The Last Lear

by admin@ 24fps

సినిమా: The Last Lear
దేశం:India
దర్శకుడు: రీతూపర్ణో ఘోష్.

నా అభిప్రాయం: మన బిగ్గు బి అమితాబ్, రీతూపర్ణో ఘోష్ దర్శకత్వంలో అదీ పూర్తి స్థాయి ఆంగ్ల సినిమా అనగానే Festival circuit లో మంచి క్రేజే లభించింది ఈ సినిమాకి. కానీ అంతా హైప్. సినిమాలో విషయం లేదు. మీరు వీర అమితాబ్ ఫ్యానో లైటో అయ్యుంటే మీకు పిచ్చపిచ్చగా నచ్చొచ్చేమో కానీ ఈ సినిమాకి అంత సీన్ లేదని నా అభిప్రాయం.

అమితాబ్ బచ్చన్ హ్యారీ పాత్రలో బాగానే నటించారు. అలాగే ప్రీతి జింతా కూడా ఫర్వాలేదు. కానీ ఇక్కడ పర్దర్శిస్తున్న మిగిలిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఎక్కడా పనికి రాదు.

ఉత్పల్ దత్ నాటకం అధారంగా రూపొందించినా ఈ సినిమాలో హ్యారీ అనే stage artist, షేక్స్పియర్ అధారిత పాత్రల ద్వారా బాగా ప్రఖ్యాతి గాంచి వుంటాడు. సినిమాలంటే కొంచెం చిన్న చూపు అతనికి. కానీ హ్యారీ ని ఎలా అయినా ఒప్పించి తన సినిమాలో నటింప చేయాలనుకుంటాడు సిధ్ధార్థ్. అతని ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ హ్యారీ కి మాత్రం ఆ సినిమానే అతని నటనా జీవితానికే కాదు నిజజీవతంలో కూడా నటించడానికి, జీవించడానికి చివరి అవకాశం అని తెలియదు.

ఈ కథ కాకుండా, హ్యారీ భార్య, ఆ సినిమాలో నటించే హీరోయిన పాత్ర అయిన షబ్నం, మరియు హ్యారీ చివరి రోజుల్లో అతని దగ్గరుండి సేవలందించే ఐవీ అనే నర్సు పాత్రల ద్వారా మరో మూడు కథలను కూడా సమాంతరంగా చూపెట్టే ప్రయత్నం చేసాడు దర్శకుడు.

ఈ సినిమాలో అతి పెద్ద లోపం ఏంటంటే ఈ సినిమా కథ మొత్తం గౌతం అనే ఒక జర్నలిస్టు మనకి చెప్పడం ద్వారా మనం తెలుసుకుంటాం. కానీ ఇందులో చాలా సంఘటనలు అతని సమక్శంలో జరగవు. అయినా అంతా చూసినట్టుగా మనకి చెప్పేస్తాడు. కానీ అక్కడ జరిగిన విషయాలనింటికీ సాక్శి సిధ్ధార్థ్ అయినప్పుడు ఆయన ద్వారా వాయిస్ ఓవర్ లో కథ నడిపించడం ఉత్తమం అయ్యుండేది. దాంతోపాటు ఈ గౌతం పాత్ర పోషించినాయన గొంతులో అసలు ప్రాణమే లేదు. ఏదో చెప్పాలి కదా అన్నట్టుంది.

ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఈ సినిమాలో షూట్ చేసే సినిమాలో అమితాబ్ క్లైమాక్స్లో రిస్కు తీసుకుని చేసే సీన్లని చెప్పి నానా హంగామా చేసి చివరకి అసలు ఏంటా రిస్కనేది మనకి సినిమా అయిపోయాక కూడా తెలియదు. అలాగే సిధ్ధార్థ్ పాత్ర ఎందుకలా బిహేవ్ చేస్తుందో అస్సలు మన ఊహకందదు.

కాకపోతే రోజూ వచ్చే చెత్త బాలీవుడ్ సినిమాల కన్నా ఈ సినిమా చాలా మేలు. కానీ బెంగాళి సినిమాలనుండీ బాలీవుడ్ వైపు వచ్చి రీతూ పర్ణో పెద్ద తప్పు చేస్తునట్టనిపిస్తుంది. అలాగే ఈ సినిమా నిర్మాత అయిన అరిందం చౌదరీ లాంటి కార్పోరేట్ వ్యక్తుల చేతుల్లో రానున్న రొజుల్లో సినిమాల పరిస్థితి ఏమవుతుందో అని కొంచెం ఆందోళనగా కూడా వుంది.

ఈ సినిమా చూసాల మన బిగ్గు బి గారిని, “అయ్యా, మీరే ఈ సినిమా లో లేకపోయుంటే ఈ జనలిలా కుప్పలు తెప్పలుగా వచ్చుండే వారా?” అనడిగితే “ఎందుకు రారు, తప్పకుండా వస్తారు” అన్నారు. “అయితే ఇక్కడ అదూర్ గోపాల కృష్ణన్ Four Women సినిమా ప్రదర్శితమవుతుంటే ఈ జనాలందరో అక్కడ లేరేమి?” అని అడీగినందుకు జనాలు అదేదో పెద్ద జోకులా , నేనేదో పెద్ద జోకర్లా నవ్వడంతో మూతి మూసుకుని ఇంటి దారిపట్టా.