Knowledge is power-నిజమేనా?
by admin@ 24fps
Knowledge is power అన్నారు కానీ ఆ knowledge కి access లేకపోవడం పెద్ద సమస్య మనకు మొన్నటి వరకూ. నేటికీ ఆ సమస్య తీవ్రంగానే వున్నా అంతర్జాలలో వచ్చిన సమాచార విప్లవం ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఇప్పుడు కలుగుతోంది. తమకు తెలిసిన, అలాగే తెలుసుకుంటున్న, తెలుసుకోగోరుతున్న సమాచారం వివిధ వెబ్ సైట్ల ద్వారా ఇప్పుడు మంకి చాలామటుకు ఉచితంగానే లభ్యమవుతోంది. కాకపొటే లెక్కకు మించిన వెబ్ పేజీలతో అనూహ్యంగా పెరిగిపోయిన సమాచార సంపదను శోధించి అందులో మనకు కావలసినది ఏరుకోవడం ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్.అయితే ఈ అవరోధాన్ని దాటడానికి ఉపయోగపదే సాధనాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సినది బ్లాగులనే. గత దశాబ్ద కాలంలో బ్లాగు సృష్టించిన అవకాశాలు అన్ని ఇన్నీ కావు. ఒక విధంగా ఆంగ్ల భాషలో ఈ బ్లాగు విప్లవం మొదలయ్యి ఇప్పుడిప్పుడే చల్లారిన సూచనలూ కనబడుతున్నాయి. కానీ భారతీయ భాషల్లో వెబ్ సైట్ సృష్టించి అందులో ఆయా భాషల వళ్ళకి సులభంగా అర్థమయ్యేలా ప్రాంతీయ భాషల్లో సమాచారం అందచేయడం ఒకప్పుడు ఎంతో కష్టమైన, క్లిష్టమైన పనిగా వుండేది. కానీ గత రెండు మూడేళ్ళలో ఈ పరిస్థితి మారిందని చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలున్నాయి. అంతర్జాలంలో భారతీయ భాషల్లో వ్రాయగలగడం మరియు చదవగలగడం ఇప్పుడు ఎంతో సులభమైన పని. ఈ అవకాశాన్ని ఎంతో మంది ఔత్సాహిక రచయితలు అందిపుచ్చుకుని తమ తమ భాషల్లో బ్లాగులు ప్రారంభించారు.
అంతర్జాలంలో తెలుగులో వ్రాయగలగడం ఎంతో మంది తెలుగు వారిని మేల్కొలిపిన మాట వాస్తవం. గత సంవత్సర కాలంలో వెలువడినంత తెలుగు సాహిత్యం, రచనా వ్యాసంగం ఇంతకు ముందు ఎన్నడూ ఒక్క సంవత్సరంలో వచ్చిన సాహిత్యంకంటే కనీసం రెండు రెట్లు అయినా అధికం అయ్యివుండొచ్చు. అందుకు ముఖ్య కారణం అంతర్జాలంలో మన వాళ్ళు తెలుగులో తమ రచనలను ప్రచురించడమే. 2007 లో దాదాపు 1000 మంది తమ బ్లాగుల ద్వారా తమ తమ స్థాయిలో తమ జ్ఞానాన్ని నలుగురితో పంచుకునే అవకాశం కలిగింది.
2007 లో మనం ఎంతో సాధించాం. ఈ ప్రయత్నంలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరూ రాబోయే కొత్త సంవత్సరంలో తమ ప్రయత్నాలను రెట్టింపు చేయాలి. బ్లాగు వ్రాసే వాళ్ళే బ్లాగులు చదివే వాళ్ళుగా కాకుండా, మేలైన తెలుగు బ్లాగులు, పత్రికలను మరింత మందికి పరిచయం చేయాలి. ఈ ప్రయత్నంలో ఎంతో మంది తమ విలువైన సమయాన్ని వెచ్చించి నేడు తెలుగు బ్లాగులు ఒక స్థాయికి చేరడానికి ఉపయోగపడ్డారు. వారి శ్రమ వృధా కానివ్వకుండా 2008 లో తెలుగు బ్లాగర్సు ఈ ప్రయత్నాన్ని మరింత ముందుకి నడిపించి, సమాచారాన్ని మరింత సులువుగా అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయాలని,అలాగే ఈ సంవత్సరం మన వాళ్ళకి Year of Knowledge అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు.