మీకు తెలుసా?
by admin@ 24fps
మీకు తెలుసో లేదో కానీ ఈ రోజు బ్లాగ్ యాక్షన్ డే!
ప్రపంచం మొత్తం మీద వున్న బ్లాగర్లు ఏకమై ఈ రోజు ఒకే విషయం మీద బ్లాగాల్సిన రోజు.ఈ రోజున ప్రపంచ బ్లాగర్లందరూ ఏకమై ప్రపంచ పర్యావరణాన్ని సంరక్షణ గురించి ఈ సారి బ్లాగుతున్నారు. రండి మనమూ ఒక పోస్టేద్దాం. పోస్టడమే కాదు ఇవాళ్టినుంచి మనమూ మన పర్యావరణాన్ని రక్షించుకునే దిశలో పయనిద్దాం.
నేను ఇవాళ తీసుకున్న నిర్ణయం: ఇవాళ్టి నుంచి సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు నాతో పాటే ఒక సంచీ తీసుకెళ్తా, సామాన్లన్నీ దాంట్లోనే మోసుకొస్తా. అవసరం లేనప్పుడల్లా ప్లాస్టిక్ బ్యాగులు వాడడం మానేస్తా!
మీరూ ఇలాంటి నిర్ణాయాలు చాలానే తీసుకోవచ్చు. మనం తీసుకునేవి చిన్న నిర్ణయాలయినా పెద్ద మార్పే కలుగచేస్తుంది. ఉదాహరణకు మీరు నడుపుతున్న బైకు లేదా కారు హారన్ మోగించడం నేటితో ఆపెయ్యండి. శబ్ద కాలుష్యాన్ని తగ్గించిన వారవుతారు. వారాంతరంలో మీ వాహనం ఉపయోగించకుండా పబ్లిక్ ట్రాన్స్‍పోర్ట్ ఉపయోగించడం ద్వారా మీకార్బన్ ఫుట్‍ప్రింట్ తగ్గించిన వారవుతారు. చీటికీ మాటికీ బైకు స్టార్ట్ చేసి రయ్య్మని పోకుండా రెండు లేదా మూడూ కిలో మీటర్ల దూరంలోని మీ గమ్యాన్ని నడక ద్వారా చేరుకోండి – మీకు మీరు ఆరోగ్యం ప్రసాదించుకున్న వాళ్ళవుతారు. ఆఫీసులో ప్రింట్ అవుట్లు ఉచితం గదా అని అవసరం వున్నా లేకపోయినా ప్రింటింగ్ చేయడం ఆపండి. ఒక వేళ అవసరమైనా కాగితానికి రెండువైపులా ముద్రించుకోండి, ఇంకా వీలయితే ఒకే వైపున రెండు పేజీలు అచ్చయ్యేలా ముద్రించుకోండి.మీ ఇంట్లోని చెత్తని వీలయిన చోట్ల రీ సైక్లింగ్-నాన్ రీసైక్లింగ్ గా విభజించండి. మీరు ఇండియాలో వున్నట్టయితే ఎక్కడపడితే అక్కడ చెత్త పారెయ్యకండి. బయటకెల్తున్నప్పుడు తోటే ఒక పేపర్ కవర్ వుంచుకుని చెత్తను అందులో పోగుచేసి అంతాకలిపి ఒక చెత్తకుండీలో పడెయ్యండి. మురుక్కాలవలో ప్లాస్టిక్ కవర్లను పారేయకండి. అన్నింటికీ మించి మీ పిల్లలకు పర్యావరణ సంరక్షణ మరియు పరిరక్షణ గురించి తెలియచేయండి!
మీరూ బ్లాగ్ యాక్షన్ డేలో పాల్గొనండి. మార్పు మీతొనే మొదలవ్వనివ్వండి!
Comments
కృతజ్ఞతలు. మీరు చెప్పే దాకా తెలియదు బ్లాగ్ యాక్షన్ డే అని ఒకటి ఉందని. నా వరకు నేను చెత్తని రీ-సైక్లింగ్ కి అనుగుణంగా విభజిస్తాను.
మంచి మాట చెప్పారు.పర్యావరణ సమతుల్యం ఆవశ్యకతపై నా రేడియో ప్రసంగాన్ని, నా బ్లాగులో ఉంచాను (http://deeptidhaara.blogspot.com/2006/10/blog-post_07.html).
బాగా డబ్బుసంపాదించి అల్ గోర్ జెట్ ప్రయాణానికి కార్బన్ ఆఫ్సెట్ కొనుగోలు చేసుకున్నట్టు మన జీవితాంతానికి సరిపడా కార్బన్ ఆఫ్సెట్ కొనుక్కుంటే సరిపోతుందేమో కదా (సులువైన మార్గం)
కృతజ్ఞతలు. మానవునికి ప్రకృతితో ఉన్న సంబంధం గర్బస్ధ శిశువుకు తల్లితో వున్న సంబంధం వంటిది (అదే నేను ఈ రోజు నా మరమరాలులో రాసినాను). ఈరోజులలో మనకు ఈ బ్లాగ్ యాక్షన్ డే చాలా అవసరం.
-మరమరాలు
నా బ్లాగొంతు
http://andam.blogspot.com/search/label/భూగోళ%20ఊష్ణీభవం
హారన్ వ్యతిరేకి నైన నాతో మా నాన్న అంటుంటారు, “ఉరేయ్ ఇది అమెరికా కాదు, హారన్ కొట్టాపోతే ఎవరో ఎప్పుడో వచ్చి కారుముందు దూకుతాడు” అని.
రవి గారు,
కార్బన్ క్రెడిట్స్, కార్బన్ ఆఫ్సెట్ అన్నవి పెద్ద ఫార్స్. ఒకళ్లని రేప్ చేసి ఇంకొకళ్లకి ఆపరేషన్ చేయడం లాంటిది, లేక అంతకంటే దారుణం అంతే.
అన్నట్టు ఇండియాలో కార్బన్ ఆఫ్సెట్ వ్యాపారం పెడితే చాలా డబ్బులు సంపాదించవచ్చు. దీని మీద వచ్చే April 23 న విఫులమైన టపా.
- రాకేశ్వర