ఉయ్యాలవాడ నారసింహారెడ్డి తిరుగుబాటు కాలక్రమణిక
by Swarupkrishna Murthy
![]()
బండిగోపాలరెడ్డి(బంగోరే)వ్యాసం ఆధారంగా
1846 జూలై 6:
మజ్జారి నరసింహారెడ్డి అనే పించను దారుడైన పాళయగారు కొందరు కొండవాళ్ళను, కట్టుబడి బంట్రోతులను పోగు చేసుకొని, ఆయుధాలు సమకూర్చుకొని ప్రభుత్వాన్ని ధిక్కరించడానికి ఆయత్తమవుతున్నాడని కోయిలకుంట్ల తాసీల్దార్ వగైరా తాలూకా అధికార్లకు తెలిసి బంట్రోతుల్ని పెట్టి బందోబస్తుగా పంపిస్తే ఆయన సరిగా సమాధానం చెప్పక తిరగబడి బెదరగొట్టి పంపించినట్లు కోయిలకుంట్ల హెడ్ పోలిస్ తనకు వర్తమానం పంపాడనీ అందువల్ల నారసింహారెడ్డిని అతని మనుషుల్ని వొక కంట కనిపెడుతూ వుండవలసినదిగా కోరుతూ కర్నూలు లోని గవర్నర్ తాలూకు యేజంట్ కు కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ 6 వ తేదీన వొక జాబు వ్రాసి పంపాడు.
1846 జూలై 11
చాగలమర్రి తాలూకాలోని రుద్రవరం గ్రామం పైనబడి నారసిం హారెడ్డి బృందం ( బహుశా 7,8 తేదీలలో కావచ్చు) కొల్లగొట్టుకొని పోతుండగా పోలిసు బంట్రోతులు తదితర ప్రభుత్వ తరపు మనుషులు వెళ్ళి మిట్టపల్లి దగ్గర వాళ్ళను యెదురుకోగా అక్కడ జరిగిన పోరాటంలో హెడ్ దఫేదార్, మరో తొమ్మిదిమంది బంట్రోతుల్ని నరసిం హారెడ్డి మనుషులు చంపివేసి వాళ్ళ దగ్గరున్న ఆయుధాలను లాక్కొని పరారై పోయినట్లు కలెక్టర్కు దువ్వూరు తాలూకా తాసీల్దారు ద్వారా వర్తమానం అందింది. కలెక్టర్ ఇదేదో చిలికి చిలికి గాలివాన అయ్యేటట్లున్నదని భావించక తప్పలేదు. మిలిటరీని వెంటనే పరుగులమీద దువ్వూరు, కోయిలకుంట్ల ప్రాంతాలకు పంపి శంతి భద్రతలను కాపాడవలసిందిగా కడపలో ఉన్న మిలిటరీ కమాండింగ్ ఆఫీసరుకు జాబు వ్రాసి పంపాడు. కర్నూలులోని గవర్నరు యేజంటు సహాయాన్ని అర్థిస్తూ మరొక జాబు వ్రాశాడు.
1846 జూలై 12
నరసింహా రెడ్డి బృందం జూలై 10 వ తేదీన కోయిలకుంట్ల ఆఫీసు నుండి నానా విధ్వంసం చేసి ట్రెజరీని కొల్లగొట్టుకొని ఆనాటికి అందులో మిగిలి వున్న 805 రూపాయలా 10 ఆణాలా నాలుగు పైసల డబ్బును దమ్మిడీలతో సహా వూడ్చుకు పోయారు. అడ్డగించిన ప్రభుత్వ సిబ్బందిని చిందర వందర చేసి పెక్కుమందిని గాయపరచి వొక దఫేదారును, అయిదుమంది పోలీస్ బంట్రోతుల్ని చంపివేశారు. ఇక్కడ జరిగిన యీ పోరాటంలో నరసిం హా రెడ్డి స్వయంగా పాల్గొన్నాడు. ట్రెజరీ పై కప్పు మీదకు దఫేదారు యెక్కి కాల్పులు జరుపుతుంటే, నరసింహా రెడ్డి తన అనుచరులనుంచి తుపాకి లాక్కొని గురిపెట్టి దఫేదారును ఒక్క గుండు దెబ్బతో పడగొట్టాడట. ఈ విద్వంసంలో నరసిం హా రెడ్డి మనుషులూ కొందరు చనిపోయారు. కోయిలకుంట్ల తాసీల్దార్ రాఘవాచార్యులను నరసిం హా రెడ్డి మనుషులు చిక్కించుకొని నిర్భంధంలోకి తీసుకొని వెళ్ళారు. కడకు అతగాడి పల్లకీని కూడా బోయీలతో సహా పట్టుకెళ్ళారు. ఈ సంఘటనతో కోయిలకుంట్ల ప్రజలు భీతావహులై వున్నారని కోయిలకుంట్ల సబ్ ఆఫీసర్ జమ్మలమడుగు హెడ్ పోలీసు ద్వారా పంపిన వర్తమానం జూలై 11 వ తేదీ రాత్రి(వేకువ జామున 2 గంటలకు) కలెక్టర్ కాక్రేంకు చేరింది.ఈ కబురందగానే కలెక్టర్ ఠారెత్తిపోయాడు. బళ్ళారిలో వున్న దత్తమండలాల సైనికాధికారికి అర్జంటుగా కబురంపించాడు-వున్న పళాన వీలైనంత యెక్కువ మంది సైన్యాన్ని పంపించవలసిందిగా కోరుతూ, ఈ కోయిలకుంట్ల దోపిడీ వర్తమానం కాక్రేన్ మదనపల్లిలో విడిది చేసి వుండగా చేరింది.మొదట్లో అందిన అంచనాల ప్రకారం నరసింహారెడ్డి నాయకత్వంలో 9 వేల మంది చేరి వుండవచ్చుననుకొన్నారు. కానీ కలెక్టర్ మాత్రం 3000 మందికి మించకపోవచ్చుననుకొన్నాడు. వనపర్తి జమీందార్ కాజారామేశ్వర రావు, మునగాల రామకృష్ణారెడ్డి, జటప్రోలు సంస్థానాధీశుడు లక్ష్మణ రాయడు, పెనుగొండ, ఔకు జమీందార్లు, హైదరాబాదుకు చెందిన సలాంఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, బనగానిపల్లె నవాబు మహమదాలీఖాన్ ప్రబృతులు నరసింహా రెడ్డికి అండగా వుంటున్నారనీ, ముఖ్యంగా కట్టుబడి బంట్రోతులు, చెంచువాళ్ళు, వడ్డెవాళ్ళు, బోయవాళ్ళు, యానాదులు, కడకు కొందరు బ్రాహ్మణులు సైతం నరసింహారెడ్డి ముఠాలో ప్రత్యక్షంగా చేరి వున్నారనీ, కొందరు అరబ్బులు కూడా పరోక్ష సహాయం అందిస్తున్నారనీ అభిప్రాయపడ్డాడు కలెక్టర్.కోయిలకుంట్ల ట్రెజరీ తరువాత నరసిం హారెడ్డి ముఠా జమ్మలమడుగు ట్రెజరీని కూడా కొల్లగొట్టాలనుకొన్నారట గానీ మిలిటరీ పటాలాలు వస్తున్నాయని తెలుసుకొని ఆ ఆలోచన మానుకొన్నారట. కడపనుంచి, కర్నూలునుంచి,బళ్ళారి నుంచి, కంభం, కడకు సికిందరాబాదు నుంచి- యిట్లా నానా ప్రాంతాలనుంచి సైన్యం వచ్చి ముసురుకోవడం ప్రారంభించింది.
1846 జూలై 23
కంభమ్నుంచి వస్తున్న లెఫ్ట్నెంట్ వాట్సన్ నాయకత్వంలో వచ్చిన మిలిటరీ వాళ్ళు గిద్దలూరు దగ్గర నరసిం హారెడ్డితో తలపడ్డారు. తిరుగుబాటు దార్ల ముఠా 5 వేల మంది ఉంటారని మిలిటరీ అంచనా. వాట్సన్ కింద వున్న సైన్యమేమో వందమంది. ఈ వందమందికి జతగా కంభం తాసీల్దార్, మరికొందరు పోలీసు బంట్రోతులు తోడయ్యారు. అంతే. వేలాదిమంది ప్రత్యర్థులతో పోరాటమంటే ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చునని భయపడ్డాడు వాట్సన్. అయినా అయిదు గంటల సేపు హోరాహోరీ పోరాటం సాగింది. ఒక పాడుబడ్డ కోటలో చేరి వాట్సన్ తన సైన్యాన్ని పురమాయించి పోరాటంలోకి దెంపి, మందుగుండు సామగ్రి అయిపోనీయకుండా పొదుపుగా వ్యూహం ప్రకారం వుపయోగించాడు. చీకటిబడితే తనకు ప్రతికూలం కావచ్చునని పోరాటాన్ని వుధృతం చేశాడు. ఈ పోరాటంలో నరసిం హారెడ్డి మనుషులు 200 మంది దాకా చనిపోయారు. నాలుగు చిన్న ఫిరంగులు వాట్సన్ బృందానికి పట్టుబడ్డాయి. చీకటి పడ్డ తరువాత వాట్సన్ వెనుకంజ వేశాడు. గిద్దలూరుకు 5 మైళ్ళ యివతల వున్న సెట్టివీడుకు తన సైన్యాన్ని తరలించుకు పోయాడు. నరసిం హారెడ్డి కూడా తెలివిగా తప్పించుకొని తన ముఠాను అటువైపు 5 మైళ్ళలో ఉన్న ముండ్ల పాడుకు మళ్ళించుకుపోయాడు.జూలై 24 వ తేదీ కర్నూలునుంచి వచ్చిన్ కెప్తెన్ నాట్, కెప్టెన్ రసెల్ సైన్యం కిష్టంసెట్టి పల్లెకు చేరుకొన్నారు. పోరాటానికి దిగారు. మళ్ళి హోరాహోరీ సమరం జరిగింది. ఒక సిపాయి చనిపోయాడు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నరసిం హారెడ్డి బృందంలోని వాళ్ళు 15 మంది దాకా చనిపోయారు. మరో 10 మంది సైన్యానికి పట్టుబడ్డారు.అయితే ఇక్కడ జరిగిన ముఖ్య విషయం- కంభం తాసీల్దార్ ను నరసిం హారెడ్డి వాళ్ళు కాల్చి చంపగలిగారు. నరసిం హారెడ్డి మనుషులు కొండల్లో కోనల్లో పడి తప్పుకున్నారు. కంభం వైపు గుత్తకనుమ గుండా వెళ్ళి కొత్తకోట చేరుకున్నాడు నరసింహారెడ్డి.ఈ పోరాటాలతో యిరుపక్షాల శక్తి సామర్థ్యాలు పరస్పరం తెలిసి వచ్చాయి. ఆధునికమైన ఆయుధ సామగ్రి, సుశిక్షితులైన సైనిక సిబ్బంది వొకరికి అండగా వుంటే, మరొకరికేమో మొరటు ఆయుధాలేవున్నా, శత్రువులకు అంతు చిక్కకుండా కొండలు కోనలు అడవులు యిరుకుదారులన్నీ కొట్టిన పిండిగా దూసుకుపోయి తిరగగలిగే స్థానికుల బలగం ఉంది. నాలుగు వైపులా మోహరించివున్న మిలిటరీ దళాలు దుర్గమమైన యీ కంటక మార్గాల్లో ప్రయాణం చేయడమంటే యిబ్బందేనని ప్రభుత్వాధికారులు గుర్తింపుకు తెచ్చుకొన్నారు.పోరాటంలో తమకు పట్టుబడ్డ మనుషులను పట్టుకొని కూపీలు తీయడం ప్రారంభించారు. నరసిం హారెడ్డికి ప్రత్యక్ష పరోక్ష సహాయాలు అందజేశారని అనుమానమున్న పెక్కుమంది కట్టుబడి యినాందార్లు, తవర్జీదార్లను పట్టి జైళ్ళలో పెట్టి హంసించడం ప్రారంభించారు. వారినుంచి నరసిం హారెడ్డి అన్న(కుమార మల్లారెడ్డి) తొలినుంచి తమ్ముడికి వ్యతిరేకంగా నిల్చాడు. బ్రిటీష్ వారికి ఆఖరు దాకా పూర్తి అండదండలిస్తూ వచ్చాడు.(తమకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా నరసిం హారెడ్డి అన్నలిద్దరకూ వస్తున్న రు.23.5.4. పైసల పెన్షన్ ను రెండింతలు చేస్తూ కుంఫిణీ ప్రభుత్వం 1847 జూన్ 26న వుత్తర్వు చేసింది)నరసింహారెడ్డి కొత్తకోటలోని తన మామ యింట్లో పెళ్ళాం బిడ్డలను, తల్లిని వదిలిపెట్టి వెళ్ళాడు. పెద్దకొడుకు మాత్రం యెట్లాగో తప్పించుకు వెళ్ళాడు. మిగతా కుటుంబ సభ్యులనంతా పట్టుకొని మిలిటరీ యెస్కార్ట్తో కడపకు తీసుకుపోయి అక్కడొక బంగళాలో పెట్టి నిర్భందించి వుంచారు. చుట్టూ మిలిటరీ పరా వుంచారు.నరసిం హారెడ్డి గాలింపు ప్రారంభమైంది. ఆయన్ను యెట్లాగైనా పట్టుకోవడం ప్రబుత్వానికి వొక ముఖ్య ధేయమై పోయింది. పెద్దా చిన్నా అధికారులందర్నీ యీ పనిమీదకే పురమాయించడం జరిగింది. జిల్లా అంతటా వాళ్ళకు యిదే నిత్య కార్యక్రమమైపోయింది.నరాసిం హారెడ్డి కొండలు కోనలు దాటి హైదరాబాదు ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ జనసమీకరణ చేస్తున్నాడని కొందరు, కాదు నల్లమల కొండల్లోనే ఉన్నాడని మరికొందరు, ఈ పక్క అడవుల్లోనుంచి వెళ్ళాడనీ, కాడు ఆ పక్క తిప్పలమీద నుంచి వెళ్ళాడనీ- యిట్లా తలా వొక మాటా, తలా వొక సలహా. ఈ అన్ని తావులకూ మనుషుల్ని పంపి, మిలటరీని పంపి వెతికించేవారు. వొక దశలో వర్షాలు పడి వాగులు నిండి ప్రవహించడంతో మిలిటరీ వాళ్ళు ప్రయాణించడం కష్టమైపోయింది.ఆ వూరును దోచుకోవడానికి వస్తారనీ, యీ వూరును కొల్లగొట్టడానికి వచ్చారనీ- యిట్లా రోజుకో పుకారు. వారానికో వార్త. లూటీలు, దోపీడీలు జరక్కుండా ఆయా వూళ్ళలో యెక్కదికక్కడ జగజ్జెట్టీలవంటి వాళ్ళను యేరి ప్రత్యేకంగా బత్తాలిచ్చి జీతాలిచ్చి గ్రామ కాపలాలు యేర్పాటు చేశారు. మరికొందర్ని మిలిటరీకి సహాయంగా వుంచారు.కొత్తకోటలో కొన్ని పత్రాలు దొరికాయి. నరసిం హారెడ్డికీ హైదరాబాదులోని కొందరు నవాబులకూ మధ్య జరిగిన వుత్తర ప్రత్యుత్తరాలున్న పత్రాలు, గోల్కొండ నవాబు మొహరుతో వున్న వొక పత్రం కూడా దొరికింది కానీ, అది ఫోర్జరీదని తేలిందట. హైదరాబాదులోని రెసిడెంటుకు తాకీదులు వెళ్ళాయి- నరసిం హారెడ్డి, ఆయన సహచరులనబడే వారిపై గట్టి నిఘా వుంచి పెట్టమనీ. అనుమానమున్న ప్రతి మనిషినీ పట్టితెచ్చి జైళ్ళలో పెట్టేవారు. సకల సమాచారమూ రాబట్టేవారు. జిల్లాలోని జైళ్ళన్నీ యీ బాపతు మనుషులతో నిండిపోయాయి. ఒక దశలో 600 మంది దాకా జైళ్ళలో ఉన్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి.నరసిం హారెడ్డిని ప్రభుత్వ ద్రోహిగా ప్రకటించారు. ఆయన్ను పట్టిచ్చినవారికి వెయ్యి రూపాయలు బహుమానం అని చాటింపులు వేయించారు. కొంతకాలంపోయిన తరువాత రెండువేలు బహుమానమన్నారు. ఒకా నరసిం హారెడ్డినేగాక ఆయన ముఠాలోని ముఖ్యులనబడే అయిదుమందిని పట్టిచ్చిన వారికి కూడా బహుమానాలని చాటించారు. గోసాయి వెంకయ్య, కర్నం అశ్వద్దామ, దాసరి రోశిరెడ్డి, జంగం మల్లయ్య- యిట్ల ముఖ్యుల జాబితా యెప్పటికప్పుడు పెరిగిపోతూ వచ్చింది. వీళ్ళలో మరీ ముఖ్యుడు ఆకుమళ్ళ గ్రామానికి చెందిన గోసాయి వెంకయ్య. నరసిం హా రెడ్డి తిరుగుబాటు వెనుక గోసాయి వెంకయ్య ప్రోత్సాహ ప్రేరణలు ప్రధానంగా పనిచేసినట్లు కలెక్టర్ భావించాడు.ఈ గోసాయి వెంకయ్య నరసిం హారెడ్డికి వొక విధంగా మతగురువు వంటివాడనీ, అప్పుడప్పుడూ భవిష్యద్దర్శనం చేసి రెడ్డికి కొన్ని హితబోధలు చేసేవాడనీ,కుంఫిణీ సర్కారుపై సాయుధ పోరాటానికి దిగనిదే నరసిం హారెడ్డికి అతీగతీలేదనీ మంత్రోపదేశం చేసిన వాడు గోసాయి వెంకయ్యేననీ కలెక్టర్ గట్టిగా అభిప్రాయపడినాడు. ఎన్ని తుపాకీ గుండ్లు తగిలినా నిన్నేమీ చేయవని చెప్పి రెడ్డికి యేదో పసరు పూత పూసి ఆశీర్వదించి పంపాడని కూడా అంటారు. కలెక్టర్ రిపోర్టులో యితన్ని గూర్చి వివరంగానే వ్రాశాడు.ఏమైతేనేం, మిలిటరీ సహాయంతో ప్రభుత్వం జరిపిన యీ గాలింపు చర్యలవల్ల నరసిం హారెడ్డి బృందంలోని కొందర్ని పట్టుకోగలిగారు. వీళ్ళందరినుంచీ సాక్ష్యాలు నమోదు చేసి, వీళ్ళ వాదనలు విచారించి కేసును నడిపి ఫౌజుదారీ అదాలత్(కోర్టుకు)కు సమర్పించడానికి ప్రభుత్వం డబ్ల్యు. ఆ.డి.ఇంగ్లిస్ ను స్పెషల్ కమీషనర్ గా నియమించింది. ఇట్లా యీ కర్మకాండతో జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసాలు గడిచిపోయాయి.అక్టొబరు నెల వచ్చింది. నరసిం హారెడ్డి ప్రభుత్వానికి దొరికిపోయాడు. ప్రభుత్వ వర్గాల్లో సంతోషం పెల్లుబికింది.
1846 అక్టొబరు 6న పట్టుబడిన వైనం
ఎర్రమ-నల్లమల కొండల మధ్య గల పేరుసోమల కొండల్లో జగన్నధ దేవళంలో నరసిం హారెడ్డి వున్నాడని తెలిసి కలెక్టర్ కాక్రేన్ మిలిటరీ సాయంతో అక్కడికి వెళ్ళాడు. కొండల చుట్టూ సైన్యాన్ని పెట్టి తుపాకులతో కాల్పుల వర్షం అన్ని దిక్కులనుంచీ కురిపించమన్నాడు. ఈ కాల్పుల కుండపోతలో దాదాపు 40-50 మంది నరసిం హారెడ్డి మనుషు చనిపోయారు. 90 మంది పట్టుబడిపోయారు. మరో వందమంది దాకా బాగా గాయపడ్డారు. నరసిం హారెడ్డి నిస్సహాయుడుగా మిగిలిపోయి యెటూ పోలేక చిక్కుబడి పోయాడు. కాలికి గుండు దెబ్బ తగిలి కుంటుకుంటూ కొదమసింగం లాంటి మనిషి మిలిటరీకి దొరికిపోయాడు. మూడు నెలల అరాచకం మూడు నిమిషాల్లో అంతమైపోయిందనుకున్నాడు కలెక్టర్.కేసు నడిచింది. మొత్తం 901 మదిపై నేరం మోపబడింది. వేరిలో 412 మంది పై నేరం రుజువు కాలేదని వదిలివేయడం జరిగింది. 273 మందిని స్వల్పమైన సెక్యూరిటీ తీసుకొని వదిలివేశారు. 112 మందికి మాతం కఠిన శిఖలే పడ్డాయి. 14 ఏళ్ళనుంచి 5 ఏళ్ళదాకా జైలు శిక్షలు. ఎంతమందో స్పష్టంగా తెలియడంలేదుగానీ బంకోలుకు పంపించబడ్డారు. నరసిం హారెడ్డికి మాత్రం వురిశిక్ష పడింది. ఫౌజుదారీ అదాలత్(కోర్టు) మజ్జారి నరసిం హారెడ్డిని వురితీయమని తీర్పు చెప్పింది. ఊరకే వురితీయడం కాదు. వురి తరువాత అతని శిరస్సును కోయిలకుంట్ల దగ్గర వొక బురుజుపై గొలుసులతో బంధించి తూకుమానుకు వేలాడదీయవలసిందిగా కూడా తీర్పు. 1834 నాటి రెగ్యులేషన్ వొకటి సెక్షన్ రెండు కిందనూ, 1802 నాటి రెగ్యులేషన్ యెనిమిది సెక్షన్ పది కిందనూ యీ వురి శిక్ష విధించామని కోర్టు తీర్పు- తిరుబాటు, హత్యలు, దొంగతన్నలు చేసిన నేరానికి.ఈ వురిశిక్షకు గవర్నర్ ఆమోద ముద్ర 1847 ఫిబ్రవరి 6న పడింది.
1847 ఫిబ్రవరి 22
పలానా రోజున పలానా చోట నరసిం హారెడ్డిని వురి తీయబోతున్నామని ప్రభుత్వం వూరూరా చాటింపు వేయించింది. 1847 ఫిభ్రవరి 22 వ తేడి సోమవారం(ఉదయం)7 గంటలకు కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో పర్యవేక్షనలో నరసిం హారెడ్డిని ఘోరంగా వురితీశారు.దాదాపు 2 వేల మంది పై చిలుకు ప్రజలు- తమను నిశ్శబ్ద రక్కసి ఆవహించి తమనోళ్ళు కుట్టేసినట్లు కిమ్మనకుండా, వళ్ళంతా కళ్ళు చేసుకుని నిక్కి నిక్కి చూశారు. ఈ నరసిం హా రెడ్డి శిరస్సు రెండుమూడు తరాలదాకా చుట్టు పక్కల ప్రజల్ని హెచ్చరిస్తూ 1877 దాకా ఆ బురుజుకు వేలాడుతూ ఉండిందట.(A manual of the Kurnool District, Narahari Gopala Kristanamaiah chetty, Madra, 1886, P.42.)
Comments
పది రోజుల క్రితం మీరు మొదటి భాగం రాసినప్పుడే “బంగోరె”ది చాలా మంచి వ్యాసం వుంది చూడండి అని చెప్దామనుకున్నాను. ఇప్పుడు మీరు ఆ వ్యాసం నుంచి ముఖ్య సమాచారాన్నంతా పొందుపరచడం బాగుంది. ఒక మనవి! ఇలాంటి చారిత్రక, సాహిత్య పరమైన వ్యాసాలు రాసేటప్పుడు మీరేదైనా పుస్తకంనుంచి ఉటంకింస్తుంటే ఆ పుస్తకం/వ్యాసం పూర్తి వివరాలు కూడా యిస్తే ఆసక్తి కలవాళ్ళు దాన్ని సంపాదించి చదువుకోగలరు. ఉదా: పై వ్యాసం నాకు తెలిసి మొదటిసారిగా
“బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు – కడప జాబుల సంకలనం”, బంగోరె (సం), శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, 1977
లో ప్రచురింపబడింది.
అభినందనలతో,
–శ్రీనివాస్
intha goppa swathantra porataaniki saraina prachara lbhinchaka povadamante telugu prajalu maroka saari thappani sariga siguu padalsinde.