1847లోనే మొదటి స్వత్రంత్ర పోరాట యోధుడు – విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
by Swarupkrishna Murthy
1857 సిపాయీల తిరుగుబాటు కంటే ముందే భారతదేశాన్ని దాస్య శృంఖలాలనుండి విడిపించడానికి ప్రయత్నం చేసి బ్రిటీష్ వారితో పోరాడిన వాడు ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి. 1847లో బ్రిటిష్ వారిమీద కత్తిగట్టి పోరాటం సలిపిన నరసిం హా రెడ్డి గురించి చరిత్రలో సరిగా చెప్పలేదు. తెలుగు నేలలోని జానపదులలో పిచ్చుకుంట్లా వాళ్ళు నరసిం హా రెడ్డి వీరత్వాన్ని గుర్తించారు. నిజానికి తెలుగు నేలలో స్వాతంత్ర సంగ్రామం నరసిం హా రెడ్డితో ప్రారంభమైంది.
మన చరిత్రను మనం రాసుకోలేదు. మన చరిత్రను పాశ్చాత్యులు రచించారు. వాళ్ళు వాళ్ళ దృష్టితో రాశారు. అందువల్లనే చరిత్రలో కనుమరుగైన అంశాలు ఎన్నో. అట్లాంటివి మన జానపదుల నోళ్ళలో నానుతున్నాయి. వాటి ఆధారంతో చరిత్రను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది.
పిచ్చుగుంట్లు పాడుకొనే ఈ పాటలో నరసిం హా రెడ్డీ వీరత్వం, పౌరుషం ఉన్నాయి. నరసిం హా రెడ్డి పాలెగార్ వ్యవస్తకు ప్రతినిధి. బ్రిటిష్ అరాచకాలకు ఎదురు తిరిగి ట్రెజరీలను కొల్లగొట్టాడు. దాదాపుగా 9000 మంది సైన్యంతో బ్రిటిష్ వారిమీద తిరుగుబాటు చేశాడు. చివరికి బ్రిటిష్ చేతికి చిక్కి 1847లో ఉరితీయబడినాడు.
నరసిం హా రెడ్డిని గురించి పిచ్చుగుంట్లు పాడుకొనే పాట
వొహువా! నరసిం హా రెడ్డి
నీ పేరంటే- రాజా నరసిం హా రెడ్డి || వొహువా ||
పుట్టింది రూపనగుడి
పెరిగిందుయ్యాలవాడ
పాలు వన్నము దీనింది
గుళ్ళదుర్తి గ్రామంలో || వొహువా ||
నారసిం హా రెడ్డి దెబ్బా
భూమీ గడగడా వొణికే
భూమినుండే ఆదిలక్ష్మీ
తోడు బలికిన్నాది గాదా!- || వొహువా ||
భళిరే! నరసిం హా రెడ్డి!
నీ పేరంటే- రాజా నరసిం హారెడ్డీ! || వొహువా ||
నారసిం హ రెడ్డి దెబ్బా
ఉరవకొండా కెరుకాయే
ఉరవకొండా సాలె వాడూ
లాకదబ్బలు ఈపునేసే | భళిరే |
(లాక దెబ్బలు = సాలె పడుగులో పెట్టే కర్రలు)
నారసిం హారెడ్డి దెబ్బా
గుత్తిసీమా కెరుకాయే
గుత్తిలుండే సాకలోడు
సాకిరేవ్ బండాలు ఇడిసే | భళిరే |
సైరా! నరసిం హా రెడ్డి
నీ పేరంటే- రాజా నరసిం హా రెడ్డి!
నారసిం హా రెడ్డి దెబ్బా
ఊరబిచికలు ఊరనుండవు
పొట్టి పెచికలు పొలము నుండవు
పసీపిల్లలు పాలు తాగరు – | సైరా |
నారసిం హా రెడ్డి ఎంబడి
అయిదు నూర్లకు జనము లేచే
కత్తీ…కత్తికీ ఖేలెం
కానీ నరసిం హా రెడ్డీ- | సైరా |
(ఖేలెం= ఆట)
భళిరా! నరసిం హా రెడ్డి!
నీ పేరంటే- రాజా నరసిం హా రెడ్డి!
నారసిం హా రెడ్డి ఎంబడి
గోసాయీ ఎంకన్న
గోసాయి ఎంకన్నా
ఒడ్డే ఓబన్నేమొ- | భళిరా |
కొయిలాకుంట్లా కొట్టినాడూ
గిద్దలూరూ దోచినాడూ
కుడీమీసా మొడాదిద్దీ
రచ్చ కట్టన కొలువు దీరే- | భళిరా |
వొహువా! నరసిమ్హా రెడ్డి
నీ పేరంటే- రాజా నరసిం హా రెడ్డి || వొహువా ||
కొయిలకుంట్లా తాసీల్దారూ
శిరసునేమో నరికినాడూ
బొందిలోడూ నారసింగు
వాని శిరసు నరికినాడూ
రెండు శిరసులు నరికినాడూ
నయనలప్పలో దాచినాడు- |వొహువా|
(నయనలప్ప కర్నూల్ జిల్లాలో ఒక ప్రాంతం)
గోలుకొండది గొడ్డు గొర్రా
బుక్కపట్నం, సన్న బియ్యం
కాలవాడీ ఉడికె తప్పుడు
కల్లి బిల్లీ లేపినాడూ- |వొహువా|
సైరా! నరసిం హా రెడ్డి
నీ పేరంటే- రాజా నరసిం హా రెడ్డి!
కొయిలకుంట్లా కరణమయ్యా
ఆయన పేరే ఎంకట్రాముడు
లక్ష్మి రెడ్డి ఢాకలాకూ
దత్తనాలా మూట ఎత్తుకు
పారిపోతడు కరణమయ్యా- |సైరా|
(దత్తనాలా= దస్త్రాల మూట)
నారసిం హా రెడ్డీ ఎంబడి
అయిదు నూర్లకు జనము లేచే
కచేరీనీ మట్టు బెట్టే
ధనాహారం కొల్లగొట్టే- |సైరా|
భళిరే నరసిం హా రెడ్డీ
నీ పేరంటే- రాజా నరసిం హా రెడ్డి!
జగన్నథుని కొండ మీదా
ఆదిశక్తీ దేవళంబూ
ఆదిశక్తిని తోడుబెట్టుకు
అయిదు నూర్లకు నరికినాడూ- |భళిరే|
తండ్రి పేరే పెద్దిరెడ్డీ
తాత పేర్ జయరామిరెడ్డీ
ఇంటి పేరే మద్దెలోళ్ళూ
తానపేర్ నరసిం హ రెడ్డీ |భళిరే|
ఈ పాటను పిచ్చుగుంట్ల పెదనాగన్న కుంఆరుడు చిన నాగన్న పాడాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా చెలిమళ్ళ రుద్రవరం గ్రామంలో. పాట సేకరించిన వారు – డా. తంగిరాల సుబ్బరావు గారు
దొరవారి నరసిం హ్వ రెడ్డీ!
(కోలాటం పాట)
రాయలసీమ పళెగాళ్ళ పుట్ట. పల్లెకొక పాళెగాడు. ఉరికొక పాళెగాడు. రాయలకాలం నుండి పాళెగాండ్లు విజృంభించారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి ఒకడు. కంపెని దొరతనము ఎదిరించి వీరమరణం పొందినాడు. అతనిని గురించి కోలాటం పాట డా. తూమాటి దొణప్ప గారు సేకరించినది మీ కోసం.
దొరవారి నరసిం హ్వ రెడ్డి!
నీ దొరతనము కూలిపోయె రాజా నరసిం హ్వ రెడ్డి! || దొర ||
రేనాటి సీమలోనా రెడ్డోళ్ళ కులములోనా
దొరవారీ వమిశానా ధీరుడే నరసిం హ్వ రెడ్డి || దొర ||
కొయిల్ కుంట్లా గుట్టలేంటా కుందేరూ వొడ్డులెంటా
గుర్రమెక్కీ నీవు వస్తే కుంపిణీకీ గుండె దిగులూ || దొర ||
కాలికీ సంకెండ్లు వేసీ చేతీకీ బేడీలు వేసీ
పారాతో పట్టి తెచ్చీ బందికానులొ పెట్టిరీ || దొర ||
(పారాతో = పహరా తో)
కండ్లకూ గంతాలు గట్టీ నోటినిండా బట్లు పెట్టీ
నిలువునా నీ తలా గొట్టీ కోట బురుజుకు గట్టీరీ || దొర ||
కాసిలో నా తల్లికేమో చావు సుద్దీ తెలిసినాదీ
కన్న కడుపే తల్లటించే గంగలోనా కలిసే || దొర ||
( ఆ సమయంలో నరసిం హా రెడ్డి తల్లి కాసిలో ఉన్నట్లు చెబుతారు)
దొరవారి నరసిం హ్వ రెడ్డి!
నీ దొరతనము కూలిపోయె రాజా నరసిం హ్వ రెడ్డి!
నరసిం హా రెడ్డిని ఉరితీసింది దాదాపుగా 1847 ప్రాంతంలో. ఉరి తీసి ఉరికంబము పై దాదాపుగా 1877 వరకు వేలాడదీసే ఉంచినారని – మ్యాన్యుయల్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సి – వ్యాల్యూం 3 పుట 251 లో చెప్పబడిందని తంగిరాల వారు సేకరించారు.
Comments
jamal vali uyyalawada
my school b.c.s.r high school
i am power narashima reddy