How do I know what I know?
by admin@ 24fps
ఎందుకో తెలియదు గానీ ఒక్కోసారి మనకి కొన్ని విషయాలు తెలుసనుకుని నమ్మేస్తాం మనం. ఇంగ్లీషులో చెప్పాలంటే “we take certain things for granted”. ఉదాహరణకు Times గ్రూపు వాళ్ళు చాలా రోజుల క్రితం “Sacred Chants of Siva” మరియు “Sacred chants of Budhdha” అని రెండు ఆడియో క్యాసెట్లు విడుదల చేశారు. అవి రెండూ వినడానికి బాగానే వుంటాయికానీ ఎందుకో కానీ అందులో పాడినా వారి సంగతే కొంచెం విచిత్రంగా వుంటుంది. మన భాష వచ్చీరాని విదేశియులెవరో పాడినట్టుగా వుంటాయి అందులోని శ్లోకాలన్నీ. మన దేవుళ్ళ గురించి పాడుతూ అలాంటి గొంతు ఎన్నుకోవడంలో Times గ్రూపు వారి వుద్దేశమేమిటో నాకు అప్పుడు అర్థం కాలేదు. వారి దిన పత్రిక Times of India ద్వారా మరియు వారి TV ఛానెల్ Zoom ద్వారా పాశ్చాత్య పోకడలను ప్రజలమీదకి రుద్దుతున్న Times వారు ఆడీయో క్యాసెట్ల ద్వారా కూడా తమ ప్రయత్నాలు మొదలుపెట్టారా అన్న అనుమానం కూడా కలిగింది. కానీ నా అనుమానం నిజం కాదని ఈ మధ్యనే తెలిసింది.
మొన్నీ మధ్య ఇక్కడ (UK) లో ఒక సంగీత ప్రదర్శన వుంటే వెళ్ళాను. అమెరికా లో పుట్టి పెరిగి, ఇంగ్లాండులో సంగీత కళాకారునిగా స్థిరపడ్డ Craig Pruess అనే ఆయన సితార్ సంగీత ప్రదర్శన అది.విన్నంత సేపు రసికులను మంత్రముగ్ధుల్ని చేసింది ఆయన సంగీతం. ప్రదర్శన అయ్యాక ఆయనతో మాట్లాడుతుంటే తెలిసిన విషయమేమిటంటే, పైన పేర్కొన్న “Sacred Chants of Siva” మరియు “Sacred chants of Budhdha” లకు సంగీతం సమకూర్చడమే కాకుండా అందులోని శ్లోకాలను పాడింది కూడా ఈయనే అని. మొదట్లో కేవలం సంగీతం సమకూర్చడం వరకే తన బాధ్యత అని మొదలుపెట్టినా ఆ శ్లోకాల ఆలాపనలు విని చాలా ప్రభావితమయ్యాడట ఆయన. అందుకే కష్టమైనా నేర్చుకుని ఆ శ్లోకాలను తనే పాడానని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఎక్కడ అమెరికా! ఎక్కడ ఇండియా!. మనమేమో రాక్ మ్యూజిక్ అని అటుపోతుంటే ఈయన మన సంగీతం నేర్చుకుని మనకి శ్రవణానందం కలుగచేయడం నాకు ఆనందం కలుగచేసింది. ఆయన్ని కలవడం ద్వారా నాకు తెలిసిన మరో విషయం ఏంటంటే మొన్నా మధ్య వచ్చిన Mistress of Spices, Bend it like Beckham సినిమాలకు సంగీతం అందించింది కూడా ఈయనే అని. ఆయన్నే కలవకపోతే నాకు Times వారు సంస్కృత శ్లోకాలను విదేశీయుల చేత ఎందుకు వల్లించాల్సి వచ్చిందో నాకు తెలిసేది కాదు.
అలాగే చిన్నపటి నుంచీ నాకు తెలుసనుకుని గుడ్డిగా నమ్మిన మరో విషయం, BATA shoes మన ఇండియన్ కంపెనీ అని. మరి అలా నేనెందుకు అనుకున్నానో నాకే తెలియదు. ఈ మధ్యనే ఇంటర్నెట్ లో ఎని గురించో శొధిస్తుంటే తెలిసింది బాటా మన వాళ్ళది కాదని చెక్ దేశస్థులదని. Tomas Bata అనే ఆయన 1894 లో ఈ కంపెనీ స్థాపించారట. “Work collectively, Live Individually అనే సిధ్ధాంతాన్ని ప్రభోధిస్తూ సాంకేతిక విప్లవం తెచ్చిన సదుపాయాలతో ఎక్కువ సంఖ్యలో పాదరక్షలు వుత్పత్తి చేసి తక్కువ రేటులో వినియోగదారులకు అందచేయాలనే ఉద్దేశంతో Tomas Bata స్థాపించిన ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచం నలుమూలల వ్యాపించింది.ప్రపంచంలోని 50 దేశాలలో బ్రాంచీలు కలిగి వున్న ఈ పాదరక్షల కంపెనీ 4600 షాపుల ద్వారా రోజుకి దాదాపు పది లక్షల మందికి తమ పాదరక్షలను అమ్ముతూ, 40000 మందికి ఉపాధి కలిగిస్తూందట.
చిన్నప్పుడు Bata షూష్ అంటే ఎందుకో చిన్న చూపు వుండేది. ఈ సారి ఎప్పుడైనా చెప్పులు కొనడానికి Bata షాపు కి వెళ్తే ఇంతకుముందులాంటి అభిప్రాయం నాలో వుందదని అనిపిస్తుంది.
అలాగే చిన్నపుడు Colgate, Cinthol లాంటి వాటిని కూడా మనవే అనుకునే వాడిని. ఎందుకు అలా అనుకునే వాడినో నాకే తెలియదు. అందుకే ఒక్కో సారి నన్ను నేను ప్రశ్నించుకోవాలనిపిస్తుంది “How do I know what I know?” అని.
Comments
నాకు తెలిసి కులశేఖర్ అనబడు మీ ఊరి పాటగాడు కృష్ణుని పాటలు పాడుతాడు. మచ్చుకి…
మంచి ప్రశ్న. అపోహలు నమ్మకాలు చాలా బలమైనవి.
టాటా, బిర్లా వంటివి కొన్ని తప్ప స్వాతంత్ర్యానికి ముందు మనదేశంలో స్వదేశీ పరిశ్రమలు ఉత్పత్తులు చాలా తక్కువ వుండేవి. కమర్షియల్ బ్రాండ్లు (ఇప్పటికీ చెలామణిలో ఉన్నవి కూడా) అన్నీ కూడా విదేశీ కంపెనీలవే.
ఇంక భారతీయ సంగీతం ఆధ్యాత్మికతల మీద నిజమైన ఆసక్తి ఉండి అధ్యయనం చేసి మంచి పట్టు సాధించిన విదేశీయుల్ని చాలా మందినే చూశాను (కొందర్ని పరిచయం చేసుకున్ణాను, బహు కొద్దిమంది మంచి మిత్రులు కూడా) కనుక ఈ విషయంలో పెద్ద ఆశ్చర్య పడలేదు. నాకిప్పటికీ ఎంతో ఇష్టమైన హనుమాన్ చాలీసా “క్రిష్ణ దాస్” అనే ఆయన పాడినది.
http://www.amazon.com/Live-Earth-Limited-Time-Only/dp/B00005UK1U/ref=pd_sim_m_5_img/104-5264315-0829569
సరే, జాన్ హిగిన్స్ భాగవతార్ గార్ని గురించి చెప్పేదేముంది? ఆయన చెన్నై వాసులనే తన కర్ణాటక గాత్రంతో మెప్పించాడు.
http://www.musicalnirvana.com/carnatic/jon_higgins.html