళు అని బుర్రకథ కళాకారులను పిలుస్తారని సుబ్బరాయుడు అను కళాకారుడు అంటాడు.బుర్రకథ ఇతివృత్తంలో అనేక మార్పులు కాలానుగుణంగా వచ్చాయి. ప్రాచీనకాలంలో ఉన్నత వర్గాల వారిని పాత్రలుగా చేసిన రచనలు వచ్చేవి. ఆధునిక కాలంలో క్రింది కులాల వారిని సహితం పాత్రలుగా చేసిన వైనం కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో జంగం కథలు కేవలం మతపరమైన ఇతివృత్తాలనే కలిగి ఉండగా నేటి బుర్రకథలు సామాజికాంశాలు ఇతివృత్తంగా కలిగి ఉన్నాయి.బుర్రకథలలో సమకాలీన ప్రజాసమస్యలను ఆధారం చేసుకొని ఏర్పడిన తొలి ఇతివృత్తం కష్టజీవి బుర్రకథ. తరువాతి కాలంలో బుర్రకథలు ప్రభుత్వ ప్రచారాలకు, రేడియోలకు, టీవీలకు పరిమితమై పోయాయి. మతపరమైన ఇతివృత్తాలు కలిగిన బుర్రకథలనేకం వచ్చినా వాటికి తగినత ఆదరణ లేదు.బుర్రకథా రచయితలలో సుంకర సత్యనారాయణ ప్రముఖుదు. వినరా భారత వీర కుమార విజయం మనదేరా అన్న వంతను సుంకర సత్యనారాయణే ప్రాచుర్యంలొనికి తెచ్చాడు.తెలంగాణా ఉద్యమం, నక్సల్ బరీ ఉద్యమాల నేపధ్యంలో వచ్చిన బుర్రకథలు సామాజిక చైతన్యం కోసం వచ్చినవే. చారిత్రక అంశాల్ను ఆధారంగా చేసుకొని చారిత్రక ఇతివృత్తాలు కలిగిన బుర్రకథలు అనేకం వచ్చాయి. పౌరాణిక బుర్రకథలు కేవలం ఉబుసుపోకకు వచ్చినవే అయిన మత, ధార్మిక విలువలను పెంపొందించడానికి ఉపయోగపడ్డాయి. బుర్రకథ నవరస సమ్మహారం. కరుణరసం, వీరరసం, హాస్యం సమపాళ్ళలో కలిసి ఉండే బుర్రకథలో సామాజిక, రాజకీయ, చారిత్రకాంశాలు పదునైన భాషతో వివరింపబడతాయి. నిజానికి బుర్రకథ బుర్రా ఉన్నా వాళ్ళకు పదును పెట్టే కథ. బుర్రకు పదును పెట్టే కథ. సామాజికంగా ఉన్న రుగ్మతలను రూపుమాపే కథ. సామాజిక చైతన్యం కోసం జనాన్ని నడిపించే కథ.జాతీయోద్యమ కాలంలో ప్రధాన ప్రచార సాధనంగా బుర్రకథ ఉపయుక్తమైంది. ఈ కాలంలో వచ్చిన బుర్రకథలు సామ్యవాద సిద్దంతాలను ప్రజలకు అందించే ప్రయత్నంలో కొత్త మార్గాలను అన్వేషించాయి. ప్రజా బాహుళ్యంలోనికి చొచ్చుకొని పోగల బుర్రకథలను 1940 నుండి కమ్యూనిస్టులు ఎక్కువగా ఉపయోగించుకున్నారు. సుంకర కష్టజీవి బుర్రకథ సామాజిక స్పృహతో రచింపబడినవి. సామాజిక ఇతివృత్తాలతో రచింపబడిన బుర్రకథలలో ఎక్కువగా జమీందారీ వ్యవస్థలోని లోపాలు, సామాన్యుని కడగండ్లు, భూస్వామ్య వ్యవస్థలోని దురవస్థలు, వాటి పరిష్కారం కోసం సంస్థలు, సంఘాలు నెలకొల్పవలసిన ఆవశ్యకత కనిపిస్తాయి.బుర్రక్థను కొన్ని దశల వారీగా గమనించి పరిశీలించినట్లయితే బుర్రకథ పరిణామాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. జంగం కథలు బుర్రకథలుగా రూపాంతరం చెందిన అంటే 1940కి ముందు ఉన్న దశ ప్రథమ దశ. 1940 తరువాత బుర్రకథను ప్రభుత్వ ప్రచారానికి వాడుకోనత వరకు ఉన్న దశ ద్వితీయ దశ, ఈ కళారూపాన్ని ప్రభుత్వ ప్రచారానికి వాడుకొనడం మొదలైన కాలమ్నుండి నేటి వరకు ఉన్న దశ తృతీయ దశగాను విభజించవచ్చు.వీర రౌద్ర రసాలను పోషించడానికి అనువైన బుర్రకథ, ఒకప్పుడు సామూహిక సామాజిక వర్గాలను ఆకట్టుకున్న బుర్రకథ నేడు ఆదరణలో లేనందుకు తెలుగు వారు చింతించాలి. మనం మన సంస్కృతీ వైశిష్ట్యతను చాటి చెప్పే కళారూపాలను పరిరక్షించకపోతే కాలగర్భంలో కలిసిపోయి ముందు తరాలవారికి తెలుగు జాతికి సహజమైన కళా రూపాలు అందకుండా పోవడం తధ్యం. ఇప్పటికే చాలా కళారూపాలను పోగొట్టుకున్నాము. తోలుబొమ్మలాట వంటివి కనుమరుగయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాబట్టి సామాజిక చైతన్యం జీవ లక్షణంగా కలిగిన బుర్రకథను పరిరక్షించాల్సిన బాధ్యత మనదరిమీద ఉంది.బుర్రకథ ఒక సామాజిక అవసరం కోసం రూపు దిద్దుకుంది. ఒక ప్రత్యేక సామాజిక నేపద్యంలోంచి పుట్టుకొచ్చింది. స్థానిక చరిత్రలు, వీరగాధలు ప్రజలకు వివరిచడం ద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగించే దిశగా సాగిన బుర్రకథ తరువాతి కాలంలో పౌరాణిక, చారిత్రక ఇతివృత్తాలతో విజృంభించింది. కమ్యూనిస్టు ఉద్యమానికి ఉతమిచ్చిన బుర్రకథ ఇప్పుడు ప్రభుత్వ పధకాల ప్రచారానికి ఉపయోగించబడుతున్నది. ఎయిడ్స్ గురించిన అవగాహన, జనాభా నియంత్రణ ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన్ అవసరాలను గుర్తించే దిశగా బుర్రకథకులు ఈ నాడు కథలల్లుతున్నాయి. బుర్రకథ కళాకారులు బుడిగె జంగం కులస్థులు. తెలంగాణా ప్రాంతంలో వీరిని బుడిగె జంగాలు అంటారు. బుడిగె అన్నది వీరు వాయించే వాద్యం పేరు. బుర్రకథలో ఇద్దరు వంతలు బుడిగెలు వాయిస్తుంటారు. ఇది కంచుతో చెసిన పరికరం. ఒకవైపు కోలగా సన్నంగా ఉనా తెరుచుకున్న మూతి వంటిది ఉండి మరో వైపు తోలుతో కప్పిపెట్టబడిన బుడిగె ఇద్దరు వంతలు ఉపయోగించే పరికర. జోడుగా వంతలు కూడి పాడగా, తంబుర కథ వినుడీ అని వీరు ప్రారంభంలోనే బుర్రకథలో వంతల ప్రాధాన్యం వివరిస్తారు. తెలుగులో వీరగాథలు అనేకం పాడేది బుడిగె జంగాలె. జంగం రగడ వీరావేశాంకి తగినట్లు ఉంటుంది. బుడిగెలనే గుమ్మెటలు అంటారు. తెలుగులోని బుర్ర కన్నడంలో గుమ్మటి అయింది.బుర్రకథకు యక్షగానానికి చాలా పోలికలున్నాయి. బుర్రకథకు మూలం యక్షగానమని చాలామంది అభిప్రాయం. యక్షగానాలకు బుర్రకథలకు నడుమ జంగం కథలను చెప్పవచ్చు. జంగం కథలలో ప్రసిద్దమైనవి ముగ్గురు మరాఠీలు, కాంభోజరాజు కథ, పెద్దబొబ్బిలి రాజు, కాటమరాజు కథ, దేశింగురాజు కథ, బాలనాగమ్మ వంటివి. జంగం కథలే రాగ తాళ గీత నృత్యాదులతో బుర్రకథలయ్యాయని పరిశోధకుల అబిప్రాయం.బుర్రకథలో ముగ్గురు వ్యక్తులుంటారని ముందే చెప్పుకున్నాం. ప్రధాన కథకుడు మధ్యలొ ఉంటాడు. ఇతని వద్ద తంబుర ఉంటుంది. ఎడమ చేతిలో చిటికెలుంటాయి. కాళ్ళకు గజ్జెలు, ప్రత్యేకమైన పొడవాటి పట్టు అంగీ, పంచె, తలపై పాగా ఇది ప్రథాన కథకుడి వేషం. వంతలలో రాజకీయ వంత సమకాలీన సామాజిక సంస్యల పట్ల విసుర్లు ఉంటాయి. హాస్య వంత తన చతుర సంభాషణలటో, చెణుకులతో కథ విసుగు పుట్టించకుండా చేస్తాడు. కథా ప్రారంభంలో ప్రార్థన ఉంటుంది. వినాయక ప్రార్థన, సరస్వతి ప్రార్థన, బ్రహ్మ ప్రార్థనతో ప్రారంభమయ్యే కథ ఎత్తుగడలో అనేక విధానాలున్నాయి. తందానా తందాని తందానా, వినర ఆంధ్ర కుమారా ధీరా విజయము మనదేరా, రామ, రామ రామా హరిరామా వంటీ అనేక వరుసలు బుర్రకథకులు ఉపయోగిస్తారు. ప్రథాన కథకుడు కథ చెబుతున్నపుడు వంతలు ఘట్టంలోని రసానుగుణంగా వంతలు పాడుతుంటారు. సంతోషంగా సాగే ఘట్టాలలో తందానా, తుమ్మెద, భేష్, శహభాష్, భళాభళి వంటి వంతలుంటే, విషాద ఘట్టాలలో హరి హరీ, అయ్యో అనే వంతలుంటాయి.ప్రథాన కథకుడు రసానుగుణంగా లయబద్దంగా నాట్యం చేస్తూ కథను చెబుతుంటాడు. వీర రస సన్నివేశాల్లో కథకుని నృత్యం చూపరులలో కూడా వీరరసోద్రేకాన్ని కలిగిస్తుంది. పదునైన భావం, భావానుగుణమైన భాషా ప్రకటన బుర్రకథను ప్రజానురంజకమైన కళగా తీర్చి దిద్దింది.ప్రస్తుతం బుర్రకథ- టి. వి. సినిమాల ప్రభావం అన్ని జానపద కళారూపాల మీద పడింది. ఒకప్పుడు పండుగ పబ్బాల్లో గ్రామాల్లో కనిపించే జానపద వాతావరణం నేడు కనిపించడంలేదన్నది సత్యం. కాలానుగుణంగా ఆధునికత చోటు చేసుకుంది. ఆధునికత సాంప్రదాయాన్ని దెబ్బతిసింది. బుర్రకథకులు చాలా మందిని ఈ వ్యాస రచయిత పరకరించినప్పుడు అంతరించిపోతున్న జనపద కళల పట్ల ఈ సమాజానికి ఏ మాత్రం జాలి లేదన్న విషయం బయట పడింది. అనంతపురం జిల్లా కదిరి దగ్గర మేకల చెరువు గ్రామానికి చెందిన రాజరెడ్డి బృందం, కడప జిల్లా ప్రొద్దటురుకు చెందిన తాటికొండ పుల్లయ్య బృందం ఈ వ్యాస రచయితతో సంభాషించి తమ పరిస్థితులను వివరించారు. ఒకప్పుడు ఉన్న ప్రాధాన్యత నేడు బుర్రకథకు లేదని, బుర్రకథను వృత్తిగా ఎంచుకున్న తమ జీవితం దుర్భరమైన దారిద్య్రంతో నిండి ఉందని, జానపద కళారూపాలను ఆదరించి సమ్రక్షించని స్థితిలో ఈ కళారూపాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉందని వాపోయారు.ఒకే కథను ఏడు రాత్రుల పాటు చెప్పడం జరిదేదని కాని ఇప్పుడు ఒక గంటలో బుర్రకథను వినడానికి కూడా ఓపిక లేని స్థితిలో జనం ఉన్నారని తాటికొండ పుల్లయ్య వాపోయాడు. ఈ కళాకారులకు గురువు లేడు. తరతరాలుగా ఆనువంశికంగా వస్తున్న ఈ విద్య తమకు సొంతమైందని వీరు వివరిస్తారు. ఏదో ఒక గ్రామంలో కుటుంబంతో పాటు రెండు మూడు నెలల పాటు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని చ్ట్టు పక్కల పల్లెల్లో కథలను చెబుతూ కథ ఉన్న రోజున కడుపునిండా తిని లేని రోజున కడుపు నిండా తిని లేని రోజున తంబురలో విషాదాన్ని నింపి వాయించే వీరి పరిస్థితిని గమనించి ఆదరించకపోతే మనవి అని చెప్పుకునే కళారూపాలు కనుమరుగై భావితరాల వారికి అందకుండా పోయే ప్రమాదం ఉంది.
Comments
మంచి సమాచారం అందించారు. కేవలం ఏవో కొన్ని పల్లెలలో, దేవాలయ ఉత్సవాలపుడు తప్ప దాదాపు బుర్రకధ కనుమరుగయిపోయింది. ఇంతకు మునుపు ప్రతి చోటా ప్రదర్శించే బుర్రకధ స్థానంలో కలర్ సినిమానో లేక ఆర్కెస్ట్రానో ప్రదర్శిస్తే ఖర్చు తక్కువ, జనం ఎక్కువొస్తారనే అభిప్రాయంతో మొత్తంగా విశ్మరిస్తున్నారు. దాంటో బుర్రకధ చెప్పే కళాకారులూ కనుమరుగవుతున్నారు.
hello,
if possible pl insert viedo of burrakatha.
thank u
hi,
my son got an opportunity to perform Burrakatha. I could not show him how it will be. In website i could only get this one picture. I want to show him how interesting it goes and the way they jump and dance. Now no where we can get people performing Burrakatha. Only way we can show the children is through net.It has become a dying art culture.