ఆజా నచ్చలే కాదు, నచ్చింది.

by admin@ 24fps

ఇదంతా Aaja Nachle సినిమా గురించే, కాకపోతే ముందు కొంచెం ఆత్మ విమర్శ.

గతంలో నేను కొన్ని సినిమాల గురించి రాసిన రివ్యూల గురించి వ్యాఖ్యల రూపంలో వచ్చిన స్పందన చూసి అందుకు ప్రతి స్పందనగా ఒక పోస్టు రాయాలని అనుకుంటూ వున్నాను. నేను ఘోరంగా ఎద్దేవా చెస్తూ రాసిన ఓం శాంతి ఓం సినమా చాలా మందికి నాలాగే నచ్చక్పోయినప్పటికీ నేను చెప్పినంత ఘోరంగా ఏమీ లేదని చాలా మంది పేర్కొన్నారు. అయితే నాకంతగా రోత పుట్టించిన ఆ సినిమాలో మిగిలిన వాళ్ళకి ఏం నచ్చింది అనే ఆలోచన “నాకసలు ఒక సినిమా నచ్చడానికి నచ్చకపోవడానికి దోహదం చేసే కారణాలు ఏంటి?” అన్న మూల ప్రశ్నకు దారితీసింది.

నేను పుట్టడమే ప్రపంచ సినిమా ఒడిలో వాలలేదు కదా! నేనూ కృష్ణ బొమ్మలకు పూలదండలు వేసినవాడినే, బాలయ్య తొడకొట్టకముందు ఈల వేసిన వాడినే, చిరంజీవి ని తలుచుకుంటూ కాలరెగరేసిన వాడినే. కాకపోతే సినిమా తీయాలనే ఆలోచన కలిగిన తర్వాత కొంచెం కొంచెం సినిమా గురించి తెలుసుకుంటూ వుండడంతోనూ, అలాగే మన సినిమాల నాణ్యత భయకరంగా దిగజారడంతోనూ, అన్నింటికీ మించి దేశం కాని దేశంలో వుండటం మూలాన ఇతర భాష, దేశ సినిమాలు చూడడం ఎక్కువవ్వడం మూలానా మన సినిమాలనీ మరీ కొంచెం ఎక్కువగానే విమర్శిస్తున్నట్టు నాకర్థమయ్యింది. మొదట్లో ప్రపంచంలోని మంచి సినిమాలని ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సైటు మొదలుపెట్టినప్పటికీ, దాదాపుగా నేను అదే పనే చేస్తూనే వున్నానిన్ని రోజులు. కానీ అప్పుడప్పుడు నేను రాసిన కొని హిందీ సినిమా రివ్యూలు నా ప్రయత్నాన్ని దారి మళ్ళించిందని నాకీ మధ్యనే అర్థమయ్యింది. అందుకే అలాంటి ప్రయత్నాలనుంచి విరమించుకునే ముందు కొన్ని విషయాలు!

నాకు సినిమా అంటే ప్రాణం. అందుకే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా ఏదైనా చూస్తాను. ఈ సినిమాలన్నీ చుస్తున్నప్పుడు బావుండాలనే కోరుకుంటాను. ఆనందంగా నన్ను నేను మర్చిపోవాలని అనుకుంటాను. కానీ ఈ మధ్య వచ్చిన చాలా కొద్ది సినిమాలే నన్ను మర్చిపోయేలా చేసి, సినిమాలో సృష్టించిన స్వప్నలోకం లోనికి తీసుకెళ్ళగలిగాయి. ఇలాంటి సినిమాలే నాకు నచ్చాయి.ఇప్పుడే కాదు గతంలో నాకు నచ్చిన సినిమాలన్నీ ఇలాంటివే. ఉదాహరణకు చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు సినిమానే తీసుకుంటే ఆ సినిమా ఇప్పటికీ నాకు నచ్చుతుంది. అలాగే సై, ఒక్కడు, తొలిప్రేమ, పెళ్ళిసందడి, గ్యాంగ్ లీడర్, ధర్మ చక్రం, సుందరకాండ, శివ లాంటి ఎన్నో ఇతర సినిమాలు కూడా! నన్నలా సినిమాలో సృష్టించిన లోకంలోనికి తీసుకెళ్ళగలిగేలా లేకపోతే నాకు నచ్చనట్టే. అలాగే నాకు నచ్చిన సినిమాలలో ఒక నిజాయితీ వుంటుంది. ప్రేక్షకులని మోసం చేసైనా తమ సినిమా హిట్ చేసుకోవాలనే మోసపూరిత ఆలోచనలు వుండవు. అలాగే వంశం, వారసత్వం లాంటి వెధవగోళ వుండదు.

ఈ మధ్యకాలంలో నాకు నచ్చిన main stream బాలీవుడ్ సినిమాలు అస్సలు లేవనే చెప్పాలి. కొద్దో గొప్పో చక్ దే, పోయిన ఏడాది వచ్చిన రంగ్ దే బసంతే సినిమాలు తప్పితే మరేవీ లేవనే చెప్పాలి. ఈ సినిమాలన్నీ ఎలాగోలా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వాడిన గిమ్మిక్కులు తప్ప కథ మీద పట్టు వుండదు, దర్శకత్వ ప్రతిభా వుండవు. ఆ సినిమాల్లో నటులూ అంతే అప్పటికే తారా స్థాయికి చేరిన తారలు, వారిని చేరుకోవలనే తపనతో చిరుతారలు, అంతా వాళ్ళ గొడవ తప్పితే కొంచెమంటే కొంచెమైనా నిజాయితీ లేదు.

అందుకే, ఇలాంటి దిక్కుమాలిన సినిమాలు కాకుండా నిజంగా ఆనందాన్నందివ్వగల ఒక సినిమా వస్తే ఆ సినిమా చూసి, దాని గురించి సమీక్ష రాసి మన సినిమాలంటే నాకు ప్రత్యేకమైన ఏహ్యభావమేమీ లేదని చెప్పాలనుకుంటుండగానే వచ్చింది నాకీ అవకాశం. ఈ రోజ ఆఫీసుకి సగంరోజు శెలవుపెట్టి మరీ వెళ్ళి ఆజా నాచ్‍లే సినిమా చూడడం జరిగింది. నాకైతే చాలా నచ్చేసింది. ఈ సినిమా కథ గురించి, దర్శకతం, స్క్రిప్టు, వగైరా విశేషాల గురించి మీరే చూసి తెలుసుకోండి. నేను మాత్రం నాకీ సినిమా నచ్చడానికి కారణాలు మాత్రం ఇక్కడ పేర్కొనడానికి ప్రయత్నిస్తాను.

1) ఈ సినిమా మాధురీ comeback సినిమా అయినప్పటికీ సినిమా మొత్తం ఆమెనే నింపేసే ప్రయత్నం చేయలేదు. మిగిలిన పాత్రలన్నింటికీ సరైన ప్రాధాన్య ఇచ్చారు.
2) అవసరం కొద్దీ మాత్రమే పాటలు ఉపయోగించారు.
3) ఒక్క మాధురీనే కాదు, ఇందులో నటించిన అందరూ అధ్భుతంగా నటించారు.
4) ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ మాధురి చుట్టూ తిరిగినా, దాదాపు అన్ని పాత్రలకూ ఒక సబ్ ప్లాట్ వుంటుంది. ఆ పాత్రలు సినిమా మొదలయినప్పటికీ, సినిమా ముగిసే సమయానికి చెప్పుకోదగ్గ రూపాంతరం చెందుతాయి.
5) ఈ సినిమాలో మా తాతలు నేతులు దాగారు, మా మూతులు వాసన చూడమనడం లేదు.
6) చెట్టు పేరు పెట్టుకుని కాయలమ్ముకోవడం లేదు.
7) ఈ సినిమాలో మాధురి రెండు నెలల్లో ఒక musical drama ని ప్రదర్శించే పనిని ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఆ ప్రయత్నంలో ఆమెకెదురైన సమస్యల నేపధ్యంలో ఈ సినిమా నడుస్తుంది. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో (ఉదాహరణకు: ఓం శాంతి ఓం , ఒక విచిత్రం అనే సినిమాల్లో సినిమా తియ్యాలనుకోవడం, పౌర్ణమి సినిమాలో నాట్య ప్రదర్శన) ఛాలెంజ్ ఒప్పుకున్న పాత్ర కష్ట నష్టాలు చూపిస్తారు గానీ, చివరికి వాళ్ళు సాధించిన విషయం గురించి మనకి పెద్దగా ఏమీ చూపించరు. (ఉదాహరణకు: ఒక విచిత్రం సినిమాలో కథ మొత్తం సినిమా తీయడం మీదే వున్నా, సినిమా అంతా అయ్యాక కూడా వాళ్ళు తీసిన సినిమా మనకేమీ చూపించరు. సినిమా తీసారు, సక్సెస్ సాధించింది అని కథను చుట్టేస్తారు). కానీ ఈ సినిమాలో అలా కాదు ఎందుకు కాదో సినిమా చూస్తే మీకే తెలుస్తుంది.
8) మాధురి వయసు కనిపించిపోతున్నా,ఆ వయసుకి తగ్గ పాత్రే చేసింది.
9) సాధారణంగా చాలా సినిమాల్లో చిన్నపిల్ల పాత్ర వుందంటే చాలు, నానా అతి చేపించడం అలవాటే మనవాళ్ళకి. ఈ సినిమాలో అలాంటి అవకాశమున్నా చాలావరకూ ఆ పని చెయ్యలేదనే చెప్పాలి.
10) చివరిగా మాధురి నాట్యం. అప్పట్లో ఆమె డ్యాన్సులు చూసి మనసు పారేసుకున్నవాళ్ళందరూ, ఆ మనసు వెతుక్కుని మరో సారి పోగొట్టుకుంటారేమో అన్నట్టుగా బాగా చేసింది.

అదీ సంగతి!

P.S: మరీ ఎక్కువగా expectations పెట్టుకోకండి. మంచి సినిమా. కానీ స్క్రిప్టు లో చాలానే loop holes వున్నాయి. అక్కడక్కడా pace చాలా స్లోగా కూడా వుంటుంది. అయినప్పటికీ మంచి సినిమా.