తస్మాత్ జాగ్రత్త!

by admin@ 24fps

ఈ సారి ఎందుకో గానీ జనవరిలోనే మన హైదరాబాదు అంతర్జాతీయ సినిమా వుత్సవాలు జరిపేస్తున్నామని హడావుడి గా ప్రకటించేశారు.నిజానికి ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్ జరపడం పెద్ద పనేం కాదు. ప్రపంచంలోని ప్రతి పట్టణంలోనూ ఒక film festival ఏర్పాటవుతున్న రోజులివి. అలాంటప్పుడూ మన హైదరాబాదు film festival బాగా ప్రాచుర్యం పొంది అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందాలంటే మొదట రాజకీయాలకు దూరంగా ఈ పందుగను జరపాలి. ఇప్పటికే దాసరి వెనకుండి ఈ పండుగను దర్శకత్వం చేస్తున్నట్టు అర్థమవుతుంది. CC రెద్ద్య్ ని కమిటీలో చేర్చడం ద్వారా కాంగ్రేస్ ప్రాభల్యం ఇక్కడా కనిపిస్తోంది. ఇక నాగబాబు ఏమి సలహాలిస్తాడొ ఏమో తెలియదు.MS రెడ్డిని, రామానాయుడుని కమిటిలో చేర్చడం ద్వారా సినీ ప్రముఖులను గౌరవించినట్టుగా అయ్యింది.

రామానాయుడు, MS రెడ్డి లాంటి పెద్దలతోపాటు మన సినీ కళాకారులందరికీ సమానమైన స్థానాన్ని కల్పించడానికో ఏమో గానీ, నిర్మాతల సంఘం నుంచి కళ్యాణ్ గారిని, టెక్నీషియన్స్ సంఘం నుంచి కోటగిరి వెంకటేశ్వర రావు గారిని, నటీనటులను ప్రాతినిధ్యం వహిస్తూ నాగబాబు, రచయితల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ పరుచూరి వెంకటేశ్వరరావు గార్లను Festival advisor లిస్టులో చేర్చేయడంలో ఉద్దేశమేంటొ అర్థం కాలేదు.పైన పేర్కొన్న వారిలో అంతర్జాతీయ సినిమాపై ఎవరికి ఎంత అవగాహన వుందో అనుమానమే!

ఒరియా భాషలో సినిమా తీస్తే జాతీయ అవార్డు గెలుచుకోవచ్చని అభిప్రాయాలు కలిగిన రామానాయుడు, ఒట్టేయ్యడం, తొడగొట్టడం, నరికెయ్యడం లాంటి సంభాషణలు రాసే పరుచూరి, Ghost and the Darkness సినిమాని తెలుగులోకి మృగరాజుగా కాపీ కొట్టడంలో తప్ప పెద్దగా సృజనాత్మకత కనబరచని నాగబాబు, ఎడిటింగ్‌లో పెద్దగా నవ్యత గానీ నవ కల్పనలు గానీ కనబరచని కోటగిరి, ఇప్పటివరకూ తీసిన సినిమాల్లో ఒక్క సినిమా అయినా కనీసం ఫర్లేదు అన్న స్థాయికి కూడా చేర్చలేకపోయిన నిర్మాత CC రెడ్డి, వీళ్ళంతా ఏ అర్హతలు కలిగి వున్నారని ఈ Festival Adisors గా నియమింపబడ్డారో తెలియదు. Advisory Board లో రమేష్ ప్రసాద్ పేరు చేర్చడం మంచిదే! ఆ విధంగా film festival సినిమాలను మల్టిప్లెక్ష్లో ప్రదర్శించే అవకాశం దక్కుతుంది.
 

మరి కళాతపస్వి విశ్వనాధ్ ఏమయ్యారో, బాపు సంగతేమిటో, B నర్సింగరావు ఎక్కడున్నారో? హైదరాబాదు ఫిల్మ్ క్లబ్  ప్రకాష్ రావు, MV రఘు గార్లు ముఖ్య పాత్ర వహించి, సినిమాపై అవగాహన వున్న వాళ్ళను Advisors గానో, న్యాయనిర్ణేతలగానో నియమిస్తే మేలని నా అబిప్రాయం.
మొన్నా మధ్య మాటల్లో స్నేహితుడొకడు చెప్పాడు, కరీంనగర్లో వున్న ఒక లైబ్రేరియన్ అక్కడ ఒక ఫిల్మ్ క్లబ్ నడపడమే కాకుండా, ఇటాలియన్ నియోరియలిజం గురించి రెండు పుస్తకాలు కూడా ప్రచురించారట. పోయిన వారం కొడవగంటి రోహిణి ప్రసాద్ గారి ద్వార తెలిసిన మరో విషయం ఏంటంటే, వారి అన్న గారైన కొడవగంటి రామచంద్ర రావుగారు దాదాపు ముప్పై ఏళ్ళ పాటు పూనే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్లో ఎడిటింగ్ భోధించే ప్రొఫెసర్‌గా పని చేసారని. ఇలా వెతుక్కుంటూ పోతే సినిమాల గురించి విశేష జ్ఞానమున్న వ్యక్తులు ఎంతో మంది దొరుకుతారు. ఇలాంటి వారిని ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చురుగ్గా పాల్గొనేలా చేస్తే మంచి ఫిలితాలు లభించవచ్చు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచవచ్చు.

అలా కాకపోతే సినిమా రంగంలోని వివిధ తరగతుల వాళ్ళు మాకూ ఈ పండుగ లో వాటా కావాలి, తద్వార వీలైతే కాస్తా డబ్బో పేరో పోగేసుకుందామనుకుంటే, మొన్న వజ్రోత్సవాలప్పుడూ జరిగీ గోళే మళ్ళీ జరగొచ్చు. చరిత్ర పునరావృత్తం కావొచ్చు. తస్మాత్ జాగ్రత్త!