Life – Another update
by admin@ 24fps
Youtube, google video ల పుణ్యామా అని పాత మధురాలను మళ్ళీ ఆస్వాదించే అవకాశం కలుగుతోంది. కొన్నాళ్ళుగా పనిలో తల మునకలైపోయిన నాకు పోయిన వారం చూసిన నాలుగు సినిమాలు నా దాహం తీర్చకపోగా మరింత పెంచింది. ఇంట్లో వున్న DVDలన్నీ ఇప్పటికే చూసేసి వుండడంతో మరో సారి అంతర్జాలంపై పడి వేట మొదలెట్టాను.Google లో వెతుకుతూ అక్కడనుంచి ఎక్కడికో వెళ్ళిపోయి అంతార్జాలంలో రాత్రిపూట మార్జాలంలో వెతుకుతూ పోతే పెద్ద ఖజానానే బయటపడింది. ఇందులో ముఖ్యమైనవి ఇవే!
1) చాలా రోజులుగా వెతుకుతున్న సత్యజిత్ రే లఘు చిత్రం పీకూ.
2) బ్యోంకేశ్ బక్షి – దూరదర్శన్ సీరియల్
3) ఇంతవరకూ పేరుకూడా వినని సత్యజిత్ రే సినిమా అయిన చిడియాఖానా
4) కాలానికతీతంగా చెక్కుచెదరని తాజాదనం కలిగిన మాల్గుడి డేస్ సీరియల్
5) కన్నడ చిత్రరంగం అందించిన ఆణిముత్యం లాంటి దర్శకుడు శంకర్ నాగ్
6) ఒక పాత పాపం
సత్యజిత్ రే రూపొందించిన లఘు చిత్రం పీకూ గురించి మాటల్లో చెప్పడం కష్టం.ఈ సినిమా ని ఈ కింద చూడవచ్చు. ఈ సినిమా బెంగాళీ భాషలో వుంది కానీ సినిమా అనేది దృశ్యానికి ప్రాముఖ్యత కలిగిన కళ కావడం మూలాన Subtitles లేకుండానే నాకు సినిమా అంతా అర్థమయిపోయింది. కావాలంటే మీరూ చూసి ప్రయత్నించండి. అలా అని ఈ సినిమాలో సంభాషణలు లేవని అనుకోవద్దు. ఈ సినిమాలో చాలానే సంభాషణలు వున్నాయి. అయినా చెప్పల్సిన విషయమంతా నటీ నటుల ముఖ కవళికల ద్వారా లేదా దృశ్యపరమైన ఇతర అంశాల ద్వారా ప్రేక్షకునికి అర్థమయ్యేలా ఈ సినిమాను రూపొందించాడు కాబట్టే రే అత్యున్నత స్థాయికి ఎదగగలిగారు.
నానాటికీ తరిగిపోతున్న మానవ విలువ నేపధ్యంలో రుపొందించిన ఈ లఘు చిత్రంలో మీకు అర్థం కావలిసిన డైలాగు ఏదైనా వుందంటే అది చివరి సన్నివేశంలో “పీకూ” పాత్రధారి చెప్పే “అమ్మా, తెల్ల పూలను నల్ల పెన్సిల్ తో గీయనా” అని చెప్పే ఒక్క డైలాగు మాత్రమే! నేడే చూడండి. పీకూ…మీ అభిమాన థియేటర్ 24fps లో.
Part1
Part2
Part3
ఈ బాలాజీ టెలిఫిలిం వాళ్ళు వచ్చి TV ని కుసుం గిసుం అంటూ పాడుచేయకముందు రోజుల్లో DDలో వచ్చిన బ్యోంకేశ్ భక్షి అనే సీరియల్ ఈ మధ్యనే ఇంటర్నెట్ లో చూడడం మొదలుపెట్టాను.పాశ్చాత్య ప్రపంచానికి ఒక Sherlock Holmes వున్నట్టు మనకీ ఒక డెటెక్టివ్ వున్నాడు. బెంగాలు కి చెందిన శారధింధు బందోపాధ్యాయ్ అనే రచయిత సృష్టించిన ఈ బ్యోంకేష్ బక్షి అనే పాత్ర Sir Arthur Conan Doyle సృష్టించిన Sherlock Holmes పాత్ర ఆధారంగా వున్నప్పటికీ మన నేటివిటి కి తగ్గట్టుగా రూపొందించారు రచయిత.
ఈ రచనల ఆధారంగానే రూపొందించిన DD సీరియల్ లోని దాదాపు అన్ని ఎపిసోడ్స్ ఇక్కడ చూడవచ్చు.
బ్యోమెకేష్ బక్షి గురించి చర్చిస్తున్నప్పుడు తప్పక ప్రస్తావించాల్సిన మరో విషయం చిడియా ఘర్ అనే సినిమా గురించి.సత్యజిత్ రే తీసిన సినిమాల్లోకెళ్ళా అత్యంత తక్కువ ప్రాచుర్యం కలిగిన సినిమాల్లో చిడియా ఘర్ ఒకటి. సత్యజిత్ రే ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఈ విధంగా అంటారు;”Chiriakhana’s a whodunit, and whodunits just don’t make good films. I prefer the thriller form where you more or less know the villain from the beginning. The whodunit always has this ritual concluding scene where the detective goes into a rigmarole of how everything happened, and how he found the clues which led him to the criminal. It’s a form that doesn’t interest me very much”
సత్యజిత్ రే కి ఆ సినిమా ఎందుకు నచ్చలేదో కానీ నాదృష్టిలో ఈ సినిమా సూపరో సూపరు. ఆయన తిసిన మిగిలిన సినిమాలంత కళాత్మకత ఈ సినిమాలో లేకపోవచ్చు గానీ ఈ సినిమా చూస్తుంటే Alfred Hitchcock సినిమా చుస్తున్నట్టుగా వుంటుంది. ఈ సినిమాలో మరో ఆసక్తి గలిగించే విశేషం ఏంటంటే స్టేజింగ్ అనే అంశం. ఈ సినిమా మొదటి సీను మొదట ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలయ్యి, మూడో వ్యక్తి ప్రవేశంతో ముగ్గురితో నడుస్తుంది. విశేషమేమిటంటే దాదాపు పదిహేను నిమిషాల పాటు నడీచే ఈ సీను ఒకే గదిలో జరిగినప్పటికీ ఆ రూములో కెమెరా, మరియు పాత్రలు కదిలే విధానాన్ని గమనిస్తే మీకే అర్థమవుతుంది ఆయన కి అస్కారు ఎందుకిచ్చారో మన వాళ్ళకి అలాంటి ఆస్కారం ఎందుకు లేదో.
ఇంతకీ ఈ సినిమాకి, బ్యోంకేష్ బక్షికి ఈ సినిమాకి సంబంధమేంటా అని ఆలోచిస్తున్నారా, ఈ సినిమాలో ముఖ్యపాత్రధారి బ్యోంకేష్ బక్షి కావడమే. సత్యజిత్ రే సన్నిహితులెవరో ఈ సినిమా తీద్దామని చివరికి ఆ ప్రయత్నంలో విఫలం కావడంతో చివరి నిముషాన ఆపధ్భాందవుడిలా వచ్చి ఈ సినిమా తీసారట సత్యజిత్ రే.
కెమెరా మరియు పాత్రల మధ్య జరిగే ఒక నృత్యం లాగా స్టేజ్ చేసిన సన్నివేశాలు చాలానే వున్నాయి ఈ సినిమాలో. తప్పక చూడవలసిన సినిమా.
ఇక మాల్గుడీ డేస్ గురించి చెప్పేదేముంది. నా చిన్నప్పుడు ఈ సీరియల్ చూసే అవకాశం లేకపోయినా ఇప్పుడు చూసి ఆనందిస్తున్నాను.RK Narayan రాసిన నవల ఎంత బావుంతుందో ఈ రీరియల్ కూడా అంతే బావుంటుంది. నిజానికి RK Narayan కాగితం మీద సృష్టించిన మాల్గుడికి దృశ్య రూపమిచ్చిన శంకర్ నాగ్ చిరస్మరణియుడు. ఈ సీరియల్ ని కవితా లంకేష్ మళ్ళీ తీస్తున్నరని విన్నాను. శంకర్ నాగ్ కంటే బాగా తీయగలరన్న నమ్మకం నాకస్సలు లేదు. పైగా పాత సీరియల్ని మళ్ళి ప్రాసరం చేయక మరోసారి చిత్రీకరించడం ఎందుకో? DD వాళ్ళకి డబ్బులెక్కువయ్యాయి కాబోలు.
ఇకపోతే RK Narayan పుస్తకాలకు దృశ్య రూపమిచ్చిన శంకర్ నాగ్ గురించి రాయాలంటే ఇంకా కొంచెం రీసెర్చ్ చేయాలసిన అవసరం వుంది. రాబోయే కాలంలో శంకర్ నాగ్ గురించి మరో వ్యాసం రాస్తాను.
ఇక పోతే పోయిన వారం నేను అంతర్జాలంలో చేసిన లోతైన శొధన లో బయటపడింది ఈ కింది వీడియో. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందన్నారు కదా. ఈ వీడియో తీసిన పాపం నాదే!
2005లో మొదటి సారి UK వచ్చినప్పుడు ఆఫీసులో వాళ్ళకి సినిమాలపై నాకున్న ఆసక్తి గ్రహించి డైరెక్టర్ అని పిలవడం మొదలుపెట్టారు. అది విని మనసులోనే మురిపోతూ వుంటే ఒక రోజు Samuel అనే వ్యక్తి నేను www.carsalesindia.com అనే వెబెసైటు నిర్మిస్తున్నాను నాకొక advertisement చెసివ్వగలవా అనడగితే హడావుడిగా ఒక హేండీకాం పట్టుకుని ఆఫీసులోని ఇద్దరు ముగ్గురు హీరోలను వెంటేసుకుని ఈ కింది వీడీయో సృష్టించాము. అదే ఈ advertisement. ఒక నెల పాటు మా టి వి లో కూడా ప్రదర్శింపబడింది ఈ ad.
మరి ఈ వీడియో ని ఇక్కడ ఎవరు upload చేసారో నాకయితే తెలియదు. దేనికోఅమో వెతుకుతుంటె ఇది దొరికింది. వీలయితే చూడండి.
Comments
పీకు… మీరన్నది పికూస్ డైరీ కథ గురించేనా?? చిన్నపిల్లవాడి డైరీ లో విషయాలు….. వగైరా? అది ఆయన చాలా ఫేమస్ కథ…. పిల్లవాడి రాత లోనే ప్రింటు చేసి ఉండటం ఈ కథ ప్రత్యేకత…
మాల్గుడీ డేస్ నాకు చాలాఇష్టం అది సీరియల్ గా వచ్చినపుడు నేను చాలాచిన్నదాన్ని టివి లో ఆటైటిల్ మ్యూజిక్ చాలాఇష్టపడేదాన్ని ముందు గీసిన బొమ్మలు వాటిలాగే సీరియల్లో పరిసరాలు మనుషులు ముఖ్యంగా ఆ పిల్లాడు నాకు అప్పట్లో చాలా నచ్చేవి,ఆ కథా,కథనం,పిక్చరైజేషన్ చాలా గొప్పగా వుంటుంది. నాకు ఆ కథలు పూర్తి గాగుర్తుకు లేవు కాని అవి చూసినప్పుడు కలిగినఫీలింగ్ మాత్రం మరచిపోలేను.
అప్పట్లో ‘చెలువి’అని గిరీష్ కర్నడ్ ది ఒక టెలీఫిలిం చూసాను అది నేను ఎప్పటికీ మర్చిపోలేను దాదాపు 12 ఏళ్ళ యిందనుకుంటా ఒక అమ్మాయి చెట్టు గా మరిపోతుంది ఆకథలో ఆచెట్టు ని నరికాక తిరిగి మనిషిగా మారినప్పుడు గాయాలతో విలవిల లాడే ఆమె ని చూస్తే ఎవ్వరూ చెట్ల పై చెయ్యి వేయలేరు అది మీకు దొరికితే ఇక్కడ తప్పక ప్లే చేయండి.
మన సినిమాల్లో మన నేటివిటీ ఉండాలని సత్యజిత్ రే అన్నాడు.
80ల్లో డీడీలో వచ్చిన చాలా ధారావాహికలు అలాగే తీశారు. ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాల్ని నేటివిటీ ఆధారంగా తీశారు. కాదల్, వెయిల్, పరుత్తి వీరన్. ఈ మూడూ విజయం సాధించాయి.
వనజను Roger Ebert మెచ్చుకున్నాడు చూశారా.
Nenu monnane oka Kannada cinemaa choosanu. Ondanondu kaladalli. It was directed by Girish Karnad. Seems like a tribute to Kurasawa. It was an amazing film. Shankar played lead role in that.
It is really sad that Shankar Nag met with an untimely death.
డైరెట్రు గారు, మీ అభిరుచి అదుర్స్.మీరుచెప్పిన (పీకు తప్ప)అన్ని సినిమాలు,సీరియళ్ళు నా జీవితం లో కూడా చాలా ప్రభావితం చేశాయని చెప్పడానికి గర్విస్తున్నాను.వీలైనన్ని లంకెలు ఇచ్చి మాలాంటి ప్రేక్షకుల కు ఆనందాన్ని కలిగింస్తున్నందుకు మీరు అభినందనీయులు. ఇక సిరి గారు చెప్పిన తమిళం లో నేటివిటీ తో ఏకీభవిస్తున్నాను, ఈ మధ్యకాలం లో గ్రామం లేక చిన్నపట్టణం నేపధ్యంగా గల సినిమా తెలుగు లో ఏదైనా వచ్చిందేమోనని ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా గుర్తురాలేదు.అదీ మన సినిమాల ఖర్మ.
ఈ మధ్యన నేను గిరీశ్ కాసరవెల్లి “ద్వీప” చూశా, తెలుగు లో ’మరో సావిత్రి’అని పొగడబడ్డ దివంగత నటి సౌందర్య దీనికి నిర్మాత (ఇందులో నటించింది కూడా). Displacement ని గురించి ఇంత సునిశితంగా,హ్రుద్యమ్నం మరే సినిమా చెప్పలేదనుకుంటా (మేధా పాట్కర్ కు ఈ సినిమాని బహుమతిగా ఇవ్వాలని మనవి,hunger strike కన్నా ఇది పవర్ ఫుల్ గా పనిచెస్తుందేమో).వీలుంటే తప్పక చూడండి.