ఇంతకీ మీరు అమెలీ చూసారా?
by admin@ 24fps
The Hours అని కొన్ని సంవత్సరాల ముందు ఒక సినిమా చూశాను. ఆ సినిమా చూడకముందే నేను Micahel Cunningham రచించిన The Hours అనే నవల కూడా చదివాను. నవలతో పాటు సినిమా కూడా నాకు బాగా నచ్చేసింది. Meryl Streep, Nicole Kidman, Julina Moore లు పోటీ పడి నటించిన ఈ సినిమా అప్పట్లో చాలా అవార్డులే సంపాదించింది. మూడు తరాల మహిళలను Virigina Woolf నవల అయిన Mrs Dalloway అనే పుస్తకం ఎలా ముడివేసింది అనేది ఈ కథ ముఖ్యాంశం.
The Hours వచ్చిన ఐదేళ్ళకు, Michael Cunnigham స్క్రీన్‌ప్లే తో వచ్చిన Evening సినిమా చుద్దామని నిన్న సాయంత్రం హడావుడిగా పరిగెట్టాను. మొత్తం సినిమా హాల్లో కెల్లా నేనొక్కడినే మగవాడిని.నాకు ముందే తెలుసు ఇది మహిళల సినిమా అని. ఇంగ్లీషు వాళ్ళు అన్నింటినీ విభజించి నట్టే సాహిత్యాన్ని ముక్కలు చెక్కలు చేసి అందులో చిక్ లిటరేచర్ అని ఒకటి చేర్చారు. ఈ రచనలు కేవలం మహిలళ కోసమన్నమాట. అలాగే ఈ సినిమా కూడా కేవలం మహిలళ కోసమో ఏమో, తెలిసో తెలియక చూసేసాను.
Evening సినిమా కథ, Hours సినిమా అంత బాగో లేనప్పటికీ ఫర్వాలేదని చెప్పాలి. మరణపుటంచున వున్న Ann అనే వృధ్ధురాలు తన గత జీవతంలోని ఒక సాయంత్రం జరిగిన సంఘటనలు నెమరువేసుకోవడమే ఈ కథ ముఖ్యాంశం. ఆ సాయంత్రం Ann తన తోటి స్నేహితురాలు Lila పెళ్ళికని వచ్చి అక్కడ Harris అనే వ్యక్తితో ప్రేమలో పడుతుంది. ఇంతకీ విషయమేమిటంటే Lila అప్పటికే Harris ని విపరీతంగా ప్రేమించేస్తుంది. మరో వైపు Lila తమ్ముడు Ann తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయుంటాడు. వీరందరి మధ్య ఆ సాయంత్రం జరిగిన ఒక ప్రేమ చదరంగాన్ని మరణశయ్యపైనున్న Ann గుర్తుకు తెచ్చుకోవడమే కాకుండా Ann చివరి రోజుల్లో ఆమెకు తోడుగా వున్న ఆమె కూతుర్లిద్దరి జీవితాలు ఎలా మారాయన్నది కూడా ఈ కథలో మరో అంశం.
కథా పరంగా The Hours కి వున్న పట్టు లేనప్పటికీ ఈ సినిమాలో నటి నటుల ప్రదర్శన బావుంది. నేను సినిమా చుస్తున్నంత సేపూ Lila పాత్రధారి Meryl Streep కు కార్బన్ కాపీలా వుండడమే కాకుండా ఆమె లానే నటిస్తుంది, ఎవరీ అమ్మాయి అనుకునాను. తీరా చూస్తే ఆ అమ్మాయి Meryl Streep కూతురని తెలిసింది. ఈ సినిమాలో వయసు మళ్ళిన Lila పాత్రను Meryl Streep పోషించడం ఒక అదనపు ఆకర్షణ.
అక్కడక్కడా బోరు కొట్టించినా కొన్ని సీన్లయితే అధ్బుతం అని చెప్పాలి. ముఖ్యంగా Ann మరియు Harris లు వర్షంలో కలిసే ఒక సీనయితే చాలా బావుంది.
The Hours సినిమాలో లాగే ,ఈ సినిమాలో కూడా magical realism తో కూడిన కొన్ని సీన్లు బాగానే వున్నాయి. మొత్తానికి చూదదగ్గ సినిమా. మీరు గతంలో వచ్చిన The Hours సినిమా చూసి నచ్చినట్టయితే ఈ సినిమా కూడా మీకు నచ్చే అవకాశం వుంది. ప్రయత్నించండి.
ఎందుకో తెలియదు కానీ ఈ సినిమా కథాక్రమం నాకు Bridges of Madison County అనే మరొ నవలను జ్ఞప్తికి తెచ్చింది. అప్పట్లో (పదేళ్ళ క్రితం) ఈ పుస్తకం చదివి నేను కంట నీరు పెట్టడం నాకు బాగా గుర్తు. ఆ తర్వాతా(2006లో) మరో సారి చదువుదామని ప్రయత్నించాను కానీ ఎందుకో అప్పుడంత నచ్చలేదు. కానీ ఈ నవలకొక ప్రత్యేకత వుంది. ఈ నవల కల్పితం అయినప్పటికీ కథనంలో రచయిత చేసిన ప్రయోగం వలన మనకి నిజమగా జరిగినట్టు అనుభూతి కలుగుతుంది. ఇలాంటి ప్రయోగమే Yann Martel రచించిన Life of Pi నవలలో కూడా గమనించవచ్చు. ఇంతకీ ఏంటా ప్రయోగం అంటే ఈ రెండు పుస్తకాలు చదివితే మీకే అర్థమవుతుంది.
Life of Pi అంటే గుర్తొచ్చింది ,ఈ నవలను సినిమాగా తీస్తున్నారని రెండేళ్ళ క్రితమే ప్రకటించారు. అదీ మన మనోజ్ నైట్ శ్యామలన్ దర్శకత్వంలో అని. కానీ ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు ఈ సినిమాకి Jean-Pierre Jeunet దర్శకత్వం వహిస్తున్నరని ప్రకటించారు. మీకు Jean-Pierre Jeunet ఎవరో తెలుసా? గతంలో Amelie, Delicatessen , The City of Lost Children సినిమాల దర్శకుడు.
ఇంతకీ మీరు అమెలీ చూసారా?
Comments
మీరు చెప్పిన ఇతర సినిమాలు పుస్తకాలు చూళ్ళేదు గానీ బ్రిడ్జెస్ ఆఫ్ మేడిసన్ కౌంటీ, లైఫ్ ఆఫ్ పై నవలలు చదివాను. మొదటిది నాకు నచ్చలేదు .. బహుశా మగవాణ్ణి కావటం వల్లనో, చదివేప్పటికే అటువంటి ప్రేమానుభూతుల మీద నమ్మకం పోవటం వల్లనో కావచ్చు. నాకు తెలిసి స్త్రీ జనాలు ఈ పుస్తకాన్ని ఆకాశాని కెత్తేశారు. ఈ మధ్య చదివిన వాటిల్లో బాగా నచ్చిన వాటిల్లో పై ఒకటి. రచయిత సృజన శక్తి అనేక తలాల్లో పని చేసింది ఈ నవల్లో. రెండు నవలల్లోని కామన్ టెక్నిక్ గురించి మీరన్నమాట నాకు అర్ధమైంది. కానీ అది ఒక టెక్నిక్ మాత్రమే – అసలు దాంట్లో పస లేకపోతే అది ఏమీ చెయ్యలేదు. దానికి మంచి ఉదాహరణ కూడా ఈ రెండు నవలలే.
Yeah, Amelie నేను చూసాను… మాంచి సినిమా… చిన్న చిన్న ఆనందాలు….చిన్న చిన్న సంతోషాలు.. బాగా చూపించారు ఆ సినిమాలో …
అమెలీ వంకతో ఇప్పుడు ఇంకో రెండు మూడు సినిమాల గురించి తెలుసుకున్నాను. కృతజ్ఞతలు.
)
నేను evening ట్రయిలర్ చూసా. చాలా ఆసక్తి కరంగా అనిపించింది. (పేదరికం వల్ల ట్రయలర్ మాత్రమే చూసి సినిమా చూసిన ఆనందం పొందడం ఒ అలవాటు
కొన్ని చిక్ సినిమాలు బాగుంటాయి, కొన్ని మరీ రాడ్ అయినా.
ఇక అమెలీ అయితే కనీసం ఐదు సార్లు చూసా !