ఎందుకీ మొసలి కన్నీరు?

by admin@ 24fps

గమనిక:అసలీ వ్యాసం రాయాలా వద్దా అని చాలా సేపు అలోచించి చివరకి ధైర్యం చేసి రాస్తున్నాను.ఈ వ్యాసం రాయడంలో నా బ్లాగుకి నాలుగు హిట్లొస్తాయనే ఉద్దేశం ఎంత మాత్రమూ లేదు. దయచేసి గమనించగలరు.

చిరంజీవి చిన్నకూతురు ఇంట్లో వాళ్ళ అనుమతి లేకుండా అర్య సమాజంలో పెళ్ళిచేసుకుందట! అయితే ఏంటి? ఇదేదో ప్రపంచ సమస్య అయినట్టు ఎక్కడ చూసినా ఇదే హడావుడి. నేను చూడలేదు గానీ మన ప్రదేశంలో ఆ-టివి, ఈ-టివి అని తేడాలేకుండా టివి-1 నుంచి టివి-100 వరకూ దీని గురించే పెద్ద గోళ చేస్తూ వుండివుంటారు.

ఇంతకీ ఈ వ్యాసం రాయడం వెనుక ఉద్దేశం ఏంటంటే టివి వాళ్ళు చేస్తున్న ఈ హడావుడినంతా “ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి…” అన్న పేరుతో ఒక వెబ్సైటు వాళ్ళూ తెగ ఫీలయిపోయి ఒక వ్యాసం రాసారు. టివి వాళ్ళు చిరంజీవి కూతురి పెళ్ళి గురించి అనవసరమైన హడావుడి చేస్తున్నరని. అయితే ఇదే సైట్లో “చిరంజీవి చిన్నకూతురి ప్రేమ వివాహం” అని, “చిరంజీవికి ముందే తెలుసా….” అని, “అంత ససాక్ష్యంగా…” అని, “ఇక వారేమీ చేయలేరు:శ్రీజ” అని, “ఊహించనే లేదు:అరవింద్” అని తెగ స్క్రోలింగ్ చేస్తూ అదే విషయం గురించి తెగ ప్రచారం చేసేస్తున్న ఈ వెబ్సైటు వాళ్ళే టివి వాళ్ళ మీద ఈ అనవసరమైన ఎగురుడు ఎందుకో? బహుశా, ఆ విషయాన్ని టివిలో అంతగా చూసేసాక తమ సైటులో ఈ వార్తలు చదవడానికి ఎవరూ రారనేమో!

తెలుగులో ఈ మధ్యనే మొదలయిన ఈ వెబ్‌సైటు పేరు చెప్పడం ఇష్టంలేదు కానీ, ఒక వైపు చేసేదంతా చేస్తూ మరో వైపు ఈ ద్వంద వైఖరి ఎందుకో! అదీ కాక ఆ వ్యాసం చివర్లో హైదారాబదులో జరిగిన ఒక గ్యాంగ్ రేప్ గురించి ప్రస్తావిస్తూ దానిగురించి టివి వాళ్ళు కవర్ చెయ్యలేదని కూడా వాపోయారు పాపం. ఏం ఎవడో చెయ్యడమెందుకు? మహేష్ హెయిర్ స్టైల్ అరకోటో ఆరుకోట్లో అని చెప్పకపోతే ఆ రేప్ గురించి వీళ్ళు రాయొచ్చు గా! ఎందుకీ మొసలి కన్నీరు?

ఒకవేళ ఈ వ్యాసం రాసిన వ్యక్తి నిజంగానే ఫీలయ్యి రాసుంటే, I can only say one thing; “You are at a wrong place mate, come join the Telugu Blog Community.”