చక్ దే – ఇండియా
by admin@ 24fps
Warning:Spoilers ahead
భారత హాకీ టీము కెప్టెన్ కబీర్ ఖాన్. పాకిస్తాన్ తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ ఫైనల్లో చివరి నిమిషంలో కబీర్ ఖాన్ కి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేక పోవడంతో ఇండియా పరాజయం పాలవుతుంది. క్రీడల్లో గెలవడం, ఓడడం సహజమైనప్పటికీ ఆ జరిగిన మ్యాచ్ పాకిస్తాన్‌తో కావడం, కబీర్ ఖాన్ ఇస్లాం మతస్తుడు కావడం మాత్రమే కాకుండా, ఆట చివర్లో పాకిస్తాన్ ఆటగాళ్ళతో చనువుగా మెలగడం లాంటి అంశాలు కబీర్ ఖాన్‌ను అనుమానితుడ్ని చేస్తాయి. పాకిస్తాన్ గెలవడం కోసం గోలు చేసే అవకాశాన్ని కావాలని వదులుకున్నట్టుగా చిత్రీకరించిన మీడీయా ఆడిన ఆటలో బలయిపోతాడు కబీర్ ఖాన్. పర్యవశానంగా భారత హాకీ టీము నుండి వెలివేయబడతాడు.తనకు, తన వాళ్ళకు జరిగిన అవమానం భరించలేక ఆజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు కబీర్ ఖాన్.ఆ తర్వాత ఏడేళ్ళకు భారత మహిళా టీముకి కోచ్ గా తిరిగి వస్తాడు కబీర్ ఖాన్. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి, విభిన్న మనస్తత్వాలు కలిగిన పదహారు మంది యువతులను ఒక్క తాటిపై నడిపించి చివరకు ప్రపంచ కప్ గెలవడానికి కారణమవుతాడు. దాంతో తన పై నింద మోపిన వారికి పాఠం చెప్పి తన అజ్ఞాతాన్ని చాలించడంతో కథ ముగుస్తుంది.
వినడానికి పెద్దగా వైవిధ్యమైన కథ కానప్పటికీ దర్శకుడు షిమిత్ అమిన్ పనితనం, రచయిత జైదీప్ సహానీ స్క్రీన్‌ప్లే, భారత హాకీ టీము సభ్యుల పాత్రల్లో నటించిన పదహారు మంది యువ నటీమణుల అధ్భుత నటన, సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీ, అమితాబ్ శుక్లా ఎడిటింగ్ లాంటి అంశాలెన్నో ఈ సినిమాను వైవిధ్యంగా మలవడానికి దోహదపడ్డాయి.
ఈ సినిమాలో కెల్లా హైలైట్ నటీనటుల నటన. షారూఖ్ ఖాన్ తప్పితే మిగిలిన వారంతా దాదాపు కొత్తవారే! ఇంత మంది కొత్త వాళ్ళ నుండి సరైన నటనను ప్రదర్శింపచేయడంలో దర్శకుడు షిమిత్ అమిన్ పనితనం అభినందనీయం. హాలీవుడ్‌లో ఇలాంటి కథాంశాలతో లెక్కకు మించి సినిమాలు వచ్చాయి.అలాగే బాలీవుడ్లో కూడా లగాన్, ఇక్బాల్ లాంటి సినిమాలు కూడా దాదాపు ఇలాంటి కథాంశంతోనే నడుస్తాయి. హిండీ, ఇంగ్లీషుల్లోనే కాకుండా తెలుగులో వచ్చిన “సై” సినిమా, మొన్నా మధ్య తమిళంలో వచ్చిన “చెన్నై 600028″ సినిమాలు కూడా ఈ కోవకే చెందుతాయి. అయినప్పటికీ మహిళల హాకీ నేపధ్యంలో వచ్చిన మొట్ట మొదటి సినిమా చక్ దే. అంతే కాకుండా ఆటలు పురుషులకే కాదు సరైన అవకాశం కల్పిస్తే మహిళలు కూడా తమ సత్తా ఋజువు చేసుకోగలరని ప్రభోధించే ఈ సినిమా మహిళల్లో కొత్త ఉత్సాహం నింపి క్రీడల్ వైపు మనసు లగ్నం చేసేలా దోహదపడుతుందనడంలో అతిశయోక్తి లేదు.
దాదాపు సినిమా మొత్తం వాస్తవానికి దగ్గరగా అనిపించే రీతిలో రూపొందిచే ప్రయత్నం చాలా బాగుంది. Natural light లోనే దృశ్యాలను చిత్రీకరించడం, handheld కెమెరా వుపయోగించడం, ఎబ్బెట్టుగా లేని నటన, మెలోడ్రామా కు చోటు కల్పించకపోవడం, లాంటి అంశాలతో షిమిత్ అమిన్ తన కంటూ ప్రత్యేక శైళీని ఏర్పరుచుకున్నట్టుగా ఈ సినిమా ఋజువు చేస్తుంది. గతంలో అబ్ తక్ చప్పన్ సినిమాలో కూడా ఇలాంటి అంశాల ద్వారానే వాస్తవికతకు దగ్గరగా తన సినిమాను రూపొందించగలిగారు.
క్రికెట్టు తప్ప వేరే క్రీడలన్నీ మరుగున పడుతున్న ఈ రోజుల్లో మహిళా హాకీ నేపధ్యంలో సినిమా తీయడం ఒక విధంగా రిస్కుతో కూడుకున్న పనే! అదీ షారూక్ ఖాన్ సినిమా అంటే ప్రీతి జింతానో, రాణీ ముఖర్జీనో తప్పక వుండీ తీరాల్సిన రోజుల్లో, షారూఖ్ ఖాన్ కి తోడూగా హీరోయిన్ అయినా లేకుండా, అనవసరమైన హడావుడి, హంగులూ ఆర్భాటాలూ లేకుండా, డ్యూయెట్లు, ఐటం నెంబర్లు లేకుండా సినిమా తీసి ప్రేక్షకుల మన్ననలు పొందడం ద్వారా షిమిత్ అమిన్ నేటి దర్శకులకు కొత్త పాఠం నేర్పించాడు.కాకపోతే ఈ పాఠాన్ని చాలా మంది నవదర్శకులు తప్పుగా అర్థం చేసుకుని కబడ్డీతో మొదలు పెట్టి, బాక్సింగ్, సైక్లింగ్ లాంటి క్రీడల్నే కాకుండా, గోళీలాట, గోటి-బిళ్ళ లాంటీ క్రీడల నేపధ్యంలో కుప్పలు తెప్పలుగా సినిమాస్త్రాలను మనమీద వదలడం ఖాయం.
రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా ఎడారిలో ఎండమావి లాంటిది. ఎప్పుడూ foreign దేశాల్లో జరిగే అబధ్ధపు ప్రేమ కథలను మాత్రమే అందించే yash raj films వెరైటీగా ఇలాంటి సినిమాలు కూడా నిర్మించడం చాలా మంచి ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాలు విజయం సాదించినప్పుడే కొత్త దర్శకులు మంచి సినిమాలు తీసే యోచన కలుగుతుంది. నిర్మాతలు కూడా ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసే అవకాశముంది. మంచి సినిమాకై తపించే వారందరూ తప్పక చూడాలసిన సినిమా. పైరేటేడ్ DVD లో చూడకుండా హాయిగా కుటుంబం మొత్తం ఒక సాయంత్రం హాయిగా మీ దగ్గర్లోని సినిమా హాల్లో చూడాల్సిన సినిమా. నేడే చూడండి.
గమనిక: ఈ సినిమా అత్యధ్భుత కళాఖండం అని ఊహించుకుని మాత్రం సినిమాకి వెళ్ళొద్దు. నిజానికి సినిమాలో చాలానే loopholes వున్నాయి. కాకపోతే ఎప్పుడో ఒకప్పుడూ వచ్చే కొద్దిపాటి మంచి సినిమాను కూడా విశ్లేషణ పేరుతో చీల్చి చెండాడి చూడాలనుకునే వారిని నిరాశపరచకూడదనే వుద్దేశంతో ఈ సినిమాలోని negative పాయింట్స్‌ను కావాలనే ప్రస్తావించలేదు. ఈ సినిమా చూసి మీకు నచ్చని అంశాలేంటో కామెంట్స్ లో రాస్తే మనం చర్చించుకోవచ్చు.
Comments
బాగుందడీ వెంకట్ గారూ…మీరు మరీ ఇలా మొత్తం కధ చెప్పెయ్యకుండా ఉండాల్సింది. కనీసం ఒక గమనిక ఐనా పెట్టుండాల్సింది పైన. స్పోయిలర్స్ అని.
Hi, please add your blog to our new directory of Indian Blogs, thanks!
http://www.indiblogger.in
షారుఖ్ ఖాన్ హీరోయిన్ లేక చాల ఇబ్బంది పడ్డాడు. కనీసం మైదానం లో కోచ్ అంటే ఆడేవాళ్ళతో కలిసి ఆడాలా? ఒక్క అడుగు వెయ్యలేదు, ఊరకనే నిలబడి చూడ్డం తప్ప ఏమీ చెయ్యలేదు.