దానవీరుడు- రేనాటి చంద్రుడు-బుడ్డావెంగళ రెడ్డి
by Swarupkrishna Murthy
రాయలసీమలో బహుముఖ ప్రచారంలో ఉన్న గేయము బుడ్డావెంగళ రెడ్డిని గురించిన పాట. రైళ్ళలోను, బస్సులలోను తిరునాళ్ళలో ఎక్కడబడితే అక్కడ వినిపించే ఈ పాట రాయలసీమవాసుల దాతృత్వాన్ని ప్రదర్శిస్తుంది. బుడ్డా వెంగళరెడ్డి రేనాటి సీమలో దానకర్ణుడు. అందువల్లనే రేనాటి సీమకు ఉయ్యాలవాడ నారసిం హారెడ్డి సుర్యుడు కాగా, బుడ్డ వెంగళరెడ్డి చంద్రుడైనాడు. ఈ సూర్య చంద్రులిరువురు ఒకే గ్రామానికి చెందినవారు కావడం విశేషం. ఈయన కాలం 1822-1900.
1866లో విక్టోరియా మహారణి బుడ్డా వెంగళరెడ్డి గారి దాతృత్వాన్ని ప్రశంసిస్తూ స్వర్ణపతకాన్ని బహూకరించింది. ఇది ఇప్పటికీ ఉయ్యాలవాడలో బుడ్డా వెంగళరెడ్డి గారి వంశస్థుల వద్ద ఉంది. ఈ స్వర్ణపతకముపై ముదు భాగంలో ఇంగ్లిష్ లో , వెనుకభాగంలో తెలుగులో ఇట్లా ఉంది.
Presented to Budda Vengala Reddi as a token of the high appreciation of Her Majesty’s government of this munificent liberality to his destitute contrymen in the famine of 1866.
1866 సంవత్సరములో సంభవించిన క్షామములందు నిరాధారముగా వుందిన తన స్వదేశస్థులపట్ల జరిగించిన వుత్కృష్టమయిన ఔదార్యమునకు గాను హర్ మెజస్టీ రాణిగారి వల్ల చేయబడిన శ్రేష్ఠమయిన గణ్యతకు ఆన్వాలుగా బుడ్డా వెంగళరెడ్డి గారికి బహుమానము యివ్వబడ్డది.
1866లో రాయలసీమలో తీవ్రమైన కాటకం వచ్చింది. ఇది ధాత నామ సంవత్సరంలో రావడంచే దీనిని ధాత కరవు అన్నారు. ఇది అనంతపురం మండలంలో వచ్చింది. ఈ కరవు కాలంలో బుడ్డా వెంగళరెడ్డి కరవు పీడితులైన ప్రజలకు మూడు నెలల పాటూ అన్న వస్త్రాలు ఇచ్చి కన్నతండ్రిలాగా కాపాడాడు. దాదాపుగా పండ్రెండు పాతరల ధాన్యాన్ని ఖర్చు చేశాడట. రాయలసీమలో పుట్టిన అపర దానకర్ణుడు వెంగళరెడ్డి. రాయలసీమ ప్రజలు ఇప్పటికి ఇతని దాతృత్వాన్ని గురించి చెప్పుకుంటారు.
వెంగళరెడ్డి గారి గురించి రాయలసీమ జానపదులు పాడుకునే పాటలల్లో ఇతని దాతృత్వాన్ని గురించి 7 కథలు ఉన్నాయి. అవి
1. బ్రాహ్మణుడు ఒకడు మజ్జిగనడుగగా ఆవును దానము చేయుట.
2. ఫకీరు స్త్రీకి వస్త్రదానము చేయుట
3. చెన్నపట్టణము రాణి దగ్గర ప్రశంసలందుకొనుట
4. మాలమాదిగల పిల్లలకు తన యెద్దును కోసికొని తినుటకు దానము చేయుట.
5. తనను జంపడానికి వచ్చిన దొంగలను సత్కరించి పంపుట
6. తనను మృత్యువు నుండి కాపాడిన మాలవానికి పెండ్లి చేయుట
7. జొన్న కంకులను కూలీలకిచ్చి, తాను వట్టి చొప్పను పరిగ్రహించుట.
ఉత్తరాన ఉయ్యాలవాడలో ఉన్నది ధర్మం చూడరయా..
( బుడ్డా వెంగళరెడ్డిని గురించి గుడ్డి దాసరులు పాడేపాట)
సేకరణ: డా. తంగిరాల సుబ్బారావు గారు
స్థలం: కొయిలకుంట్ల, కర్నూలు జిల్లా
ఉత్తరాది ఉయ్యాలవాడలో
ఉన్నది దరమం సూడరయా!
నేటికి బుడ్డా యెంగళరెడ్డి
దొడ్డ ప్రెబువనీ తెలియరయా!! || ఉత్తరాది||
దొడ్డ పెబువనీ దొరలు మెచ్చగా
ఇడుపున కూర్చోనుండునయా!
ఇడుపున కూర్చో నెంగళరెడ్డీ
ఇక ఇక నగుతా నుండునయా!! ||ఇడుపున||
అరి నారాయణ అనేటి జనులకు
అన్నవస్తరము లిచ్చెనయా!
గోయిందా అని పాడే జనులకు
గో దానమే సేసునయా!! ||గోయిందా||
అందీ లండి లెండి బంగారము
బండ్లు గట్టి తోలించెనయా!
బండి పైకము దండి కొమెరలో
దండిగ దరమము సేసునయా!! || బండి||
మాటా సొచ్చెం తెలిసిన ప్రెబువని
మల్లెపూల పాంపుండునయా!
పున్నెం సేసిన యెంగళరెడ్డికి
పూలపానుపే ఉండునయా!! || పున్నెం ||
పరాయి దేసం పోయిన రెడ్డికి
పాన్ పులేపు దిండుండునయా!
దిండి సుతారం మెండుగ జనులూ
అండ బాయకా నుందురయా!! || దిండి ||
పరాయి దేసం యెక్కడినుండియో
బాపనయ్య ఒకడొచ్చెనయా!
యెంగళరెడ్డీ యింటికి యెళ్ళీ
మజ్జిగేయమని అడిగెనయా!! || యెంగళరెడ్డీ||
యెంగళరెడ్డీ సిన్న బారియా
సిన్న బారియా సెన్నమ తల్లీ!
లేవలేకనే సల్లని తల్లీ
లేవులేవు అని పలికెనయా! || లేవలేకనే||
సూస్త తాళమని యెంగళరెడ్డీ
ఇంటిలోపలికి యెళ్ళెనయా!
కాండవమీనా సిబ్బి తీసితే
కదలక మజ్జిగ ఉండెనయా!! ||కాండవమీనా||
(కాండవమీనా సిబ్బి = కుండపైని మూతా)
పాడిలేని బతుకేల అంటనీ
రోసగింపులూ సేసెనయా!
పాలు సక్కెర పంచదారలూ
బాపనయ్యకే పంచెనయా!! || పాలు సక్కెర||
లేవు లేవు అని పోసిన మజ్జిగ
దోసమంచు మది నెంచెనయా!
ఆవును దూడను యెంగళరెడ్డీ
పగ్గమేసి పట్టించెనయా!! || ఆవును దూడను||
తల్లి పిల్లను యెంగళరెడ్డీ
పగ్గమేసి పట్టించెనయా!
నీదీ కాదిది నాదీ కాదూ
ఆ దేవుని సొమ్మని పలికెనయా!! ||నీదీ కాదిది ||
జీని యేసీ గురాన్ని యెక్కి
సెన్నపట్టణము సేరెనయా!
సెన్నపట్టణము సిన్ని దొరలునూ
వొంగి సలాములు సేసిరయా!! ||సెన్నపట్టణము సిన్ని||
మూలము తెలిసిన యెంగళరెడ్డీ
మూడులోకములు యేలెనయా!
యెండగాసినా మండలానికీ
యిరిక గలిగినా రెడ్డివయా!! ||యెండగాసినా||
పెళ్ళిళ్ళు కాని బీద బాపలకు
పెళ్ళిళ్ళూ సేపించెనయా!
కళ్ళూ కాళ్ళూ లేని వాళ్ళకూ
యెద్దు బళ్ళు తోలించెనయా!! ||కళ్ళూ కాళ్ళూ లేని||
బగరు సాలువ పాగా చుట్టీ
బారులు కొలువే యెళ్ళెనయా!
బళ్ళారి కోర్టులో బలే జవాన్లూ
చార్జీలూ సబిన్ స్పెక్టర్లు, గవర్నరు
వొంగి సలాములు సేసిరయా!
వొంగొంగి సలాములు సేసిరయా!!
మాటా సొచ్చెం తెలిసిన ప్రెబువని
మల్లెపూల పాంపుండునయా!
పున్నెం సేసిన యెంగళరెడ్డికి
పూలపానుపే ఉండునయా!! || పున్నెం ||
సెంగాయి పంచెలు సింగారించీ
రాణెమ్మ దగ్గరికి యెళ్ళెనయా!
రాణెమ్మ సూసీ కిలకిల నవ్వీ
రత్నహారమే మెడకేసునయా!! || రాణెమ్మ సూసీ ||
పన్నెండేలా పట్టాభూమికి
పన్నులేదనీ తెలిపెనయా!
పన్నులేని మన బీద పంటలని
యెంగళరెడ్డీ పలికెనయా!! ||పన్నులేని మన ||
యెకరాకూ ఒక దమ్మిడి పన్నూ
యేరుపాటు సేపించెనయా!
పున్నెం సేసిన రాణెమ్మ తల్లికి
పూలపానుపే ఉండునయా!! ||పున్నెం సేసిన ||
ఉత్తరాది ఉయ్యాలవాడలో
ఉన్నది దరమం సూడరయా!
నేటికి బుడ్డా యెంగళరెడ్డి
దొడ్డ ప్రెబువనీ తెలియరయా!! || ఉత్తరాది||
ఈ పాటను డా. తంగిరాల సుబ్బారావు గారు కర్నూలు జిల్లా కొవెలకుంట్ల బస్టాండులో నాగెళ్ళ సుబ్బరాయుడు అనే గుడ్డివాడు పాడగా సేకరించారు.
మన జానపద గీతాలు మన సంస్కృతిని తెలుపుతాయి. అంతేకాదు చరిత్ర నిర్మాణానికి జానపద గీతాలు దోహదం చేస్తాయి. రాయలసీమలో 19వ శతాబ్ధంలోని ఇద్దరు మహనీయులను గురించి తెలిపే వీరగాధలు, సుద్దులు, కోలాటంపాటలు ఇంకా కాపాడుకుంటున్న రాయలసీమ ప్రజలు నిజంగా ధన్యులు.
ఇద్దరు కర్నూలు జిల్లా ఉయాలవాడ వాస్తవ్యులే. ఒకరిది పౌరుషం. తిరుగుబాటు ధోరణి. పరాక్రమం. తేజం. అతడు ఉయ్యాలవాడ నారసిం హా రెడ్డి. అందుకే అతనిని రాయలసీమ సూర్యుడన్నారు. కారణం సూర్యుడు తేజస్సుకు ప్రతీక.
ఇంకొకరు దాన ధర్మాలు చేసి తన దాతృత్వంతో ప్రజలను కాపాడిన వాడు. దాన గుణం చల్లదన్ననికి, కాంతికి ప్రతీక. అతడు బుడ్డా వెంగళరెడ్డి. ఇతనిని రాయలసీమ చంద్రుడన్నారు. ఈ ఇద్దరు రేనాటి సూర్యచంద్రులు రాయలసీమ చరిత్ర పుటల్లో మరపురాని, మరచిపోలేని అధ్యాయాలు.
Comments
ఉయ్యాలవాడ నారసిం హా రెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి. ఇద్దరు మహనీయుల గురించి రాసిన మీరు ముందుగా అందుకోండి నా అభినందనలు.వీళ్ళద్దిరిగురించీ గతంలో ఎక్కడో అకడమిక్ చర్చ చదివాను.కానీ ఇంత జనరంజకంగా పాఠకులకు అందించిన తీరు ప్రశంసనీయం.దేశంలో ప్రతి చోటా ఇలాంటి మహనీయులు,తేజోమూర్తులూ ఎందరో ఉండేవారు.కొందరివయినా జీవితగాధలు మనకు అందుతున్నాయంటే రకరకాల వ్యక్తులు,భిన్న వృత్తులు,ముఖ్యంగా భిక్షుకవృత్తిలోని వారి చలవే.బిరుదురాజు రామరాజు ఇలాంటివెన్నో ఎన్నోరకాల మార్గాల్లో సంపాదించి మనకు అందించారు.అలగే బూదరాజు రాధాకృష్ణ మాండలికాల కోసం కూడా ఎన్నో బాధలు పడ్డారు,ఇంకా ముందుకెళితే గిడుగు,బ్రౌన్,మెకంజీ ఎందరో మహానుభావులు వృత్తి బిచ్చగాళ్ళ దగ్గరే చాలా సేకరించారు.ఏవో కొన్ని కులాల్లోనో,కుటుంబాలలోనో తప్ప ముత్తాతకు అవతల ఏమిటో ఈరోజు చాలా మందికి తెలీదు.అలాంటిది ఉయ్యాలవాడ నారసిం హా రెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి వంటి ఎందరో జాతిరత్నాల గురించిన సమాచారం ఇంకెందరు అనామకుల దగ్గర గుప్తంగా ఉండిపోయిందో???.మన ఉదారత్వం,దాతృత్వంవల్ల ఎందరో వృత్తికళాకారులు ముందు బిచ్చగాళ్ళుగా,తర్వాత అనాధలుగా అలా అలా అంతరించిపోయారు.అదే సమయంలో కొందరికి భోగవస్తువులుగా,రసికులు ఆదరించే కళలుగా ముద్ర వేయించుకొన్నవి క్రమంగా మధ్యతరగతి ప్రజల ఆమోదం పొంది ఈనాడు మర్యాదస్తుల మన్ననలు పొందుతూ ఎందరికో కడుపు నింపుతున్నాయి.సామాన్య ప్రజానీకపు కళలు అడుగంటి పోతున్న సమయంలోనూ,విలాస కళలు మాన్యవేషధారణ చేస్తున్న సమయంలోనూ ఒకటిరెండు సామాజిక వర్గాలు పోషించిన దళారీ పాత్ర కూడా చరిత్రలో రికార్డు అయివుంది.ఉయ్యాలవాడ చరిత్రను సినిమాగా తీయాలనే కోరికతో కొందరు ముందుకొస్తున్నారనే వార్తలు గత కొంత కాలంగా వింటున్నాము. గతంలోనూ కొన్ని వీరగాధలు తెరకెక్కక పోలేదు.కానీ అంతిమఫలితం చూస్తే ఆయా గాధలకు జరిగింది తీరని అన్యాయమే.తెలంగాణా ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన సర్వాయి పాపడి కధ ఎన్ని సార్లు సినిమాలుగా వచ్చింది?సర్దార్ పాపారాయుడు,సర్దార్ పాపన్న,ఇలాంటివే మరికొన్ని.కానీ ఏమయ్యింది.వీళ్ళు తీసుకునేది ఆ కధలోని కొన్ని పాత్రలు,కీలకఘట్టాలు,అందులోనే అరడజెన్ పాటలూ,మరో అర డజెను పోరాటాలు, ఇంకా ఆ వీరుడెక్కడుంటాడు? మీకు వీలైతే ఈ సూర్యచంద్రులిద్దరి చాయాచిత్రాలు ఒకసారి ప్రచురించండి అలాగే తంగిరాల సుబ్బారావు గారి గురించి కూడా మాకు పరిచయం చేయండి.
రాజేంద్ర గారూ,
మంచి మాటన్నారు. మన మెగాస్టారు ఉయ్యాలవాడ కథను తెరకెక్కిస్తారట! కానీ మీరన్నట్టు అరడజను పాటల్లో, అరడజను పోరాటాల్లో ఆ వీరత్వం పలచబడిపోగా, చిరంజీవిగా వున్న ఉయ్యాలవాడ వీరుడు నిజంగానే చిరంజవి అయ్యి మెగాస్టార్ అయిపోతాడు.సినిమా హిట్ చేసి కోట్లు గడిద్దామనే వ్యామోహంతో పాటు, కాస్త ఆ వీరునిపై గౌరవం, నిజంగానే ఆయన ఘనతను ప్రజలకు తెలియచెప్దామనే ఆలోచనా వుండి తీరాలి. అలాగే స్వరూప్ గారి లాంటి వారి పరిశోధననూ ఉపయోగించుకోవాలి. అంతేకానీ భారవి లాంటి దిక్కుమాలిన రచయితలపై ఆధారపడితే రామదాసుకి పట్టిన గతే ఈ వీరునికీ పట్టడం ఖాయం.
ఏదేమైనప్పటికీ స్వరూప్ గారు అందచేస్తున్న వ్యాసాలు అధ్భుతం.
it is really nice and most educative. preserving our past cultural heritage will deifintely help to build our great history. uyyaalawaada narasimhaareddy is one of the heros of rayalaseema. I heard about him but not in depth. now it is really good to read about him in a good artilce. thanks to dr.swarup. go on……….