AFI-100

by admin@ 24fps

1998లో AFI(అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్) అమెరికాలోని అతి గొప్ప సినిమాలుగా ఒక వంద సినిమాలను ఎన్నుకున్నారు. సినిమా అనే ప్రక్రియ వందేళ్ళ పండుగ జరుపుకున్న సంధర్భంగా వారీ పని చేసారు. గతంలో మాదిరిగానే AFI సభ్యులు మరో సారి ఇదే ప్రయత్నం చేసారు. AFI స్థాపించి నలభై ఏళ్ళైన కారణంగానో, గతంలో వచ్చిన వంద సినిమాల లిస్ట్ కాస్తా పాతపడిపోవడం మూలానో చేసిన ఈ ప్రయత్నం వలన గతంలో వచ్చిన లిస్టు కాస్తా తారుమారయింది. అమెరికా లోని దాదాపు 1500 మంది సినిమా దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, నిర్మాతలు, నTuలు మరియు విమర్శకులు, సినీ ప్రముఖులచే ఎన్నుకోబడిన ఈ వంద సినిమాల లిస్టు ఇక్కడ చూడొచ్చు.

గతంలో మాదిరిగానే Citizen Kane సినిమా ఈ సారి కూడా ఒకటో స్థానంలో నిలిచి అమెరికన్ సినిమా చరిత్రలో తన అత్యున్నత స్థాన్నాన్ని పదిలింగా నిలుపుకుంది. కాకపోతే 1998లో రెండో స్థానంలో వున్న Casablanca ఒక స్థానం దిగజారి, అప్పుడు మూడొ స్థానంలో వున్న The Godfather రెండో స్థానానికి ఎగబాకింది. గాడ్‌ఫాథర్, కాసాబ్లాంకాల సంగతి పక్కనబెడితే సిటిజన్ కేన్ మాత్రం ప్రపంచంలోని ఇలాంటి లిస్టులెన్నింటిలోనో మొదటి స్థానంలో నిలిచింది. (అసలీ సినిమా ఎందుకు ఇలా అత్యున్నత స్థాయి సినిమాగా పేర్కొనబడుతోందో తెలుసుకోవాలంటే నా సైటుపై ఒక కన్నేసి వుండండి.)

మొదటి మూడు సినిమాలు పక్కనబెడితే మిగిలిన 97 చిత్రాల్లో ముందుగా చెప్పుకోవలసినవి మార్టిన్ సోర్ససీ సినిమా రేజింగ్ బుల్, చార్లీ చాప్లిన్ సినిమా సిటిలైట్స్, హిచ్‌కాక్ సినిమా వెర్టిగో, జాన్ ఫోర్డ్ సినిమా ది సెర్చెర్స్ సినిమాలు. అందుకు కారణం, ఈ చిత్రాలు గతంలోని లిస్టులోని స్థానం తో పోలిస్తే ఎంతో మెరుగుపడ్డాయి. గతంలో 96వ స్థానంలో ఉన్న “The Searchers” సినిమా ఈ సారి ఏకంగా 84 స్థానాలు ఎగబాకి 12వ స్థానంలోకి వచ్చి కూర్చుంది. అలాగే 24వ స్థానంలో ఉన్న “Raging Bull” 20 స్థానాలు ఎగబాకి 4వ స్థానానికి చేరింది. అలాగే “Vertigo” 61 నుంచి 9వ స్థానానికి చేరుకుంది.

గతంలో వచ్చిన లిస్టులో కేవలం “City Lights” మాత్రమే సైలెంట్ సినిమా. అయినా సినిమా అంటేనే సైలెంట్ సినిమా. చార్లీ చాప్లిన్, బస్టర్ కీటన్ లాంటి వారు ముందు సైలెంట్ సినిమాల ద్వారా విజువల్ గా కథలు చెప్పబట్టే సినిమా భాష, వ్యాకరణాలు అభివృధ్ధి చెందాయి. అందుకేనేమో ఈ సారి ఏకంగా మూడు సైలెంట్ సినిమాలు కొత్త లిస్టులో చోటు చేసుకున్నాయి. గతంలో 76 వ స్థానంలో వున్న City Lights సినిమా ఇప్పుడూ 11 వ స్థానానికి చేరుకోవడంలోనూ, ఇంతకముందు అసలు లిస్టులోనే లేని The General మరియు Sunrise అనే సైలెంట్ సినిమాలు ఇప్పుడు మొదటి 100 సినిమాల లిస్టులో చోటుచేసుకోవడంతో సైలెంట్ సినిమాకు దక్కాల్సిన మర్యాద దక్కినట్టయింది.

ఇవికాకుండా గత పది సంవత్సరాలలో రిలీజయిన సినిమాలలో, The Lord of the Rings, Titanic, Sixth Sense మరియు Saving Private Ryan సినిమాలు ఈ కొత్త లిస్టులో చోటు చేసుకున్నాయి.

ఇక పోతే ఈ సారి లిస్టులో Steven Spielberg – 5,Billy Wilder – 4,Alfred Hitchcock – 4,Stanley Kubrick – 4,Frank Capra – 3,Charlie Chaplin – 3,Francis Coppola – 3,John Huston – 3,Martin Scorsese – 3 సినిమాలతో అత్యంత ప్రముఖమైన దర్శకుల జాబితాలో చేరుకున్నారు.

గతంలో వచ్చిన లిస్టులో చోటు చేసుకున్న సినిమాలయిన Manhattan మరియు Amadeus సినిమాలు ఈ సారి లిస్టులో చోటు చేసుకోకపోవడం ఆశ్చర్యపరిచింది.

నా దృష్టిలో Sixth Sense సినిమా ఈ లిస్టులో చోటు చేసుకునేంత గొప్పదేమీ కాదు. అలాగే ఇంకా కొన్ని సినిమాలు ఈ లిస్టులో చోటు కలిగి వుండడానికి అర్హత వున్నప్పటికీ ఎందుకో స్థానం సాధించలేకపోయాయి.

అయినా AFI వాళ్ళు ప్రకటించినంత మాత్రాన ఈ 100 సినిమాలే అమెరికన్ సినిమా ప్రపంచపు ఆణిముత్యాలని చెప్పలేము. David Lynch తీసిన Mullhollnd Drive ఈ లిస్టులో స్థానం కల్పించి వుంటే బావుండేదని నా అభిప్రాయం.