ఉరుము నృత్యం- అనంతపురం జిల్లా ప్రత్యేక కళారూపం

by Swarupkrishna Murthy

ఆనంతపురం జిల్లాలోని ప్రత్యెకమైన జానపద కళారూపం ఉరుము నృత్యం. బృంద నృత్యానికి చెందిన ఈ కళారూపం కులపరమైనది కూడా. మాల తెగకు చెందిన వారి జీవన వృత్తి ఉరుము నృత్యం. జానపద కళారూపాలలో చాలా కళలు దైవారాధనలో భాగంగా వృత్తివిద్యలయ్యయి. ఉరుము నృత్యం కూడా దైవారాధనలో వృత్తి విద్యగా మారిందే. మాల తెగలో ఉరుము వాయించే వీళ్ళను ఉరుములోళ్ళు అంటారు ఉరుములోళ్ళు చెన్నకేశవుని వారసులమని మాచెర్ల గోత్రీకులమని చెప్పుకుంటారు.
ప్రకృతితో జానపదుడికి ప్రత్యక్ష సంభంధం ఉంది అండానికి, జానపదుడు ప్రకృతిని దగ్గరనుండి పరీక్షించాడనడానికి ఉరుము వాద్య నిర్మాణమే నిదర్శనం. మేఘ గర్జన ఉరుము నిర్మాణానికి దారితీసింది. మేఘ గర్జనను ఉరుము అంటారు. ఈ ఉరుము సబ్ధం భయంకరంగా ఉంటుంది. జానపదుడు కూడా ఉరుము శబ్ధన్ని సృష్టించడానికి ఒక వాధ్యన్ని తయారుచేసుకున్నాడు. అదే ఉరుము వాధ్యం. ఈ వాద్యాన్ని వాయించేటప్పుడు వచ్చే శబ్ధం భయంకరంగా ఉంటుంది. ఉరుము వాద్యాన్ని వాయిస్తున్నపుడు ఒళ్ళు గగురుపొడుస్తుంది.
ఉరుము వాద్య నిర్మాణం
ఈ వాద్యానికే వీరణం అని పేరు. చిత్తూరు జిల్లాలో వీరణం అనే వాద్యం ఉంది. కానీ వీరణానికి ఉరుముకు తేడా ఉంది. ఉరుము మద్దెల ఆకారంలో ఉంటుంది. ఒకటిన్నర అడుగుల వ్యాసార్ధం, రెండున్నర అడుగుల పొడవు ఉంటుంది. ఇత్తడి లేదా కంచు చేత తయారు చేస్తారు. మద్దెల లాంటి ఈ గొట్టానికి ఇరువైపులా మేక చర్మం బాగా శుద్ది చేసి అమర్చబడి ఉంటుంది. రెండువైపులా చర్మాలను బిగించేందుకు రెండు కడియాలు వేస్తారు. చర్మాలకు ఈ తాళ్ళ బిగింపు వళ్ళ మంచి బిగింపు వస్తుంది. ఖాదర కాయ చెట్టు పుల్లలను ఈ వాద్యాన్ని వాయించడానికి ఉపయోగిస్తారు. ఎడమచేతిలోని పుల్లతో రాపాడిస్తారు. ఎడమచేతిలోని పుల్లను జిగుపుపుల్ల అంటారు. కుదిచెతిలోని పుల్లతో వాయిస్తారు. దీనిని కొట్టుడుంపుల్ల అంటారు. ఎడమవైపు పుల్లతో రాపాడిస్తే బూర్ బూర్ బూర్ బూర్ అనే శభ్దం వస్తుంది. కుడివైపు పుల్లతో కొడితే డబు, డబు, డబు, డబు అనే శబ్ధం వస్తుంది.
ఉరుములోల్లు నిష్టాగరిష్టులు. వీరిలో నియమాలు ఎక్కువ. ఇంట్లో ఈత పరకలు వాడరు. ఈత చెట్టు క్రింద కూర్చోరు. కాళ్ళకు చెప్పులు ధరించరు. వీరు అక్కమ్మ దేవతను కొలుస్తారు. ఈమె గ్రామదేవత. ఉరుములవాళ్ళను అక్కమ్మ దేవతకు ప్రతిరూపంగా భావిస్తారు. వీరు అక్కమ్మ దేవత ష్రుస్టి అని చెప్పడానికి ఒక కథ ఉంది.
శివుడు తన తలలోని నాలుగు జడపాయలను నాలుగు లోకాలకు విస్తరిస్తాడు. నాగలోకంలోని అక్కమ్మ శివుని జడను చూసి ఈ జడయే ఇంత సుందరంగా ఉంటే కైలాస సౌందర్యం ఎలా ఉంటుందోనని ఆ జడ ద్వారా కైలాసం చేరుకుంటుంది. పార్వతి పరమేశ్వరులు అక్కమ్మను భూలోకం ఏలుకోవడానికి అనుమతి ఇస్తారు.
అక్కమ్మ పంచాంగం అడగడానికి పాల కొండమల దగ్గర ఉన్న బ్రమ్హముని దగ్గరకు పోతుంది. బ్రమ్హముని భయపడి గుహలో దాక్కుంటాడు.అక్కమ్మ పిలిచినా బ్రమ్హముని పలకడు. అక్కమ్మ మట్టిటొ రెండు బొమ్మలను చేసి వాటికి ప్రాణం పోసి సింగరయ్య, సోమన్న అని పేర్లు పెట్టి వేపమాను తొలిపించి మేకచర్మంతో రెండువైపుల మూయించి కుదురుపుల్లలతో వాద్యాన్ని వాయించమని పురమాయించిందని, ఆ వాద్యాల ద్వనులు ఓంకారంలా ద్వనించి ఉరుములా వినిపిస్తే బ్రమ్హముని బయటకు వచ్చడని సింగరయ్య, సోమన్నలకు అక్కమ్మ బీజాక్షరాలను ప్రసాదించిందని కధ.
ఉరుము నృత్యం మేలుకొలుపు పాటతో మొదలవుతుంది. మేలుకొలుపు పాటలొ ఎడంచేతి పుల్లతో రాపాడించడం ఉండదు. కేవలం కుడిచేతి పుల్లతో కొట్టడం మాత్రమే ఉంతుంది.
మేలుకొలుపు పాట
మేలూకొనవే వో మేలూకొనవే
అమ్మ నీవు పుట్టకముందే నాడూ
ఇగమూ లేదు జగమూ లేదు మేలూకొనవే
అమ్మ మచ్చుల మాయల వో గంగి నీవు
పీనిగీలు తినేవు పిశాచివో మేలూకొనవే
సామి గంగ లేని వో తానమే లేదు
గంగ లేని వో జలకమ్మే లేదు మేలూకొనవే
సామీ నీవు పుట్టకముందేనాడూ
నరుడూ లేడూ వో నారాయణుడూ లేడూ మేలూకొనవే
ఇష్ణు లేడు వో యీసరుడు లేడూ
ముప్పది కోత్ల వో మునులే లేరూ మేలూకొనవే
ఈ గేయంలోని వో అనే పదం ఒక గతిలో రాగాలాపన చేస్తారు. గుక్క తిరిగే వరకు రాగాలాపన చేయ్యడం ఇందులోని ప్రత్యేకత. ప్రదర్శన చివరలో మంగళం పాట పాడతారు. మంగళం పాటతోనే నృత్యం ఆగిపోతుంది.
మంగళం పాట
జయ జయ మంగలం నిత్య శివ మంగళం
బోలు బోలు మట్టెలు బోలు బోలు మట్టేలు
బొమ్మంచు సీరలు బొగ్గు వరమగర నీకారతి జయ జయ మంగలం
తనుకు తనుకున మెరిసేటి తనుకు పాపిటి బొట్టు
తగునమ్మ సుబ్బరావుపేట గంగమ్మకూ జయ జయ మంగలం
ఆరుగురు రాజులు ఆరుగురు రాణులు
ఆకసిన్న రాములమ్మ నీకారతీ జయ జయ మంగలం
తనుకు తనుకున మెరిసేటి తనుకు పాపిటి బొట్టూ
తగునమ్మ పెదకోట్ల చౌడమ్మకూ జయ జయ మంగలం
వక్కొక్క జల్లోన వజ్రకాంతి లింగాలు
వక్కొక్క జల్లోన బద్రకాంతి లింగాలు
వక్కొక్క జల్లోన సూర్యకాంతి లింగాలు
జడజడా సూస్తేను నవకోటి లింగాలు
తగునమ్మ ముస్టురి నలకాటిమయ్యకు జయ జయ మంగలం

ఉరుము వాద్యం అనంతపురం జిల్లాలో మాత్రమే కనిపిస్తుంది. ధర్మవరం, కల్యణదుర్గం, కుందుర్పి, రొద్దం, గూగూడు, ముదిగుబ్బ, కమ్మవారిపల్లె, గుంజేపల్లె వంటి ప్రాంతాల్లో ఉరుములోల్లున్నారు. ఉరుము నృత్యాన్ని గురించి పరిశోధన చేసిన వారిలో డా. ఛిగిచెర్ల కృష్ణ రెడ్డి ప్రముఖులు. వీరు హైదరాబదు లోని పొట్టి శ్రీరాములు విస్వవిద్యాలయంలో రీడర్గా పనిచెస్తున్నారు.