Telugu New wave
by admin@ 24fps
తెలుగు సినిమా 75 వసంతాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవాలు కూడా జరుపుకుంది.ఈ 75 సంవత్సరాలలో తెలుగు సినిమా ప్రగతి ఏంటో మనందరికీ తెలిసిందే! Emperor’s New Clothes కథ లాగే మన సినిమాలు కూడా నూతనత్వం, నవీన కల్పనలు లేక సిగ్గు లేకుండా నగ్నంగా రోడ్డుమీద పడిందనడంలో అతిశయోక్తి లేదు. ఎవరో ఒకరు చెప్పేవరకూ తెలుసుకోలేని విషయం కాదిది. అందరికీ తెలిసిన నగ్న సత్యం. కానీ ఎందుకో ఎవ్వరం మాట్లాడం. మాట్లాడితే పెద్దోళ్ళతో వ్యవహారమనేమో! అసలే సినిమా వాళ్లు సూపర్ స్టారులు, మెగా స్టారులు, రత్నాలు, వజ్రాలు, దేవుళ్ళు, లెజెండులు! వాళ్ళతో ఎందుకొచ్చిన గొడవనేమో!
అప్పుడప్పుడూ ఆవేశం ఆపుకోలేని అనీష్ లాంటి వాళ్ళు తెలుగు సినిమాని “Shame! Shame! Puppy Shame!” చేద్దామనుకున్నా “ఓ, పెద్ద దిగొచ్చాడండి. ఈ మాత్రం విషయం మనకు తెలియనట్టు. చూసీ చూడనట్టు మెలగుకోవాలి. మనదేం పోయింది. వాళ్ళ డబ్బులుపెట్టి సినిమాలు తీసేది మన ఆనందం కోసమేగా! పాపం లేటు వయసులో కూడా కుర్రాళ్ళలా నటించడానికి ఎంత కష్టం, ఎంత కష్టం. ఢిల్లీ, బొంబాయిలనుండి వచ్చి పాపం ఇక్కడ బట్టలిప్పి ఎగురుతున్న ఆడ లేడీస్ చేసే సర్వీస్ అంతా ఇంతానా? ఎవరికోసం? ఇదంతా ఎవరికోసం? మన కోసం కాదేంటి? అయినా అంతంత పెద్దోళ్ళనలా దిగజార్చడం ఎంత మాత్రం సబబు కాదు. ఈ రోజు వాళ్ళనలా తీసిపారేస్తే రేపు మనకు రాజకీయనాయకులెక్కడ దొరుకుతారు? నేటి సినిమా స్టారే కదా రేపటి రాజకీయ నాయకుడు. అర్థం చేసుకోవాలి.” అని అతని ఆవేశాన్ని చల్లార్చేయడం జరుగుతుంది.
నిజంగానే మన తెలుగు సినిమాది దౌర్భాగ్య స్థితి. గత 20 ఏళ్ళలో మన తెలుగు చిత్ర పరిశ్రమనుంచి ఎన్ని మంచి సినిమాలు వెలువడ్డాయి అంటే, కనీసం ఇరవై మంచి సినిమాల (అంటే సంవత్సరానికొకటి) పేర్లయినా గుర్తుకు రాని అభాగ్య స్థితి మనది. తెలుగులో అసలే మంచి సినిమాలు లేవని చెప్పడం ఇక్కడి ఉద్దేశం కాదు.
సంవత్సరానికి షుమారు 200కు పైగా తెలుగు సినిమాలు నిర్మితమవుతున్నప్పటికీ అందులో కనీసం ఒక్క శాతమయినా మంచి సినిమాలుగా గుర్తించలేని దుస్థితి మనది. కానీ అక్కడో ఇక్కడో అప్పుడప్పుడూ కొంతమంది దర్శకులు ఎంతో కొంత నవ్యతను తమ సినిమాల ద్వారా ప్రేక్షకులకందివ్వాలని ప్రయత్నం చేస్తూనే వున్నారు. 1980 కి ముందు వచ్చిన మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, సాక్షి, లాంటి ఎన్నో సినిమాలు తెలుగు సినిమాను కాసేపు ప్రకాశింపజేసినప్పటికీ అప్పటి సినిమాలను మారుతున్న సమాజం దృష్ట్యా ప్రామాణికాలుగా తీసుకోవడం కొంచెం కష్టమే! 1980 ల తర్వాత విశ్వనాథ్, బాపు, జంధ్యాల లాంటి వారు తమ తమ పరిధుల మేరకు తమ కంటూ ఒక శైలి, తమ సినిమాలకొక భాష, ఆ భాషకొక వ్యాకరణం సృష్టించుకున్నారు. కానీ అవన్నీ పాత మధురాలు. గత కాలపు స్మృతులు. జంధ్యాల అస్తమయంతో ఆరోగ్యకరమైన నవ్వులూ మాయమయ్యాయి. ఇప్పుడంతా వెకిలి హాస్యం. రెండర్థాల బూతు ప్రహసనం. విశ్వనాధ్, బాపూలు ఇప్పటికీ సినిమాలు తీస్తున్నప్పటికీ వృధ్ధ్యాప్య ప్రభావమో ఏమో గానీ అప్పటి సృజనాత్మకత ఇప్పటి సినిమాల్లో లోపించడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సింగీతం శ్రీనివాసరావు తన సినిమాలతో కొత్త ప్రయత్నాలకు నాంది పలికారు. ఒక “పుష్పక విమానం”, “ఆదిత్య-369″, “విచిత్ర సహోదరులు” లాంటి ఎన్నో సినిమాల ద్వారా కమర్షియల్ సినిమాల్లోనూ నవ్యతకు అవకాశం వుందని నిరూపించారు. మనకీ ఉన్నాడో నవ సినిమా నిర్మాత అని గర్వంగా చెప్పుకునేలా సినిమాలు తీసిన వంశీ గత కొంత కాలంగా (డిటెక్టివ్ నారద తర్వాత) formలో లేరన్నది నిజం. ఆ మధ్యలో “ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు” సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను పునరుజ్జీవనం చేసే ఛాయలు కనిపించినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అది నిజం కాదని నిరూపించాయి.
1989 లో రాంగోపాల్ వర్మ తీసిన “శివ” సినిమాతో తెలుగు సినిమా పునాదులు కదిలి నవ శకానికి నాంది పలికినప్పటికీ ఆ ట్రెండుని కొనసాగించే సత్తా కలిగిన దర్శకులు ఇప్పటికీ మనకి కరువయ్యారు కనకనే మన సినిమాలు ఇప్పటికీ పాత ధోరణిలో సాగిపోతున్నాయి. తెలుగు సినిమాలో కొత్త పోకడలకు, సాంకేతిక నైపుణ్యానికి నాంది పలికిన వర్మ, సినిమానో యజ్ఞంగా భావించి నవయువ దర్శకులకు స్ఫూర్తి కలిగిస్తూ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. కానీ కాలక్రమంలో సినిమాను కళాత్మక దృష్టితో కాకుండా కేవలం వ్యాపారంగా భావించి కుప్పలు తెప్పలుగా సినిమాలు తీయడంతో అతని ప్రాముఖ్యత, ప్రత్యేకతలు ఇప్పుడు నామమాత్రమయ్యాయన్నది నిజం. వర్మ మొదలు పెట్టిన యజ్ఞాన్ని కొన్ని రోజులు కృష్ణ వంశీ కొనసాగించినప్పటికీ ఆయన సినిమాలు ఇప్పుడు కమర్షియల్ వెల్లువలో కొట్టుకుపోతున్న కాగితం పడవలు మాత్రమే!
ఇక 21వ శతాబ్దపు మొదటి రోజుల్లో నాగేష్ కూకునూర్ తన “హైదరాబాద్ బ్లూస్” సినిమా ద్వారా కొత్త ప్రయోగం చేసారు. సినిమా అనగానే కోట్లకొద్దీ నిర్మాణవ్యయం, పేరుపొందిన నటీనటులు, ఫారిన్లో చిత్రీకరించిన పాటలు, సినిమాకు సంబంధం లేని కామెడీ ట్రాకులు అనే నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్వల్ప బడ్జెట్లో మంచి సినిమా తీసారు. కానీ తన సినిమాకు ప్రేక్షకులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడినా అక్కడక్కడా వున్న రస హృదయులు ఆ సినిమాను ఆదరించి చివరకు విజయాన్ని చేకూర్చారు. ఆ తర్వాత నాగేష్ చాలా సినిమాలు తీసినప్పటికీ తన మొదటి సినిమా “హైదరాబాద్ బ్లూస్” లోని అపూర్వతను మళ్ళీ సృష్టించలేకపోయరు. ఈ మధ్య కాలంలో అతను తీసిన “ఇక్బాల్”, “దోర్” సినిమాలను ప్రేక్షకులు ఆదరించినప్పటికీ ఈ సినిమాలు గొప్ప సినిమాలని అంగీకరించడం కొంచెం కష్టమే! వారం వారం బాలీవుడ్ సినిమా పరిశ్రమనుంచి వెలువడుతున్న మసాల సినిమాలకంటే ఈ సినిమాలు వేరుగా ఉండడమే కాకుండా పెరిగిపోతున్న మల్టిప్లెక్స్ సాంప్రదాయానికి ఈ సినిమాల విజయమే సాక్ష్యం.
2002లో నీలకంఠ “షో” సినిమా ద్వారా మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. కేవలం ఇద్దరి పాత్రధారులతో మంచి కథ, కథనాలతో నడీచే “షో” సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందకపోయినప్పటికీ నీలకంఠకు జాతీయ స్థాయిలో అవార్డును తెచ్చిపెట్టాయి. కానీ “షో” తర్వాత నీలకంఠ దర్శకత్వం వహించిన సినిమాల్లో కేవలం “మిస్సమ్మ” ఒక్కటే ప్రేక్షకాదరణ పొందింది. కానీ ఇంటెలిజెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందివ్వాలన్న తపన మాత్రం నీలకంఠలో బాగా కనిపిస్తుంది.
“హైదరాబాద్ బ్లూస్” చిత్ర విజయం స్ఫూర్తితో శేఖర్ కమ్ముల “డాలర్ డ్రీమ్స్” చిత్రాన్ని తీసి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందినప్పటికీ, సినిమా నిర్మాతగా మాత్రం చేతులు కాల్చుకున్నాడు. ఆ తర్వాత మూడేళ్ళకు “ఆనంద్” సినిమాతో తెలుగు సినిమా చరిత్రలో ఇండిపెండెంట్ సినిమాకు నాంది పలికారు. నిజానికి “ఆనంద్” సినిమా గొప్ప సినిమా కాకపోయినప్పటికీ యాక్షన్, వయొలెన్స్ మరియు ప్రేమ చిత్రాలతో విసిగి వేసారిపోయిన తెలుగు ప్రేక్షకులకు నిజజీవితానికి దగ్గరగా సరళమైన రీతిలో ఆర్భాటాలు, హంగులు, హడావుడులకు దూరంగా మంచి సంగీతంతో కొత్తదనాన్ని అందించడంలో సఫలం కాగలిగారు. “ఆనంద్” తర్వాత శేఖర్ తీసిన “గోదావరి” సినిమాలో పాత్రల మనస్తత్వాన్ని అవగాహన చేయడం వరకూ బాగానే ఉన్నప్పటికీ సినిమాలో ఏదో లోపం కనిపిస్తుంది. అందుకేనేమో “ఆనంద్” లాగ ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు. అంతమాత్రాన గోదావరి సినిమా బాక్సాఫీసు వద్ద విఫలమైందని చెప్పలేము. శేఖర్ కమ్ముల సినిమాలకు లభిస్తున్న ఆదరణకు ముఖ్య కారణం చదువుకున్న యువతీ యువకులు అర్థవంతమైన సినిమాకై వేచిచూడడమే అన్నది సత్యం.
“ఆనంద్” సినిమా రిలీజ్ అయ్యే సమయానికి మోహన్కృష్ణ ఇంద్రగంటి కేవలం ఐదు లక్షల వ్యయంతో షుమారు రెండు గంటల నిడివి కలిగిన సినిమాను తీసి డిజిటల్ సినిమాకు తెలుగులో పునాదులు వేశారు. కాకపోతే పాత రోజుల్లోని మూఢనమ్మకాల ఆధారంగా ఈయన రూపొందించిన సినిమా కేవలం అవార్డులు మాత్రమే సాధించగలిగింది కానీ ఎక్కువ మంది ప్రేక్షకులకు ఈ సినిమా చేరలేదనడంలో సందేహం లేదు. అందుకు కారణం అతనెన్నుకున్న కథే అని చాలా మంది అభిప్రాయం. అంతే కాకుండా ఈ సినిమాలో ఏముందని అతనికన్ని అవార్డులొచ్చాయో అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఒకప్పటి మన సాంప్రదాయాలను తెరకెక్కించడం మంచిదే కానీ అతనికిచ్చిన పదకొండు అవార్డులు అతనికే దక్కాయంటే అందులో అతని ప్రతిభతోబాటు, మంచి సినిమాలు రూపొందించే దర్శకులు కూడా కరువయ్యారన్న నిజం కూడా నిర్ధారణవుతుంది. అతని రెండో సినిమా అయిన “మాయా బజార్” రొటీన్ కి భిన్నంగా ఉండేలా ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం అపజయం పొందిందనే చెప్పాలి. చాలా రోజులుగా అతను పని చేస్తున్న “ఏకాంత గీతం” సినిమా రూపొందాక గానీ ఈ దర్శకుని సత్తా ఏమిటో అంచనా వేయలేము.
వీరందరితోపాటు “ఐతే” సినిమా తీసిన చంద్రశేఖర్ ఏలేటి కూడా స్క్రీన్ ప్లే పరంగానూ, దర్శకత్వ పరంగానూ వైవిధ్యాన్ని ప్రదర్శించారు. అందరూ కొత్తవాళ్ళతో మితిమీరిన వ్యయ ప్రయాసల జోలికి పోకుండా “ఐతే” ద్వారా మంచి ప్రయత్నమే చేసినప్పటికీ, ఇతని రెండో సినిమా “అనుకోకుండా ఒక రోజు”, ఆ తర్వాత వచ్చిన “ఒక్కడున్నాడు” సినిమాలు కాస్తంత విపరీత ధోరణిలో నడుస్తాయి. వెరైటీని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు కానీ ఆ వెరైటీ మరీ తెచ్చిపెట్టినట్టు ఉండకపోతే బావుంటుందన్న విషయం ఈయన గ్రహిస్తే మంచి సినిమాలు తీసే అవకాశం ఎంతో వుంది.
పైన పేర్కొన్న వాళ్ళు మాత్రమేకాకుండా “కోకిల” సినిమా తీసిన గీతాకృష్ణ, “కళ్ళు” సినిమా తీసిన MV రఘు, “దాసి” సినిమా తీసిన బి.నర్సింగరావు, “తిలాదానం” తీసిన KNT శాస్త్రి, “ఎల్లమ్మ” తీసిన మోహన్ కోడా, “వనజ” సినిమా తీసిన రజనీష్ లాంటి వారు చాలా మంది తెలుగులో మంచి సినిమాలను తీసుకొద్దామని ప్రయత్నం చేసారు. రాబోయే కాలంలో చాలామంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే వుంటారు.కాకపోతే ఇలాంటి ప్రయత్నాలు సంవత్సరానికి ఒకటో అరో మాత్రమే కావడంతోనూ, ఇప్పటికీ మెజారిటీ సినిమాలు పాత ఫార్ములమీదే ఆధారపడి నిర్మితమవుతుండడంచేతనూ మన సినిమాలకొచ్చిన గడ్డురోజులు ఇప్పట్లో పోయే సూచనలేవీ కనిపించడంలేదు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే కాదు తమిళ, మళయాళం, కన్నడ, హిందీ సినిమా ఇండస్ట్రీలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ తమిళ సినిమాకి మహేంద్రన్, భారతీరాజా, బాలూ మహేంద్ర, బాలచందర్, మణిరత్నం, బాల, చేరన్, గౌతం మీనన్ లాంటి వాళ్ళు కన్సిస్టెంట్ గా మంచి సినిమాలు తీసే ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. అక్కడి దర్శకులే కాకుండా సూర్య, విక్రమ్, కమల్ హాసన్ లంటి స్టార్ ఇమేజ్ కలిగిన నటులు కూడా ఇమేజ్ చట్రం నుండి బయటకొచ్చి ప్రయోగాత్మక పాత్రల్లో నటించడానికి ముందుకొస్తున్నారు. అలాగే కన్నడ సినిమా ఇండస్ట్రీలో గిరీష్ కాసరవెళ్ళి, నాగాభరణ, గిరీష్ కర్నాడ్, MS సత్యు, పుట్టణ్ణ కనగళ్, పట్టాభిరామిరెడ్డి, శంకర్ నాగ్ లాంటి దర్శకులు కమర్షియల్ సినిమాకు సమాంతరంగా తమ సినిమాలను రూపొందించడమే కాకుండా ప్రేక్షకుల ఆదరణ కూడా చూరగొన్నారు. ఇలాగే మలయాళం లో కూడా అదూర్ గోపాల కృష్ణన్, జాన్ అబ్రహాం, అరవిందన్, K R మోహనన్ లాంటి దర్శకులెందరో అర్థవంతమైన సినిమాలను రూపొందించారు. బెంగాలీ సినిమాల గురించి ఇక చెప్పనవసరం లేదు. సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్, అపర్ణ సేన్ లాంటి ఎంతో మంది తమ సినిమాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. ప్రస్తుత హిందీ సినిమా పరిస్థితి మనకంటే ఘోరంగా ఉన్నప్పటికీ 1980 ప్రాంతాల్లో ఎంతో మంది దర్శకులు అద్భుత కళాఖండాలను మనకందించారు. శ్యాం బెనెగల్, సాయి పరాంజపే, గురు దత్, అమోల్ పాలేకర్, గౌతం ఘోష్, గోవింద్ నిహలానీ, మీరా నాయర్, కేతన్ మెహతా వంటి దర్శకులు తమ సమాంతర సినిమాలతో భారతీయ సినిమాకు మరో దృక్కోణాన్ని కల్పించారు.
హిందీ, తమిళ, మలయాళం, బెంగాలీ, కన్నడ సినిమా పరిశ్రమల్లో లాగా మన సినీ పరిశ్రమలో సమాంతర సినిమా (parallel cinema) కి అవకాశం లేనందువల్లనే తెలుగు సినిమాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మిగిలిపోయింది. 21 వ శతాబ్దపు మొదటి దశాబ్దపు చివరి రోజుల్లో కూడా తొడ కొడితే రైళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, కేరళలో బీభత్సం సృష్టించిన మన తెలుగు వాడి గురించి కనీసం వార్తగానైనా అందకపోవడం, గాల్లో ఎగిరే బైకులు, జీపులు, తను ప్రేమించిన అమ్మాయికోసం ప్రపంచాన్నే ఎదిరించడం లాంటి విపరీత ధోరణులు తప్ప, నవ్యతకు అవకాశం లేకుండా పోతోంది.
ప్రస్తుత తెలుగు సినిమా యొక్క దీన స్థితికి కారణాలు అనేకం. అందులో కొన్ని:
- హిట్టయిన సినిమా కథనే మళ్ళీ మళ్ళీ వాడుకుని కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి కొత్త సినిమాలు తీయడం
- ప్రతిభ కలిగిన నూతన నటీనటులకు అవకాశాలు లేకపోవడం
- సినిమాలు వారసత్వ సంపదగా భావించి కొంతమంది ఆజమాయిషీ చేయడం
- సినిమా తారలను కులాల ప్రాతిపదికగా ఆరాధించడం, దైవంతో సమానంగా పూజించడం
- తమ స్వార్ధం కొరకు సినిమాలను వినియోగించుకోవడం
- నవ యువ దర్శకులు కూడా పాత పధ్ధతులనే అవలంబించడం
- తెలుగులో ఉన్న సాహిత్యాన్ని సినిమాలుగా మలిచే ఆలోచన లేకపోవడం
- దర్శక నిర్మాతల్లో కళాదృష్టి లోపించడం
- వసుధైక దృక్పథం కలిగిన కథలు సృష్టించలేకపోవడం
- వ్యాపారాత్మక ధోరణి లోనే సినిమాలను చూడడం
పైన పేర్కొన్న కారణాలన్నీ సినిమాలు తీసే వారి కోణంలో మాత్రమే. సినిమాకి తీసే వాళ్ళు ఎంత ముఖ్యమో చూసే వాళ్ళూ కూడా అంతే ముఖ్యం. ఎవరేం చెప్పినా సినిమాకి ప్రేక్షకులు అవసరం. ప్రేక్షకులు కోరుకుంటున్న సినిమాలే తీస్తున్నామని దర్శకులు, నిర్మాతలు తమని తాము మోసం చేసుకున్నా మనకిలాంటి నాణ్యతలేని సినిమాలే దిక్కవుతున్నాయంటే తప్పు ప్రేక్షకుల్లోనూ వుంది. మంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూడాలి. చెత్త సినిమాలను సానుభూతి లేకుండా నిరాకరించాలి. జాతి కుల మతాలకు అతీతంగా సినిమాలను మనం ఆదరించాలి. సినిమా అంటే కేవలం చవుకబారు వినోదం కాదని మనం గుర్తించాలి. చూస్తూ చూస్తూనే బుర్రకథ, హరికథ, నాటకం, తోలుబొమ్మలాట లాంటి కళలు మన కళ్ళముందు నుండి అదృశ్యమయ్యాయి. సంగీత పరంగా మనకిప్పుడు సినిమా పాటలే దిక్కయ్యాయి. శాస్త్రీయ సంగీతం మూగబోతోంది. తెలుగు సాహిత్యపు వెలుగులు గుడ్డిదీపాల్లా నిస్తేజంగా ఉన్నాయి. చిత్రకళకు ప్రోత్సాహం లేక కుంచెలు ఎండిపోతున్నాయి. శిల్పకళ, నృత్యకళల సంగతి ఇక సరే సరి. ఇప్పుడు మనకున్న ఒకే ఒక కళ సినిమా. సినిమా అంటే 64 కళల సమ్మేళనం అంటారు. కానీ నానాటికీ క్షీణించిపోతున్న కళలతోపాటు త్వరలో సినిమా కూడా కమర్షియల్ ఒరవడిలో కొట్టుకుపోయి చివరకు మనకు మిగిలేది అర్థం పర్థం లేని గోల మాత్రమేనని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలా జరగకుండా ఉండాలంటే మన సినిమాల్లో మార్పు అవసరం.
ప్రపంచంలోని అన్ని సినిమా పరిశ్రమల్లో జరిగినట్టే మనసినిమాల్లోనూ మార్పు సంభవించాలి. ప్రపంచ దేశాల్లోనే కాదు, హిందీ సినీ పరిశ్రమలో 1980 ప్రాంతంలో విజృంభించిన సమాంతర సినిమా లాగా మన సినిమా పరిశ్రమలో కూడా కొత్త వాయువులు వీచాలి. అందుకు ముందుగా ప్రేక్షకులు మారాలి. ఫ్రాన్స్ లో ఎగసిన new wave గురించి తెలుసుకోవాలి. సోవియట్ రష్యా లో ఐసెన్స్టీన్ ఎడిటింగ్ ద్వారా చేసిన ప్రయోగాల గురించి అధ్యయనం చేయాలి. ఇటలీ లోని వాస్తవికతాధార సినిమాలు మనకి ప్రేరణ కావాలి. 1995 లో, డెన్మార్క్ లో చెత్త సినిమాలు తియ్యమని ప్రతిజ్ఞ పూని Dogme అనే కొత్త సినిమాను సిద్ధాంతపరిచిన దర్శకులు మనకు ఆదర్శం కావాలి. జర్మనీ, హాంగ్కాంగ్, ఇరాన్, అమెరికా, ఇంగ్లాండ్, తైవాన్ లాంటి దేశాల్లో ఏర్పడిన సినీ విప్లవాల నుంచి మనమూ పాఠాలు నేర్చుకోవాలి. యదార్ధమైన తెలుగు కథలు మన సినిమాలకు ఆధారం కావాలి. అన్నింటికీ మించి, మంచి సినిమాలకు ప్రేక్షకాదరణ కావాలి.
“ఆఫ్ట్రాల్ సినిమానే కదా ? దీనికింత చర్చలు అవసరమా? ఇష్టం లేకపోతే చూడొద్దు. It is not an obligation, I say!” అని అనుకుంటే సరిపోదు. నిజమే!తెలుగు సినిమాలు చూడమని ఎవరూ ఎవర్నీ నిర్బంధించలేరు. కానీ సినిమాల్లేకుండా ఊహించలేనంత విధంగా మన జీవితాలు సినిమాలతో ముడివడిపోయాయి. నిద్ర లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకూ “ఏ సినిమా షూటింగ్ మెదలయింది, ఏ సినిమా రిలీజ్ అయ్యింది, హిట్టయిందా, ఫ్లాపయిందా? , ఏ సినిమా ఎన్ని సెంటర్లలో వంద పడింది, ఎన్ని ప్రింట్లతో రిలీజయింది, కలెక్షన్లెంత, ఫలానా హీరో సినిమాలో పాటలెలా ఉన్నాయి” లాంటి విషయాలు మన దైనందిన జీవితంలో నిత్యం చోటు చేసుకుంటూనే వుంటాయి. “లేదే? మా జీవితాల్లో సినిమాకు మించిన విషయాలెన్నో ఉన్నాయి. సినిమాలు మా జీవితాల్లో పెద్దగా ప్రభావం చూపట్లేదే” అని మీరనుకుంటే ఇంతవరకూ చదివి మీ సమయం వృధా చేసుకున్నట్లే! ఇది సినిమాల గోల. సినిమా అంటే పడి చచ్చిపోయే వారి గోల. అన్నింటికీ మించి రొటీన్ రూట్లో పయనిస్తున్న సినిమా నావకు నవతరంగపు అలజడితో కొత్త దిశను నిర్దేశించాలన్న తపన. ఈ మార్పు ఎవరి వల్ల సాధ్యమవుతుంది? అనేది చాల పెద్ద ప్రశ్న.
వేయిమైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఇది మొదటి అడుగేమో! ఇంటర్నెట్ విప్లవంతో జ్ఞానం విస్తరించింది. ప్రజల మధ్య కమ్యూనికేషన్ సులభతరమైంది. DVD ల ద్వారా ప్రపంచ నలుమూలల నుండి వెలువడిన సినిమాలను చూసే అవకాశం కలుగుతోంది. ఈ మధ్యనే ఇంటర్నెట్ తెలుగులో కూడా లభ్యమవుతుంది. మన వాళ్ళూ ప్రపంచం నలుమూలలా వ్యాపించారు. లెక్కకు మించి ఫిల్మ్ ఫెస్టివల్స్, TV చానల్స్ ఉన్నాయి. మంచి సినిమా ప్రదర్శనకు సినిమా హాళ్ళే అవసరం లేదు. మంచి సినిమా తీయాలనుకునే వాళ్ళకు హద్దులు, పరిమితులు చెరిగిపోతున్నాయి. సినీ వీరాభిమనులారా నడుం బిగించి మరో అడుగు వేయండి. ప్రయాణానికి సిధ్ధం కండి. ఈ ప్రయాణానికి గమ్యం లేదు. This is a journey more important than its destination. పదండి ముందుకు. మరో ప్రపంచం పిలుస్తోంది.
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!
కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హృదంత రాళం గర్జిస్తూ
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం?
—–తొలి ప్రచురణ: పొద్దు
Comments
Thanks venkat. Thanks for responding to my request on another post for this kind of a post.
As you said most of the cine goers are not happy with current trend.
we need 2 or 3 hits on the “parallel cinema track” and I guess you will find every one will start running for parallel cinema. You know, more than half of the successful people in the industry are really crazy for name.
but the question remains…”పిల్లిమెడ లో గంట ఎవరు కడతారు?”.
నిజంగానే ఇది మన దౌర్భాగ్యం. You hit the nail on the head.