సావరియా – ఒక విశ్లేషణ
by admin@ 24fps
పోయిన వారం దీపావళీ సందర్భంగా విడుదలయిన రెండు భారీ సినిమాల్లో ఒకటయిన సావరియా సినిమా గురించి ఇప్పటికే చాలా మందికి తెలిసే వుంటుంది. ఈ సినిమా రష్యన్ రచయిత Fyodor Dostoevsky రచించిన White Nights అనే కథ ఆధారంగా రూపొందించబడీంది. గతంలో దేవదాస్, బ్లాక్ సినిమాలకు దర్శకత్వం వహించిన సంజయ్ లీలా భన్సాలీ, మొదటిసారిగా హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ సహకారంతో రూపొందించిన ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రేక్షకుల మన్నన పొందలేకపోవడమే కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యంత బోరింగ్ సినిమా కూడా పిలవబడుతోంది. ఈ సినిమా ఇలా తయారవ్వడానికి కారణాలు వెతుక్కుంటూ నేను చేసిన విశ్లేషణ ఇది.
గతంలో వచ్చన సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు అద్భుత కళాఖండాలు కాకపోయినప్పటికీ అ సినిమా ఫ్రేము ఫ్రేములో మంచి సినిమా తీయాలనే తపన వెల్లడవుతుంది. బ్లాక్, దేవదాస్, ఖామోషీ సినిమాలు చూసిన వారెవరికైనా ఈ విషయం సులభంగానే తెలియవస్తుంది. అప్పుడప్పుడు ఈ సినిమాల్లోనీ భారీ సెట్టింగులు, దుస్తులు కొంచెం విపరీతంగా అనిపించినా మంచి దర్శకుడు అని పేరు సాధించాడు ఈయన.అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకులనూ ఆలరించిన బ్లాక్ సినిమా తర్వాత వస్తున్న ఈ సావరియా సినిమా అనగానే భారీ అంచనాలు వుండడం సహజం. అదీ White Nights అధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారంటే సహజంగానే మంచి సినిమా అయ్యుంటుందనీ నమ్మారు ప్రేక్షకులు. కానీ తీరా సినిమా చూసాక తలపోటు తప్ప ఏమీ రాదనేది సత్యం.అలా జరగడానికి కారణాలు తెలుసుకునే ముందు White Nights యొక్క కథాంశం ఏంటో తెలుసుకుందాం.
కథ:
ఒక ఒంటరి యువకుడు, ఒక అర్థరాత్రివేళ అనుకోకుండా ఒక అమ్మాయిని కలుస్తాడు. మాటా మాటా కలుపుతాడు. తన ఒంటరతనమనే చలిని, ఆమె స్నేహమనే వెచ్చదనంలో చలికాచుకుందామనుకుంటాడు. ఆ ఒక్క రాత్రి పరిచయం మరో రాత్రికి కొనసాగుతుంది. అలా నాలుగు రాత్రులపాటు వారిద్దరూ తమ మనసువిప్పి మాట్లాడుకుంటారు. వారిద్దరి మధ్య నాలుగు రాత్రుల్లోనే నలభై యేళ్ళ సానిహిత్యం ఏర్పడుతుంది. సహజంగానే ఆ యువకుడు అందమైన ఆ మగువ పై మనసు పారేసుకుంటాడు. ఆమె పై విపరీతమైన ప్రేమను పెంచుకుంటాడు. ఆ యువతి మాత్రం ఆ సానిహిత్యమంతా స్నేహమే అనుకుంటుంది. ఒక్కోసారి ప్రేమేమో అని అనుమాన పడ్తుంది. అయినా మనసు స్వాధీనంలో వుంచుకుంటుంది. కారణం – తనిదివరకే వేరొకరికి మనసిచ్చివుండడం. అలా ఆ నాలుగు రాత్రులు ఆమె ప్రేమకై అతను, ఏడాదిలో తిరిగొచ్చి తనదాన్ని చేసుకుంటానన్న ప్రియుని తిరిగి రాకకై ఆమె, వారి ఎదురు చూపులు, విరహ వేదనలతో గడిచిపోతాయి. నాలుగో రాత్రి తన ప్రియుని రాకకై ఎదురుచూసి విసిగి వేసారిన ఆ యువతి తననంతగా ప్రేమిస్తున్న యువకుని ప్రేమకు అంగీకారం తెలిపేలోపే ఆమె ప్రియుడు రావడం, అతనివెంట ఆమె వెళ్ళిపోవడం జరిగిపోతాయి. “అయితేనేం ఒక్క క్షణం పాటైనా ఆమె హృదయంలో తనకి చోటు దొరికింది కదా, ఈ జీవితానికిది చాలదా” అనుకుంటూ వారెళ్ళినవైపే చూస్తుండిపోతాడా యువకుడు. స్థూలంగా ఇదీ కథా విశయం.
ఇక ఈ సినిమా ఘోర పరజయానికి కారణమైన పొరపాట్లు:
1)Characterisation లో తప్పులు
కేవలం కథా పరంగా చూస్తే,దాదాపు ఆర్య, సోగ్గ్గాడు సినిమాలు కూడా ఇలాంటి కథాంశంతోనే నడుస్తాయి. మరి అలాంటప్పుడు ఈ సినిమాను మిగిలిన కమర్షియల్ సినిమాలకు దూరంగా విభిన్నంగా రూపొందించాలంటే వేరే మార్గాలు వెతుక్కోవాలి. White Nights కథనే తీసుకుంటే ఇందులో కథ కంటే ముఖ్యమైనది Fyodor Dostoevsky ఈ కథను చెప్పిన తీరు. హీరో యొక్క ఒంటరితనాన్ని, వారిద్దరి మధ్య సంబంధాన్నిఆద్యంతం ఎంతో పోయెటిక్ గా చెప్పడం వల్లనే ఈ కథ మనకు చివరి వరకూ నచ్చుతుంది. ఈ కథలో హీరో ఏకాకి. ఈయనొక స్వాప్నికుడు. అతని స్వప్న సామ్రాజ్యంలో తళుక్కున మెరిసిన నిజమైన మెరుపు తీగ ఆ అమ్మాయి.
ఇది White Nights సంగతి. ఇక సావరియా సంగతికొస్తే ఇందులో హీరో బాగా మాటకారి. హడావుడి ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడ పాట అందుకుంటాడు, ఎవర్తో పడితే వాళ్ళతో సరదాగా మాట్లాడనూ కలడు. ఒక ఏకాకి, స్వాప్నికుడైన introvert పాత్రను తీసుకొచ్చి అనవసరమైన హడావుడి చెసే ఒక extrovert పాత్రగా మార్చడంలో మొదటి తప్పు జరిగిందని నా ఉద్దేశం.
Le notti bianche అనే సినిమా కూడా White Nights ఆధారంగా రూపొందించబడినప్పటికీ అందులో చాలా విషయాలు సినిమాకనుగుణంగా మార్చబడ్డాయి. అందులో తప్పేమీ లేదు. కానీ White Nights మరియు Le notti bianche ల soul విషయానికి వస్తే రెండూ చాలా దగ్గరగా వుంటాయి. ఉదాహరణకు Le notti bianche లో హీరో ఒంటరి వాడే. కానీ White Nights లో లా introvert కాదు. కానీ కోపగస్తుడు.పుస్తకంలో అలావుండదు. కానీ సినిమా మొదట్లో వీధికుక్కతో సంభాషించడానికి ప్రయత్నించడం, మరియు సినిమా చివర్లో అదే వీధి కుక్కతో నడి రాత్రి ఒంటరిగా మిగిలిపోవడం లాంటి అంశాలు Dostoevsky సృష్టించిన స్వాప్నికునికి దగ్గర చేస్తాయి.
2) Influence of Moulin Rogue
ఎవరెంత అవునన్నా కాదన్నా సంజయ్ లీలా భన్సాలీ సినిమాల పై Moulin Rogue అనే ఆంగ్ల సినిమా ప్రభావం చాలానే వుంది. ఒక విధంగా చూస్తే సావరియా సినిమా White Nights కి దూరంగానూ, Moulin Rogue కి దగ్గరగానూ వుంటుంది. కథను పక్కనబెడితే, ఈ సినిమాను ఒక మ్యూజికల్ లా తీయాలనుకోవడం, భారీ సెట్టింగులు, Matte పెయింటింగులు అన్నీ Moulin Rogue సినిమాను గుర్తుకు తెస్తాయి కాకపోతే ఆ సినిమా అంతా ఎరుపు మయమైతే ఈ సినిమా అంతా నీలం రంగులో మెరిసిపోతుంది. ఇలా Moulin Rogue సినిమా ఇన్స్పిరేషన్ తో White Nights కథను సినిమాగా తీయడంతో అటుఇటు కాకుండా అయిపోయిందని నా అభిప్రాయం.ఒకవేళ Moulin Rogue కథనే ఈ సినిమాకి ఎన్నుకునివుంటే తప్పక పెద్ద హిట్టయుండే అవకాశం వుండేది.
3)ఒక మోసం
ఈ సినిమా అపజయంలో కారణమైన ఒక ముఖ్య కారణం, సంజయ్ లీలా భన్సాలీ తనను తాను చేసుకున్న ఒక మోసం. పేరుకు ఈ సినిమా White Nights ఆధారంగా రూపొందించబడిందే కానీ ఇంతకీ ఈ సినిమాకి మూలం Luchino_Visconti అనే ఇటాలియన్ దర్శకుడు తీసిన Le notti bianche అనే సినిమా. White Nights కథకు, సావరియాకు వున్న సామ్యం కంటే Le notti bianche సినిమాకు సావరియాకు ఎక్కువ. White Nights కథలోలేని ప్రతి అంశమూ సంజయ్ లీలా భన్సాలీ తన స్క్రీన్‍ప్లే ద్వారా సృష్టించాడనుకుంటే మోసపోయినట్టే. Le notti bianche సినిమాలోని దాదాపు అన్ని (White Nights లో లేని) అంశాలను వున్నడున్నట్టుగా కాపీ కొట్టేసాడు సంజయ్. ఇలా తన సొంత దృష్టి లేకపోవడం కూడా ఈ సినిమా అపజయానికి మరో కారణమనుకుంటా. అదే White Nights ని మళ్ళీ మళ్ళీ చదివి ఆ స్వాప్నికుడిపాత్రలో తనను వూహించుకుని అతని లోకం తన లోకం చేసుకుని వుంటే అంత భారీ సెట్టింగులు, లెక్కకుమించిన డబ్బులు అవసరం లేకుండానే మన పాత బస్తీ నేపధ్యంలో ఈ సినిమా తీసున్నా ఏమైనా ఫలితం వుండేదేమో!
4)Too many things at a time
ఒక వైపు రష్యన్ పుస్తకమైన White Nights ను, ఇటాలియన్ సినిమా అయిన Le notti bianche లోని సీన్లతో కలగలిపి, దానికి తోడు ఈ సినిమాని ఇంగ్లీషు సినిమా అయిన Moulin Rogue లా తియ్యాలనుకోవడమే కాకుండా అందులో అక్కడక్కడా పాత హిందీ సినిమా అయిన ఆవారా లాగా భ్రమ కలిగించేలా చేయాలనుకోవడం మరో ఘోర తప్పిదం. ఇన్ని అంశాలు ఒక దాంట్లో ఇమడ లేకపోవడమే ఈ సినిమాలో మరో లోపం.
4)Technique
భన్సాలీ గత సినిమాలతో పోలొస్తే ఈ సినిమాలో టెక్నిక్ చాలా బలహీనంగా వుంటుంది. దేవదాస్ లోలాగా స్టేజింగ్, fluid కెమెరా మూవమెంట్ ఈ సినిమాలో అస్సలు కనిపించదు. అలాగే షాట్ కంపోజిషన్ కూడా.
6) నిడివి
యాభై పేజీలైనా లేని White Nights కథను దాదాపు మూడు గంటల పాటు 5 నిమిషాలకో పాటతో సాగదియ్యడం ఈ సినిమాలో చేసిన మరో ఘోరతప్పిదం. అలా అని ఇదే సినిమాను నిడివి తగ్గించినంత మాత్రాన ప్రేక్షకులకు నచ్చుండేదా అంటే అనుమానమే. ఒక విధంగా మన సినిమాల నిడివి మన సినిమాల నాణ్యతకు పెద్ద్ద అడ్డుగోడలా తయారయిందని నా అభిప్రాయం. మన సినిమాలు దాదాపు రెండున్నర గంటలపాటు వుండాలని ఎవరు నిర్ణయించారో కానీ దాని వల్ల ఇప్పుడు పెద్ద నష్టమే జరుగుతోందనిపిస్తుంది. ఈ నిడివి ఎక్కువ కావడం మూలానే మన సినిమాలకు మధ్యలో విశ్రాంతి అవసరమవుతోంది. దాంతో కథను రెండు ముక్కలు చేయాలసిన అవసరం ఏర్పడింది. అలాగే పాటలనే మినీ ఇంటర్వెల్స్ తో ఇంకా ఖండఖండాలు చేసి కథను చిత్రవధ చేయడం వలన్ మన సినిమాలు ఇలా వున్నాయేమో అనిపిస్తుంది. దీని వల్ల లాభపడేది సినిమా క్యాటీన్ వాళ్ళు మాత్రమే అనుకుంటా. ఒక వేళ ఇప్పుడు రెండు గంటల నిడివితో విశ్రాంతి లేకుండా సినిమా తీసినా థియేటర్ వాళ్ళు తప్పక విశ్రాంతి ప్రకటిస్తారనుకుంటా! I think we will have to live with such things forever. నిజానికి ఇలాంటి చాలా అంశాలే మన సినిమాల్లో నాణ్యత లేకపోవడానికి కారణమని నా అభిప్రాయం.
మామూలుగా మిగిలిన సినిమాల్లో నాణ్యత లోపించడానికి కారణాలేవయినప్పటికీ, నా దృష్టిలో పైన పేర్కొన్న కారణాలు మాత్రం సావరియా సినిమా అపజయానికి ముఖ్య కారణాలని నా అభిప్రాయం. అయినా ఇలాంటి సినిమా గురించి ఇలాంటి విశ్లేషణ అవసరమా అంటే అవుననే అంటాను.
ఎందుకంటే సావరియా తో పాటే వచ్చిన మరో హిందీ సినిమా ఓం శాంతి ఓం, సావరియా కంటే బాగానే ఆడుతున్నప్పటికీ, ఓం శాంతి ఓం లాంటి సినిమాలు తియ్యడానికి పెద్దగా టాలెంట్ అవసరం లేదు. అలాంటి సినిమాలు చాలా మంది తీయగలరు. అందుకు కావలసింది షారూఖ్ లాంటి బడా స్టార్, లెక్కకు మించిన డబ్బు, ఇండస్ట్రీ లో పలుకుబడి వుంటే చాలు. కానీ సావరియా లాంటి బోరింగ్ సినిమా అయినా తియ్యడానికి ఒక్క సంజయ్ లీలా భన్సాలీ లాంటి వారికే సాధ్యం. అందుకే ఈ సినిమా గురించి ఈ విశ్లేషణ.
Comments
నటి నటుల అభినయం గురించి గానీ,మిగిలిన కళాకారులగురించి గానీ ఏమీ చెప్పనేలేదు.
చక్కటి వశ్లేషణ..చివర్లో మీరు సంజయ్ తీయగలిగిన చిత్రాల గురించి ఆన్నది అక్షరాలా నిజం. ఈతని చిత్రాలలో దర్శకుడు కూడా ఒక కధానాయకుడే
Nice. Thanks you saved my time and money. I feel it is necessary to describe regarding actress too. I request you to publish regarding good and bad films also.
హింది సినిమాల గురించి తెలుగు బ్లాగుల్లో ఎందుకండీ… తెలుగు గురించి తెలుగు ప్రజల గురించి రాయండి…ఏదో మన గురించి మన బాష గురించి చదివినట్టుంది
How is the cinematography?
ఒప్పుకుంటాను కానీ,దేవదాసుకు ముందు భన్సాలికి నేను కొంపతీసి ప్రముఖుడిని అవలేదు కదా అని అనుమానం వచ్చినట్టుంది. లేకపోతే దేవదాస్,బ్లాక్,ఇప్పుడు,ఈ సినిమా వచ్చి వుండేవి కావు,మీరు అన్నట్టు అతనికి ఇటాలియన్ కనెక్షన్ ఏదో వున్నట్లుంది,గతంలో ఇటలీలో ఇటాలియన్ పేరుతో ఒక సినిమ సల్మాన్.అజయ్,ఐశ్వర్యలతో ఒక కళాఖండం వచ్చేసింది కదా.
రాజేంద్ర
http://visakhateeraana.blogspot.com/
వెంకట్, PFC లో మీరు చేసిన కామెంటు చూసి వచ్చాను. సైటు బాగుంది – కానీ ఫాంట్లు మాత్రం గోకాయి. ఒక్క చిన్న అనుమానం – సైటు తెలుగులో వున్నా తెలుగు సినిమాల గురించి పెద్దగా వ్రాస్తున్నట్లు లేదు. పాత తెలుగు సినిమాల గురించీ తెలుగు సాహిత్యం గురించీ ఇంకా వ్రాయండి. సెలవ్. — డబ్ల్యూ.బీ.
nijam.. sawariya evarido kala laga undi.. SLB kanna kalemo.. anta ayyaka tooch anipinchindi. But still, OSO tiyataniki Talent avasaram ledu ani anakandi. Asalu elanti cinema tiyatanikaina Talent avasaram. OSO ki aite brand value kuda vundi. Commercial cinema ni janam haiga enjoy cheyadanike chustaru.. OSO lo patralu manatone untai. manani entartain chestai. Sawariya lo aite, patralu manni asalu touch cheyavu. So, there is the point. Farah khan is indeed talented. SRK swadesh chusara poni.. SRK is also talented.
After seeing your review i read again(ater 15 years) the story ’svetha raatrulu’(translation of white nights).Yes. It is so poetic.Thank you.
Deepasikha
I consider Bhansali, an over rated film maker. who has more mystique to him than substance. ఖామోషి (తన మొదటి సినిమా) తప్ప మిగతావన్ని just show-off. హమ్ దిల్ దేచుకే సనమ్ మన ఇ.వి.వి. సత్యనారాయణ “కన్యాదానం” కు sofisticated remake. ఇక దేవదాసు,50 కోట్లు పెట్టి తీసిన జోకు ( an insult to all the films earlier made on this subject). “బ్లాక్” చిత్రం లో ఉన్నంత ఒవర్ యాక్టింగ్ మన తెలుగు సినిమాలన్నీ కలిపినా ఉందదని నా అభిప్రాయం.