Going fast, but where?

by admin@ 24fps

నిన్న సాయంత్రం ఆఫీసు నుంచి హడావుడిగా ఇంటికి తిరిగొస్తుంటే మా పక్క వీధిలో జనాలు పోగయ్యి వుండడంతో కాసేపు ఆగి అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. జన్నలంటే మరీ మన దేశంలో లాగా గుంపులు గుంపులు లేకపోయినా ఒక పది మంది ఒక దగ్గర చేరి వున్నారు. ఈ దేశంలో పది మంది ఒక రోడ్డు పై పోగవ్వడం ఒక విచిత్రమే!

దగ్గరకెళ్ళి చూస్తుండగానే పోలీసు కారు రయ్యిమని దూసుకొచ్చింది.

బాబోయ్ ఏం జరిగిందో అని కంగారు పడుతుండగా పోలీసాయన వచ్చి అక్కడున్నవారిలో ఎవరితోనో ఏదో మాట్లాడాడు. ఒక మధ్య వయస్కురాలు కాస్త దూరంగా నిలుచున్న నా వైపుగా చూపించడంతో అదిరిపడ్డాను. నేనేం చేశానురా బాబూ అని కంగారు పడీ నా చుట్టుపక్కలా చూశాను. నేను నిల్చున్న ప్రదేశానికి కాస్త దూరంలో చెత్తడబ్బాల దగ్గర ఎదో వెతుక్కుంతున్న ఒక ముసలాయన తప్ప వేరెవ్వరూ లేరు ఆ దరిదాపుల్లో.

కాసేపు అక్కడున్న వాళ్ళతో మాట్లాడి పోలీసులు నేను నిల్చున్న వైపుగా వచ్చారు. నా గురించి కాదని ఖచ్చితంగా తెలిసినా ఎక్కడో ఎదో భయం. చూస్తుండగానే పోలీసులు నన్ను దాటి నా వెనక వున్న చెత్త కుండీల దగ్గరకు చేరుకుని అక్కడున్న ముసలాయన్ను పట్టుకుని ఏం చేస్తున్నావిక్కడ అని గదమాయించారు.

“నేనేమీ చేయటం లేదు, నేనేమీ చేయటం లేదు సార్” అని దీనంగా చెప్పాడా వ్యక్తి.

“మరి ఈ వీధిలో చెత్తకుండీల మూతలు తెరిచి దేనికోసం వెతుకుతున్నావు?” అని గద్దించి అడిగారు పోలీసులు.

“ఆకలేస్తుంటేనూ…” అని ఇంకా చెప్తుండగా అక్కడ వుండ లేక వేంటనే బయల్దేరి ఇంటి ముఖం పట్టాను.

70-80 ఏళ్ళ మధ్యలో వయసున్న ఆ ముసలాయన్ను చూస్తే ఎవరికయినా జాలి కలుగుతుంది. మరి అలాంటాయన్ను చూసి పోలీసులకి కంప్లయింట్ ఇచ్చిన వారిని చుసి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. కుక్కల్నీ, పిల్లుల్నీ ఇంటిలో పెట్టుకుని బట్టలు కూడా తొడిగి ఎంతో ప్రేమగా చూసుకునే ప్రజలు సాటి మనిషి ఆకలిని అర్థం చేసుకోకపోగా అనుమానంతో పోలీసులకి రిపోర్టిచారంటే చాలా విచారం కలిగింది.

మనం రోజు రోజుకీ  ఎక్కడికి వెల్తున్నమో మాత్రం తెలియటం లేదు. నా స్నేహితుడు ఒకడు ఎప్పుడు అంటుంటాడు. “We are all going fast, but where?.

జనాల గురించి విచారం కాదుగానీ అంతకంటే విచారించదగ్గ విషయం మరొకటుంది. అక్కడ జరిగిన సంఘటన చూసి తెగ ఫీల్ అయిపోయిన నేను రేపటికల్ల ఆ విషయం మర్చిఫొవచ్చు. రేపు వుదయం లేస్తే ఆఫీసు, పెళ్లం, పని, సినిమా,స్నేహితులు, తిండి, తిప్పలు. వీటన్నింటీ మధ్య నా గుండె లోతుల్లోంచి వచ్చిన ఒక్క ఫీలింగ్ మాయమయిపోతుంది.

ఇంత విచారంలోనూ సంతోషించదగ్గ విషయమేమిటంటే నా మదిలోని భావాలను నలుగురితో పంచుకోగలగడమే!