ఎక్కడ్నుంచి ఎక్కడికో!

by admin@ 24fps

గమనిక: ఈ వ్యాసం కొంచెం పెద్దది. ఓపిక వుంటేనే చదవండి.

చాలా రోజులుగా Last life in the Universe అని ఒక సినిమా చూడాలని వున్నా ఎప్పుడూ ఏదో ఒక కారణం చేత పది నిమిషాలు చూడడం తర్వాత ఆపెయ్యడం జరిగేది. పోయిన వారం ఎలాగో ఓపిక చేసుకుని చూసా. బావుందా లేదా అని చెప్పడం కష్టం. నా దృష్టిలో ఒక మంచి ప్రయత్నం అని మాత్రం అనిపించింది. అదీకాకా ఈ సినిమా గురించి చాలా సినీ పండితుల నోట వినివుండడంతో కొంచెం expectations కూడా ఎక్కువయ్యాయేమో, కొంచెం నిరాశ కూడా చెందాను.

వారం గడిచిపోయింది. నిన్న London Film Festival ప్రెస్ స్క్రీనింగ్స్‌లో ఏ సినిమా చూడాలో అర్థం కాక థాయిలాండ్ కు చెందిన Ploy అనే సినిమా చూద్దామని నిర్ణాయానికి వచ్చేసా. ఎప్పుడూ థాయిలాండ్ సినిమాలు చూడలేదు కదా, ఒక్క సారి వాళ్ళ సినిమాలెలా వుంటాయో చూడొచ్చు కదా అని.

సినిమా అంతా చుసేసాక అనిపించింది, అనుకోకుండా తీసుకున్న నిర్ణయమయినా మంచి నిర్ణయమే తీసుకున్నానని. అంత బావుంది మరి ఆ సినిమా!. ఇంటికొచ్చి ఈ దర్శకుడు తిసిన మిగిలిన సినిమాలేంటబ్బ అని గూగులమ్మను అడిగితే ముఖ్యంగా Last Life in the universe అని చెప్పింది. ఇంతకీ విషయమేమిటంటే ఇప్పుడు నాకు Ploy సినిమా నచ్చింది కాబట్టి మరో సారి Last Life in the Universe చూస్తే, అంతకు ముందులా కాకుండా ఇప్పుడు కొత్త కొత్త విషయాలు వెతుక్కుని మరీ నచ్చేసే ప్రయత్నం చేస్తానేమో అని నా మీద నాకు అనుమానమొచ్చింది. Ploy సినిమా చూడడం ద్వారా నాకు ఆ దర్శకుని గురించి కొంచెం అర్థమయ్యింది కాబట్టి రెండో సారి Last Life in the Universe చూసినప్పుడు నా దృష్టికోణం మరో విధంగా వుంటుంది.

అలా అని ఎందుకనుకుంటున్నానంటే, అసలు Godard అంటే ఎవరు? French Newwave అంటే ఏంటి? అని ఏమీ తెలియని వాడికి Breathless సినిమా చూపిస్తే అతనికి ఆ సినిమా నచ్చుందంటారా? ఏమో నాకు అనుమానమే! ఎందుకంటే అది అప్పటి సినిమాల సాంప్రదాయ పధ్ధతులకు ((ఇప్పటి మన సినిమా పధ్ధతులకూ, ప్రక్రియలకు కూడా) విభిన్నంగా తీయబడింది. కానీ ఇందులో కొత్త దనం గురించి తెలియని వాళ్ళు ఆ సినిమా చూసి ఇదేంటి పిచ్చిచ్చిగా వుంది అనుకోవడానికి చాలా అవకాశాలున్నాయి.

ఒక వేళ ఇదే సినిమాను టెక్నిక్(ఏడిటింగ్, సినిమాటోగ్రఫీ) పై కొద్దో గొప్పో పరిజ్ఞానం వున్న ఒక వ్యక్తికి (అతనికి కూడా Godard, French New Wave గురించి తెలియదనుకుందాం) చూపిస్తే అతను తప్పకుండా ఆ సినిమాలోని వైవిధ్యతను కనిపెట్టి అభిమానించే అవకాశం వుంది. అంటే దీని వల్ల నాకర్థమయ్యిందేంటంటే మనకు ఒక విషయం మీద basic knowledge కనుక వుంటే ఆపైన మనం మన knowledge bank ని ఒక్కోఅంతష్తుగా పేర్చుకుంటూ వెళ్ళవచ్చన్నమాట. అంటే ఒక విధంగా ఇంటికి కావల్సిన foundation లాగా ఈ Basic Knowledge అనేది మనకి అవసరం.

మన సినిమా దర్శకులు చాలామంది ఈ basic knowledge సంపాదించడానికి ఎన్నుకునే మార్గం ఎవరి దగ్గరైనా అసిస్టెంటుగా పని చేయడం. ఎలాగో అష్ట కష్టాలు పడి ఒక సినిమా దర్శకత్వం చేయడానికి అవకాశం వచ్చిందంటే ఇక ఆ దర్శకుడు ఈ లోకం వదిలి సినీ లోకం లో స్థానం సంపాదిస్తాడు. అక్కడితో ఇక జ్ఞాన సమూపార్జన ఏమీ వుండదన్న మాట. మహా అంటే వారానికి నాలుగు DVD లు సినిమా పారడిజో నుంచి అద్దెకు తెచ్చుకుని అక్కడ్నుంచి కొంత ఇక్కడనుంచీ కొంత కట్ చేసి కొత్త కథను సృష్టించడం తప్ప కొత్త knowledge కోసం పెద్దగా పరయత్నించరు.

ఒక సినిమా తీసేసాక ఆ దర్శకుడికి కొమ్ములొచ్చేయడం మరో వ్యాధి. జన్నల్లో వీళ్ళు తిరగరన్నమాట. అంతా వాళ్ళ చిన్ని సినీ లోకంలోనే!

ఒక వైపు కొత్త విషయాల గురించిన పరిజ్ఞానమూ లేకుండా, మరో వైపు జనాల్లో తిరిగి ప్రస్తుత పరిస్థుతులపై అవగాహనా లేకుండా ఇక వీళ్ళు తీసేది సినిమాలా? మన సినిమా వాళ్ళలో ఎంతమందికి పుస్తకాలు చదివే అలవాటుందో అడగండి. మరి ఏమీ చెయ్యకుండా కొత్త కథలు ఎలా సృష్టించగలరు? కథలు ఎక్కడ్నుంచొస్తాయండీ! మనలోనుంచే కదా! మరి మనకి దూరంగా వారి సొంత స్వరగంలో విహరించే వాళ్ళకి కథంటే చిన్నప్పుడు అమ్మనో నాన్ననో చంపేస్తే పగ తీసుకోవడానికి బల్దేరిన హీరో వాడితో నాలుగు చిందులెయ్యడానికి ఒక హీరోయిన్, ఈ మాత్రం కథ కోట్లకు కోటలు రెమ్యూనరేషన్, బడ్జెట్.

ఈ knowledge లేకపోవడం అనే వ్యాధి ఒక్క దర్శకులకి సంబంధించినదే కాదు, మన ప్రేక్షకులది కూడా. వాళ్ళు అడ్డమైన సినిమాలు తీస్తున్నారు సరే, మనమెందుకు చూస్తున్నాము? మనకి ఇంత కంటే పెద్దగా ఏమీ తెలియదు కాబట్టి. ఈ రోజుల్లో తెలుగు సినిమాలు నచ్చని వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఊరికే ఆ మాటనటం లేదు; వారు మన సినిమాలకంటే మంచి సినిమాలను ఎక్కడో చూసి వుంటారు. వారికా knowledge వుంది కాబట్టే తెలుగు సినిమా స్థాయి నుంచి ఎదిగి కొత్త సినిమాల అన్వేషణలో వాళ్ళున్నారు.

లేదయ్యా, మాకు కొత్త నాలెడ్జీ గట్రా అవసరం లేదు మాకీ సినిమాలు చాలనుకుంటే మన సినిమాలిలానే తగలడి చస్తాయి. దాని వల్ల కొంపలంటుకు పోయే ప్రమాదమేమీ లేదే, అసలు సమస్య గాని ఈ సమస్య గురించి ఎందుకీ అనవర ప్రయాస అనుకుంటే పెద్ద ప్రమాదమే వుంది. మనమిలా అన్నింటినీ తేలిగ్గా తీసుకుని వదిలేయడం వల్లనే రాజకీయనాయకుల దగ్గర్నుండి, మనం డబ్బులిస్తే ఆడే సినిమా వాళ్ళు కూడా మన మీద పెత్తనం చలాయిస్తున్నారు.

అడిగేవాళ్ళు లేక కాదా కొడుకులు,అల్లుళ్ళు, బావలు, బావమర్దులూ, అటు రాజకీయాల్లోనూ , ఇటు సినిమాల్లోనూ తమ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

దీనికంతటికీ కారణం మనకు చాలా విషయాల గురించి సరైన అవగాహన లేకపోవడమే అని నా అభిప్రాయం.

ఉదాహరణకు, మా ఊరికి ఇప్పటికీ సరైన రోడ్డు లేదు. వర్షం పడితే తప్ప పంతలు పండవు. నెలలో కరెంటు పోకుండా వుండే రోజులు సున్నా. అయితే ఊరికి వెళ్ళినప్పుడు ఎందుకు మీరు ఇవన్నీ భరించాలి? గవర్నమెంట్ వాళ్ళకి మీ బాధలు చెప్పుకోవచ్చుగా. మీ సమస్యలకై పోరాటం చెయ్యవచ్చుగా అంటే, అదంతా వల్ల కాదంటారు మా నాన్న. నువ్విక్కడుంటే తెలుస్తుంది అని నవ్వి వదిలేస్తారు. ఒక్కోసారి బాగా ఆవేశం కూడా వస్తుంది, అన్నీ వదిలేసి వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలని అనిపిస్తుంది. కానీ ఎలా? ఒంటరి నన్న భయం నా ఆలోచనలని బలహీనపరుస్తుంది.అయితే మనమేదో చెయ్యాలన్న తపన కూడా మనకి లోకం గురించి వున్న అవగాహన వల్లనే వస్తుంది. మావూరికి దగ్గర్లోనే మన రాష్ట్రంలో కల్ల రెండవ అతి పెద్ద రిజర్వాయర్ వుంది.మరి అక్కడనుంచి దగ్గరలోని గ్రామాలకు నీళ్ళందివచ్చుగా? అనేది నా ప్రశ్న. అలాగే మావూరి మట్టి రోడ్డుకి రిపేర్లని ఆరునెలలకొకసారి లక్ష రెండు లక్షలు పంచాయతీ డబ్బులో, MLA ఫండో ఖర్చు చెస్తుంటారు. ఇలా ఏదాడికి రెండు సార్లు చేసే బదులు ఒకే సారి మంచి రోడ్డెయ్యొచ్చుగా? అనేది నా ప్రశ్న. వూర్లో వున్న కుర్ర కారుతో ఈ విషయం అడిగితే నన్ను పిచ్చోడీలా చూడడం తప్ప పెద్దగా ఏమీ వుండదు.ఏం చెయ్యలో ఒక్కో సారి అర్థం కాదు. కానీ ఇలాంటి ప్రశ్నలను లేవనెత్తడానికి సినిమా మంచి మాధ్యమమని నా ఉద్దేశం.

ఏదేమైనా మనకు ప్రపంచ పరిస్థుతల పై అవగాహన వుండడం ఎంతో అవసరమని నా అభిప్రాయం. ఒక్క రాజకీయాల్లోనే కాదు, సినిమా, సాహిత్యం, టెక్నాలజీ లాంటీ అన్ని విషయాల్లోనూ.

ఒక్కోసారి అనిపిస్తుంది – ఎందుకిలా చెయ్యాలనిపిస్తుంది. నా బతుకు బాగానే వుందిగా, ఆ వూరు ఆ గోల ఎందుకని? నాకిలా అనిపించడానికి కారణం ఏంటి? అలాగే మా వూరికోసం ఏదైనా చెయ్యాలని అనిపించడానికి కారణం ఏంటి? నిన్న నా భార్య ఇండీయా నుంచి ఫోను చేసి మనమెక్కడైనా ఇటలీనో, పోలాండో వెళ్ళి ఒక మారుమూల గ్రామంలో సెటిలవుదామా? అని అడిగింది. ఆమెకలా అనిపించడానికి కారణమేంటో?

అసలీ ఆలోచనలన్నింటికీ కారణమేంటి?