Rahi kaun Hain?

by admin@ 24fps

ప్రస్తుతపు తెలుగు సాహితీ ప్రపంచంలో దాశరధి రంగాచార్య పేరు తెలియని వారుండరు. ఈయన రచనలైన “చిల్లరదేవుళ్ళు”,”మోదుగుపూలు”, “జనపదం” వంటి నవలలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఈయన రాసిన చిల్లర దేవుళ్ళు పుస్తకం చదివిన వారెవరైనా ఒక ముఖ్య విషయం గమనించి వుంటారు. సాధారణంగా మనమేదైనా పుస్తకం చదివేటప్పుడు, “ముందుమాట”. “తొలిపలుకు” లాంటి పరిచయ వక్యాలను చదవకుండా వదిలేస్తాం. కానీ “చిల్లరదేవుళ్ళు” పుస్తకపు మొదట్లో దేవులపల్లి రామానుజారావు గారు రాసిన తొలిపలుకు చదవాడాం ద్వారా దాశరధి వారి సృజనాత్మక శైళిని తెలుసుకోగలుగుతాం. ఈ రెందు పేజీలు దాటితే “నవలా వృత్తాంతం” అన్న పేరుతో “రహి” అనే వ్యక్తి తెలుగు నవల గురించి, తెలుగులోని వేర్వేరు నవలా రచయితల శైళి గురించి షార్ట్ అండ్ స్వీట్ గా బిగువైన శైళిలో రాసిన వ్యాసం ఇదే…………..

“తెలుగు నవలకు “కాళాపూర్ణోదయం” శ్రీకారం చుట్టిందని తొలి భారతీయ నవల “కాదంబరీ” అని మనవాళ్ళు ముచ్చటపడుతుంటారు. గద్య ప్రబంధమే నవల అనే అపొహాతో యీ నిర్ణయాలకు వచ్చారు. అన్నట్లు ఈనాడు నవల లుగా చలామణి అవుతున్న అనేక పుస్తకాలు నిజానికి గద్య ప్రబంధాలే. కానీ నవల అనే ప్రక్రియ ఖచ్చితంగా పాశ్చాత్యుల నుంచి సంక్రమించింది. పారిశ్రామిక శకం సంఘాన్ని వ్యవస్థను తన అదుపులోకి తెచ్చుకుంటున్నప్పుడు, మధ్యతరగతి వర్గం అనే కొద్దిపాటి తీరుబడివున్న వర్గం సృష్టించినప్పుడు – నవల పుట్టుక అవసరం అయ్యింది. ప్రబంధాలలో ఉన్న కుహనా బాధలు గాని సంభాషణాచాతుర్యంగాని నవలకు ముఖ్యాంశాలు కావు. నవలలో ఒక సమగ్ర సమాజ పరిశీలన, వర్ణన ఉంది తీరాలి. చార్లెస్ డికెన్స్, టాల్‌స్టాయ్, బల్జాక్ మొదలయిన వారి నవలలు చదివితే కర్హాగమనం, పాత్రలు మాత్రమే గాక ఆనాటి వాతావరణం యావత్తూ మనముందు ప్రత్యక్షం అవుతుంది. ఈ డాక్యుమెంటరీ లక్షణం నవలకు ప్రాణం లాంటిది.

చారిత్రిక,భౌతిక ఆర్థిక వ్యవస్థలకు అతీతంగా ఎవరి కథా జరగదనే వాస్తవాన్ని నవల విశ్లేషించి వర్ణిస్తుంది. ఈ నిడివి మరే పనికి, కళకూ సాధ్యం కాదు.దీన్లో కొంత భాగం మాత్రమే నాటకంలో చూపగలం.
తెలుగు నవల పుట్టి నూరేళ్ళుదాటింది. తెలుగు నవలకు నూరేళ్ళు నిండిపోయినవా అనే అనుమానం వొచ్చేటంత ఘోరమైన పుస్తకాలు ఇటీవల తామరతంపరగా వస్తున్నాయి. కాని “రాజు-మహిషి”, “చిల్లర దేవుళ్ళు”, “హేంగ్ మి క్విక్” మొదలైన నవలలు తెలుగు నవలకు కొన్ని ప్రాణాలను తిరిగి తీసుకొచ్చాయి.

ఏదేమైన తెలుగు నవల అభివృధ్ధి నిరాశాజనకంగానే వుంది.

నాటికీ మంచి తెలుగు నవలలు ఎన్నాలంటే చేతివేళ్ళు సరిపోతాయి. “మాలపల్లి” లాగా ఒక సమాజ పరిణామం తాలూకు సంగ్రహవర్ణన తెలుగు నవలల్లొ మృగ్యం. తెలుగు కవిత, కథానిక ప్రపంచస్థాయినందుకున్నాయి. కొండకచో ఆ స్థాయిని మించిపోయాయికూడా. అదేమాట తెలుగు నాటకం విషయంలోగాని, నవల విషయంలోగాని అనలేం.

నవలాపరిణామాలను గురించి అనేక సిధ్ధాంతాలున్నాయి. వాటిలో మహానగర సంజనిత సిధ్ధాంతం అని ఒకటుంది….. ఆ సిధ్ధాంతాన్ని అన్వయిస్తే తెలుగువాడికొక నవల లేదు. కనక తెలుగు వాడికొక నగరం లేదు. కనక తెలుగువాడికొక నవలలేదు అని నిర్ణయానికి రావచ్చు. సిధ్ధాంతాల సంగతి ఎలావునా మన నవలాకారులకు నిజాయితీ లోపించిందన్న విష్యం మనకు మంచినవలలు రాకపోవడానికి ముఖ్య కారణం. కళలల్లోనూ, సాహిత్యం లోనూ మనం ప్రస్తుతం అతిక్షీణదశలోనే వున్నాం. ఈ సమాజంలో ఈ దశను చేరుకొనడం రాజకీయ, ఆర్ధిక కారణాలవల్లనే జరిగింది.
తెలుగు నవల తొలిదశలో పూర్తిగా కాల్పనిక సాహిత్యంగానే వుండీపోయింది. ఇటు బెంగాలీనవలలో, అటు వాల్టర్ స్కాట్ రాసిన చారిత్రక కాల్పనిక నవలలో తెలుగునవలా రచయితలకు ఆదర్శాలు.

భోగరాజు నారాయణమూర్తి రాసిన “ఆంధ్రరాష్ట్రం” మొదలైన నవలల్లో ఈ కాల్పనికత నిశృంఖలంగా రాజ్యం చేసింది. మళ్ళీ చిలకమర్తి రాసిన నవలలన్నింటిలోనూ కథా నిర్మాణము మెలోడ్రామా ముఖ్యాంశాలు.అచ్చమైన తెలుగు నవలగా పేర్కొనదగ్గవాటిలో శ్రీపాద సుబ్ర్హ్మణ్యశాస్త్రిగారి “వడ్లగింజలు”, వేలూరి శివరామశాస్త్రిగారి “ఓబయ్య” ముఖ్యమైనవి. ముఖ్యంగా “వడ్లగింజలు” చిన్న కథను జాగ్రత్తగా చదివిచూస్తే నవలా లక్ష్ణాలు కొట్టొచ్చినట్లు కనభడతాయి. “ఓబయ్య” నవల 1930 నాటి రాజకీయ, సాంఘీక వాతావరణం సృష్టంగా వర్ణించింది.

1922లొ వెలువడిన “మాలపల్లి”కి ధీటైన నవల మళ్ళీ వెలువడలేదనే చెప్పాలి. మాలపల్లిలో సమాజవాతావరణమేకాక సిధ్ధాంత సంఘర్షణను కూడా చాలా నిజాయితీతో చిత్రించారు వున్నవ లక్ష్మీనారాయణ పంతులుగారు. దానిని ఎపిక్ నవలగా మనం ఎంచుకోవచ్చు.

నవల ముఖ్యంగా వాస్తవికతాబధ్ధమైనది. కాని ప్రతి రచయితకూ అంతో ఇంతో కాల్పనికత మీద మోజు వుంటుంది. తెలుగు నవలా రచయితలో ఈ మోజే అధికారాన్ని చెలాయిస్తున్నది. అందుచేత బాపిరాజుగారు ఎంత జాతీయవాదులైనా ఆయన నవలలన్నింటా కాల్పనిక వాతావరణం కనబడుతుందిగానీ వాస్తవిక వాతావరణం కనబడదు.ఇక విశ్వనాథ సత్యనారాయణ సంగతి సరేసరి.ఆయన కథావిధానం పౌరాణికం, భాష భాష్య పధ్ధతి.చలం గారి నవలలు సమాజాతీతమైనవి.ఆయన్ భావాలకు ప్రతీకలుగా పాత్రలను సృష్టించి కథ నడిపించారేగాని సమాజంలో ఒక భాగంగా ఆ కథలెప్పుడూ నడవలేదు. కొడవగంతి కుటుంబరావు గారు చిన్న కథల్లో కొద్దికాలంపాటు చలం ప్రవాహంలోనే కొట్టుకుపోయారు. కాని మార్క్సిస్టు పరిజ్ఞానం ఆయన్ని సంఘజీవిగా చేసింది. ఆయన “చదువు” ఆర్థిక మాంద్యంవొచ్చిన నాటి ఆంధ్రప్రదేశ్ మధ్యతరగతి జీవితానికి దర్పణం.

గోపీచంద్ నవలలన్నిటా సమాజమున్నమాట వాస్తవం. కాని ఆయన పాత్రలన్నీ సమాజం నుంచి వొచ్చినవికావు. సమాజంలో వుంటూనే సమాజానికతీతంగా వ్యవహరించడానికి ప్రయత్నించాయాయన పాత్రలు. ఆ కారణం వల్లనే ఆయన చివరి నవలల్లో ముఖ్యమైన పాత్రలు కొన్ని “హరిద్వార్”కి వెళ్ళి సమాజానికి దూరమైపోయాయి.

జి.వి కృష్ణారావు రాసిన “కీలుబొమ్మలు” చాలా ముఖ్యమైన నవల. అందుళో పతనమవబోతున్న గ్రామ వాతావరణాన్ని నిజాయితితో చిత్రీకరించారు.కాని కృష్ణారావుగారికి ఈ వ్యవస్థ అంటే కోపంకంటే అసహనం ఎక్కువ.

బుచ్చిబాబు అనేక కథలు వ్రాసాడూ. ఒక ముఖ్యమైన నవలకూడా రాశాడు. కాని అన్నింటా ఆయన చెప్పింది ఒకటే కథ.తెలుగు దేశంలో జరిగే పాశ్చాత్య కథ.

మహీధర రామమోహనరావు రాసిన “రథచక్రాలు” వస్తురీత్యా శిల్పరీత్యా చాలా ముఖ్యమైన నవల. సమాజం ప్రభావం వల్ల వ్యక్తిగత దృక్పథం నుంచి సామాజిక దృష్టికి పరిణమించడం ఇందులోని వస్తువు. కాని ఆయన ఆ తర్వాత రాసిన నవలలన్నింటిలోనూ నిజాయితీ లోపించింది.

తెలంగాణా, ఆంధ్ర మహాసభ ఆవిర్భావం వరకు అంధకారమయమైన భూస్వాన్య వ్యవస్థలో వున్నది. అందుచేత ఆ కాలంలో తెలంగాణా నుంచి నవలలు రావడానికి అవకాశంలేదు. తెలంగాణా జీవితాన్ని నవలలో చిత్రీకరించ్డానికి ప్రయత్నించిన వాడు బొల్లిముంత శివరామకృష్ణ. ఆయన తెలంగాణా వాడూ కాకపోవడంలో ఆశ్చర్యంలేదు. ఆయన రాసిన “మృత్యుంజయులు” నిజాయితీకి, ఆవేశానికీ, చక్కని ఉదాహరణ. కాని తెలంగాణా వాస్తవిక వాతావరణం అందులో వుందనలేం. తెలంగాణా వుద్యమల్లో మునిగితేలిన వట్టికోట ఆళ్వార్ స్వామి తన ప్రజలమనిషి గంగులతో ఆ లోటును భర్తీ చేశారు.

దాశరధి రంగాచార్య రాసిన “చిల్లర దేవుళ్ళు” నవల 1937, 1938 నాటి తెలంగాణా గ్రామజీవితాన్ని అతిశయోక్తులతో సహా సృష్టంగా వర్ణించింది. “…..ఇలా రాస్తూనే చివరకు దాశరధి రంగాచార్యుల వారి “చిల్లరదేవుళ్ళు” నవలను విశ్లేషించి తన వ్యాసాన్ని ముగించారు రహి. ఇంతకీ బుచ్చిబాబు, చలం, గోపీచంద్ లాంటి గొప్పగొప్ప రచయితలను సైతం ఒక్క ముక్కలో తేల్చేసిన ఈ రహి ఎవరు? యే రహి కౌన్ హై?