సమష్టి నృత్య కళ- చెక్కభజన సంగీత నృత్యాత్మకం
by Swarupkrishna Murthy
ప్రకృతిలోని వస్తువులను వాడుకుని వాటి ద్వారా సంగీతాన్ని సృష్టించుకుని దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ తానే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా ఉల్లాసవంతమైన ప్రపంచంలోనికి తీసుకుపోగలగే లక్షణం ఒక్క జానపదుడికే సొంతం. ఈ లక్షణం చెక్కభజనలో కనిపిస్తుంది. కర్రముక్కలకు తాళాలు జోడించి వాటితో లయను సృష్టించడం , సాముహికంగా అడుగులు వేయడం చెక్కభజనలో కనిపించే దృశ్యం. చెక్కభజన సామూహిక నృత్యరూపం. పండుగ, పర్వ దినాల్లో, జాతరలు, ఉత్సవాలలో , సాయంకాలం ఊళ్ళో గుడిముంగిట, ఎప్పుడు పడితే అప్పుడు , ఎక్కడపడితే అక్కడ జానపదులు చెక్క భజన ప్రదర్శిస్తుంటారు. భారత రామయణాది కధలను పాటలుగా మలచుకుని ఏ కళాకారులు నృత్యం చేస్తారు. గురువు మధ్యలో ఉంటాడు. అతను జట్టును నడిపిస్తుంటాడు. అతని ఆదేసానుసారంగా జట్టు అడుగులు వేస్తుంది. చెక్కభజనలో నృత్యంలో అడుగులు వేస్తారు. ఈ అడుగులు చాలా ఉన్నాయి. అది అడుగు, రెండు, మూడు, పర్ణశాలా , కుప్ప కొట్టడం, కులుకు వంటివి అనేకం ఇందులో ఉంటాయి. మొత్తం గుంపు ఒకే రకంగా అడుగులు వెయడం, చెక్కలు కొట్టడం మధ్యలో గురువు అరుపులు , కేకలు, ఈ ప్రదర్శనను కనులపండువు చేస్తాయి. గురువు ఒక పాటలోని చరణం పాడితే దానిని జట్టులోని వారందరూ తిరిగి పాడతారు. ఈ పునరుక్తి వలన పాటకు అందం వస్తుంది.
చెక్కభజనను ప్రాచుర్యం లోనికి తెచ్చిన వాడు కంచెర్ల గోపన్న. రామదాసుగా ప్రసిద్దుడైన గోపన్న కీర్తనలు భజన సంప్రదాయానికి చెందినవి. భజనల్లో పండరి భజన, చెక్కభజన, కులుకు భజన వంటివి అనేకం. వీటిలో చెక్కభజనలో నృత్యంకూడ ఉండడంచేత ఇది మరింత కళాత్మకతను కలిగి ఉంది.
మధ్యయుగాల్లో భారత దేశంలో వచ్చిన భక్తి ఉద్యమ ప్రభావం చెక్క భజనలో చూడవచ్చు. వేదాంతాని సామాన్యులకు అందించాలన్న ఉద్దేశ్యం భక్తి ఉద్యమంలో కనిపిస్తుంది. చెక్కభజనలో కూడ వెందాంత పరమైన భారత, రమయణ, భాగవతాది కధలను పాటల రూపంలో పామరులకు కూడ అర్థమయ్యే భాషలో చెప్పడం , అందువల్లనే చెక్కభజన సర్వ జనాదరణీయమైంది. రాముడి గుడిలేని ఊరు లేనట్లే, అంధ్ర దేశంలో చెక్కభజన గుంపు లేని ఊరు లేదు. ప్రతి గ్రామంలోను చెక్కభజన గురువు ఉన్నాడు. చెక్కభజన గుంపు ఉంది.
చెక్కభజనకు కడప జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ ప్రతి గ్రామంలోను చెక్కల శబ్ధాలు, గురువుల కేకలు, జట్టులోని కళాకారుల అడుగుల నాదాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడి నుండి చాలమంది కళాకారులు భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు ఇచ్చారు. కడప జిల్లలోని గొరిగనూరు వాసి పుల్లయ్య, చెన్నూరు వాసి ఈశ్వర రెడ్డి చెక్కభజనలో ప్రయోగాలు చేస్తున్నారు.
చెక్కభజన కూడ జానపదత్వం కోల్పోయింది. ఆధునిక ప్రసార మాధ్యమాలు టీ.వి , సినిమాలు చెక్కభజనను దెబ్బ తీస్తున్నాయి. వీటిని తట్టుకొని నిలబడడానికి ఈ కళాకారులు కూడా చెక్కభజనలో ప్రయోగాలూ చేస్తున్నారు. క్యసియో, డ్రంస్ వంటి ఆధునిక సాధనాలు ఉపయోగించడం ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల సహజమైన జానపదత్వం లోపించి పోయింది. నిజానికి చెక్కభజనలో కేవలం తప్పెట మాత్రమే ఉపయోగిస్తారు. అప్పుడె చెక్కభజనకు అందం వస్తుంది. అంతేకాకుండా సినిమా పాటలు చెక్కభజనలో చోటుచేసుకున్నాయి. దీని వలన సహజత్వం లోపించింది.
మన జానపద కళారూపాలు మన సంస్కృతికి నిలువెత్తు దర్పణాలు. వాటిని కాపాడుకోకపోతే మనం సంస్కృతీ విధ్వంసకులమవుతాము. తల్లి రోమ్ము గుద్దిన వాళ్ళమవుతాము. కాబట్టి జానపద కళారూపాలు మరుగున పడకుండా కాపాడుకోవలసిని భాద్యత అందరి మీదా ఉంది.
Comments
వివరణ బావుంది. ఇంకా అనేక జానపద కళారూపాలు కనుమరుగవుతున్నాయి.
ఒక ప్రశ్న -
అవి మారుతూ అయినా ఏదో రూపంలో కొనసాగుతూ ఉండడం పూర్తిగా మాయమవడం కంటే నయం కాదా?