Q and A

by admin@ 24fps

చాలా రోజులుగా ఎదురుచూసిన నా కల నిన్న నిజమైంది.

శనివారం రోజు ఇంట్లో నా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని మొదటి సారిగా డబ్బులు పెట్టి ఒక తెలుగు సినిమా చూసా!

నా బ్లాగుని మొదటినుంచి ఫాలో అవుతున్న వాళ్ళకీపాటికే అర్థమయ్యివుంటుంది నేను చూసిన సినిమా ఏంటో.తెలుగు సినిమా ప్రపంచంలో కాసేపు సంచలనం సృష్టించిన అనీష్ కురువిలా సినిమా “నా వీడియో డైరీ” ,Confessions of a filmmaker సినిమా అనుకున్నట్టుగా 15వతేదీన ఇంటర్నెట్లో లభ్యం కాలేదు. ఏవో server సమస్యలు ఎదురయ్యి ప్రేక్షకలోకానికి ఒక రోజు లేటుగా సినిమా చూసే అవకాశం దొరికింది. చిప్స్ ప్యాకెట్,లీటరు పెప్సీ సీసా పక్కన పెట్టుకుని, సెల్ ఫోను స్విచ్ ఆఫుచేసి శనివారం పొద్దున్నే నా laptop ముందు కూర్చుని ఊపిరి బిగబట్టుకుని ఎదురుచూసా! ఐదు నిమిషాల్లో బొమ్మ పడింది. అప్పట్నుంచి దాదాపు రెండు గంటలపాటు కదలక మెదలక సినిమా చూసేసాను.ఒక పనైపోయింది. సినిమా అంతా అయిపోయాక కూడా అక్కడ్నుంచి కదల బుద్ది కాలేదు.

ముందు కాసేపు నిశ్శబ్దం!
తర్వాత ఒక నిట్టూర్పు!
ఇంతలో ఆగకుండా ప్రశ్నల ప్రవాహం!

అసలేంటీ సినిమా? ఈ సినిమా తీయడం వెనక వున్న వుద్దేశం ఏంటి? ఈ సినిమా తీయడ వల్ల వుపయోగం ఏంటి? ఈ సినిమా గురించి నా అభిప్రాయం ఏంటి? ఈ సినిమా నాకు నచ్చిందా లేదా? ఏమో అన్నీ ప్రశ్నలే!
ఈ సినిమా గురించి నా ప్రశ్నలు-సమాధానాలు

అసలేంటీ సినిమా?
కమల్ కామరాజు అనే వ్యక్తి పదేళ్ళగా సినీ పరిశ్రమలో వేర్వేరు వృత్తులు నిర్వహిస్తూ సినిమాలు తీయాలని కలలు కంటుంటాడు. కానీ పదేళ్ళ తర్వాత కూడా ఆ కలలు కలలుగానే మిగిలిపోవడంతో మరణమే మార్గమనుకుంటాడు. కానీ చనిపోయేముందు తన గురించి లోకానికి తెలియచెప్పాలనే ఉద్దేశంతో తన స్నేహితుడు అనీష్‌ని ముంబాయి నుంచి రప్పిస్తాడు. పది రోజులపాటు తన జీవితాన్ని యధాతధంగా కెమ్రాలో బంధిస్తాడు. అనీష్ రికార్డు చేసిన footage వుపయోగించి ఒక సినిమా రూపొందించి చివరకు తన suicide note కూడా కెమెరాలోనే రికార్డు చేసి తుపాకీతో కాల్చుకుని చనిపోతాడు. అతని మరణాంతరం అతని వద్ద లభ్యమైన వీడియోటేపుల ద్వారా ప్రేక్షకులు ఆ సినిమాని చూడడం అనేది ఈ చిత్ర కథ.

ఈ సినిమా తీయడం వెనక వున్న వుద్దేశం ఏంటి?
దాదాపుగా అట్టడుగు స్థాయికి చేరుకున్న తెలుగు సినిమా దీన దుస్థితిని వేలెత్తి చూపేట్టడమే ఈ సినిమా తీయడం వెనుక వుద్దేశం. ఆ మధ్య ఎక్కడో చదివాను, అనీష్ తన సినిమా ద్వారా సంస్యను sensationalise చేసి సొమ్ము చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడేమో అని. అయనతో మరీ అంత వ్యక్తిగతమైన పరిచయం లేనప్పటికీ ఒక్క విషయం ఐతే నాకు ఖచ్చితంగా తెలుసు. అనీష్‌ది అంతటి దిగజారిన మనస్తత్వం కాదు, బుద్ధి అలాంటి నీచమైనది కాదంటే కాదు. ఎవరు అవునన్నా కాదన్నా మన తెలుగు సినిమా అత్యంత దయనీయమైన స్థితిలో వుంది. అందుకు కారణాలు ఇక్కడ చెప్పుకోవడం అనవసరం. దారిలోపోయే ఎవర్నడిగినా ఆ కారణాలేంటో తెలుస్తాయి. మన సినిమాల దుస్థితిని వేలెత్తి చూపే వుద్దేశంతో అనీష్ ఈ సినిమా తీసారని నా అభిప్రాయం. ఇదంతా మనకి తెలియని విషయమా? అనీష్ చెప్తేనే మనం తెలుసుకోవాలా? అని ఆడిగితే సమాధానం చెప్పడం కష్టం గానీ సినిమా చూస్తూనో, స్నేహితులతో మాట్లాడుతోనో, బ్లాగులు రాస్తూనో, లేకపోతే సైలెంట్‌గా మనసులోనో సినిమాలని, అందులో నటులని, తీసిన దర్శక నిర్మాతలను తిట్టుకోవడం మనందరం చేస్తున్నప్పటికీ అనీష్ తన మనసులోని ఆవేశాన్ని సినిమాగా తీసి అందరితో పంచుకోవలనుకోవడమే ఈ సినిమా ఉద్దేశం.

ఈ సినిమా తీయడo వల్ల వుపయోగం ఏంటి?
సమస్యను ఇదీ సమస్య అని నలుగురితో చెప్పడం ద్వారా అసలు సమస్య వుంది అనే విషయం మన మనసుల్లో ముద్రించుకుపోతుంది. ఆ తర్వాత ఆ నలుగురిలో ఒకరైనా ఆ సమస్యకు పరిష్కారం వెతకడం మొదలుపెడితే, ముందా సంస్యను వేలెత్తి చూపిన వాడి శ్రమ వృధా కాకుండా వుంటుంది. ఈ విధంగా సమస్యను వేలెత్తి చూపే ప్రయత్నం ద్వారా అనీష్ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మొదటి అడుగువేసాడు. దీని వల్ల ప్రేక్షకుల్లో కూడా “నిజమే! ఇలాంటి అబద్దాన్ని ఇన్నాళ్ళూ ఎలా భరిస్తున్నాము” అనే ఆలోచన కలిగితే రాబోయే రోజుల్లో ఈ సినిమా వల్ల చాలా వుపయోగం వుంటుంది.
ఈ సినిమా గురించి నా అభిప్రాయం ఏంటి?
ఇది ఒక కల్పిత కథ కావడం మూలాన ఈ సినిమా ని సినిమాగానే చూస్తే నా అభిప్రాయం ఒకలా వుంటుంది. కాకపోతే ఈ కాల్పనిక కథను మన సినిమా పరిశ్రమ నిజస్థితి ని నిర్భయంగా బయట పెట్టడానికి చేసిన ప్రయత్నం కాబట్టి ఈ సినిమా ను కేవలం సినిమాగా కాకుండా ఒక document లా విశ్లేషించాల్సి వస్తే నా అభిప్రాయం మరోలా వుంటుంది.
ఈ సినిమాను కేవలం ఒక సినిమాగా చూస్తే మాత్రం నన్ను చాలా నిరుత్సాహ పరిచిందనే చెప్పాలి. అందుకు కారణాలు picture, sound, script ల యొక్క నాణ్యత సరిగ్గా లేకపోవడమే! అనీష్ one man army లాగ కెమెరా చేత్తో పట్టుకుని, తను స్వంతంగా రాసుకున్న స్క్రిప్ట్ ను తెరకెక్కించే ప్రయ్త్నంలో చాలా తప్పులే చేశాడు. Sony వారి High Definition కెమెరాను వాడినప్పటికీ సినిమాలో picture క్వాలిటీ అంత బాగోలేదు. డిజిటల్ ఫార్మట్లో సినిమా స్థాయి నాణ్యతను సాధించడం కుదరకపోయినప్పటికీ ఇదే కెమెరాతో చాలా మంది అత్యున్నత స్థాయి సినిమాలు తీసారన్నది నిజం. ఇండిపెండెంట్ సినిమా కాబట్టి లైట్లు,రెఫ్లెక్టర్స్ లాంటి హాడావుడుల అవసరంలేనప్పటికీ సరిగ్గా ప్లాను చేసుకుని వుంటే natural light లో కూడా మంచి క్వాలిటీ చిత్రాలను రికార్డు చేసే అవకాశం వుంది. గతంలో అనీష్ కెమెరా ఉపయోగించడంలో అనుభవం లేకపోవడం ఇందుకు కారణమేమో! picture తోపాటు ఈ సినిమాలో sound కూడా బాగోలేదు. అందుకు ముఖ్య కారణం షూటింగ్ జరిగిన ప్రదేశాలెప్పుడూ ట్రాఫిక్ రణగొణులతోనో లేక వేరే non-diegetic soundలతో నిండిపోవడంతో కమల్ మాటలు చాలా సార్లు ఆ ధ్వని తో మిళితమయ్యి అర్థం కాకుండా పోతాయి. ఇవి రెండూ కాకుండా మరో ముఖ్యమైన పొరపాటు స్క్రిప్ట్‌లో వుంది. మొదటిగా కమల్ మాట్లాడీన ప్రతిమాటకూ interpreter లా అనీష్ (కెమెరా వెనుక నుంచి) మాట్లాడడం బాగోలేదు. స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు తన పాత్ర పరిధి కాస్త తగ్గించుకోవాల్సింది. సినిమా మొదలయ్యేటప్పుడు కమల్ తన suicide note కెమెరాలో రికార్డు చేస్తూ తన ఆత్మహత్యకు కారణం సినీపరిశ్రమ మాత్రమే కాకుండా తన ex-girlfriend అని కూడా చెప్తాడు. ఆమెని నిందిస్తాడు. ఆ తర్వాత సినిమాలో కొన్ని సంధర్బాల్లో ఆమె గురించి ప్రస్తావన వచ్చినా అసలు వీరిద్దరి రిలేషన్ గురించి సరిగ్గా డెవలప్ చేయలేదోమోనని ఉద్దేశం. స్క్రిప్ట్ రాసుకునేటప్పుడూ ముందుగా తెలుగు సినిమా తప్పులని ఎత్తి చూపడమనే ఉద్దేశంతో మొదలెట్టి కథలో love element మిస్ అవుతుందేమో అని మధ్యలో ఈ విషయాన్ని చొప్పించడం వల్లనో లేక ఎడీటింగ్ లవ్ సీన్లు కత్తిరించడం వల్లనో ఏమోగానీ కమల్ లవ్ స్టోరీ ఈ సినిమాలో పెద్ద మిస్టరీగానే మిగిలిపోతుంది. ఇవే కాకుండా కొత్త తరహా సినిమా రూపొందించే ప్రయత్నం చేస్తున్నప్పుడు సినిమాలో అన్ని అంశాలను కొత్త తరహాలో రూపొందించి వుంటే బావుండేదని నా అభిప్రాయం. ఈ విషయాలను పక్కకుపెడితే సినిమా పరంగా ఫర్వాలేదనిపించే ప్రయత్నం ఇది.
ఇకపోతే ఈ సినిమా సినీపరిశ్రమలో నిజాలని బయటకు తెచ్చే ప్రయత్నంలో రూపొందించిన ఒక visual document అనే వుద్దేశంతో ఈ సినిమాని విశ్లేషించాల్సి వస్తే ఈ సినిమా నన్ను చాలా విధాలా నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. అనీష్ అవకాశాన్ని చేజార్చుకున్నాడనిపించింది.
జీవితంలో అవకాశం అనేది ఎప్పుడూ వుంటుంది. కానీ దాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు కొంతమందే వుంటారు. శివ సినిమా వచ్చేవరకూ ఎవరూ ఎందుకు audiography, steadicam లాంటి technical అంశాల జోలికిపోలేదంటే అలాంటి తొలి అవకాశాన్ని ఎవరూ అందిపుచ్చుకోకపోవడమే. వర్మ వచ్చాడు. చూశాడు. చేశాడు. చరిత్ర సృష్టించాడు. అలాగే ఒక గాంధీ అయినా, వివేకానంద అయినా. అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సద్వినియోగపరుచుకున్నారు. చరిత్ర పుటలకెక్కారు.
తెలుగు సినిమా పర్థితి బాగోలేదు అని మనలో మనం ఎన్నో సార్లు మాట్లాడుకుంటున్నప్పటీకీ wider audience కి ఈ సమస్యని తెలియచెప్పి ప్రేక్షకుల్లో చైతన్యం తేవాలనే అవకాశం ఎప్పుడూ వుంది. ఆ అవకాశాన్ని అనీష్ అందిపుచ్చుకోవడంలో విజయం సాధించాడుగానీ ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడంలో మాత్రం విజయం సాధించాడని చెప్పడం కష్టం.
తెలుగు సినిమా సామ్రాజ్యం కొందరిచే పాలింపబడడంచేత టాలెంట్ కలిగిన కొత్త వాళ్ళకు అవకాశాలు రావటంలేదని అనీష్ ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేసాడు. కానీ ఆ విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోయాడు. ఈ సినిమా ద్వారా, సినిమాలో కమల్ పాత్రధారి ద్వారా ఎన్నో విషయాలను చెప్పే అవకాశం వున్నప్పటికీ షుమారు రెండు గంటలపాటు సమయంలో అసలు సమస్యను ప్రేక్షకుల ముందుకు తేలేకపోయాడేమోనని అనుమానం.
ఈ సినిమాలో వున్న పెద్ద సమస్య ఏంటంటే, సినిమాలో కథ జరిగినంతసేపూ తెలుగు సినిమాలు బాగోలేవు ఇక్కడ హీరోలు వెధవలు,హీరోయిన్లు బట్టలిప్పి తిరుగుతారు, దర్శకులు చేతగాని వాళ్ళు అని నిందించడమే కానీ అసలు సంస్య ఏంటి? అనే విషయాన్ని చర్చించలేదు. దీంతోపాటు మరో పెద్ద సమస్య ఏంటంటే, కమల్ సినిమా తీయాలని ఆశపడి అది తీరక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. మరి ఆయన ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నాడో, ఈయన సినిమాలు మిగిలిన వాళ్ళ సినిమాలతో పోలిస్తే ఎలాంటి వ్యత్యాసం కలిగి వుంటాయో అన్న విష్యాలను మచ్చుకైనా చెప్పలేదు.
ఈ సినిమా ద్వారా

1)తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటి?
2)తెలుగు సినిమా పరిశ్రమ వలన కొత్తగా సినిమాలు తీయాలనుకునే వారు ఎదురుకునే సంస్య ఏంటి?
3)ఒక వేళ అవకాశం దొరికితే ఏలాంటి సినిమాలు తీయడం ద్వారా తెలుగు సినిమా అభివృధ్ధి చెందవచ్చు?
అన్న మూడు విషయాలను అంతర్లీనంగా చర్చిస్తూ కథను ముందుకు నడిపుంటే సినిమా చాలా బావుండేది. అలా తీసిన సినిమాతో క్షణాల్లో సినిమా పరిశ్రమ మారకపోయినప్పటికీ మార్పు వైపుగా ప్రేక్షకులు ఎదురుచూపులు చూసేలా అయినా చేసేది.
ఈ సినిమా నాకు నచ్చిందా లేదా?
ఇంతకీ ఈ సినిమా నాకు నచ్చిందా? లేదా?
ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా నాకు నచ్చింది.ఇంత సేపు అది లేదనీ ఇది లేదనీ చెప్పి చివరకు నచ్చిందని చెప్తున్ననేంటి అనుకోకండి. అందుకు కారణాలున్నాయి.
1) ఈ సినిమా నేను తీయలేదు. అది మొదటి కారణం నాకీ సినిమా నచ్చడానికి. ఇక్కడ కూర్చుని అది బాగోలేదు ఇది బాగోలేదు అని ఎంత చెప్పినప్పటికీ ఒక సినిమా తీసి దాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురావడమనే విషయం అంత తేలికైన విషయం కాదు. అదీ కేవలం 6 లక్షల రూపాయలతో తిసిన సినిమా ఇలాంటి అనూహ్యమైన స్పందన రాబట్టుకోవడంలో అనీష్ ప్రతిభ నాకు నచ్చింది.
2) సినిమా అంటే కోట్ల రూపాయల అవసరం లేదనీ, నీ దగ్గర మంచి కథ వుంటే దిజిటల్ ఫార్మట్లో సినిమాగా తీసి ఇంటర్నెట్లో విడుదల చేసి ప్రేక్షకులకు దగ్గరవడమే కాకుండా, సినిమా తీయాలనే కోరికా తీరుతుందనీ ఈ సినిమా ఋజువు చేయడం నచ్చింది.
3) ఈ సినిమాతో నిజాలని బయటపెట్టలన్న అనీష్ ధైర్యం నచ్చింది.
4) ఇప్పుడి సినిమాతో పరిశ్రమ పెద్దలందరిణి విమర్శిస్తే రేపు సినిమాలో చాన్సులు దొరుకుతాయో లేదో అని కూడా ఆలోచించకుండా confessions సినిమా తీసిన అనీష్ తెగింపు నచ్చింది.
5) చివరిగా కమల్ నటన నచ్చింది. షుమారు గంటన్నర పాటు ఒకే వ్యక్తి తన బాధావేశాల్ని ప్రేక్షకులతో వెళ్ళగక్కే పాత్రలో బోరు కొట్టించకుండా చేసిన కమల్ నటన నచ్చింది.
ముగింపు
నచ్చడం నచ్చకపోవడం విషయాలు పక్కనబెట్టి ఈ సినిమా చూసి అనీష్ కి మరో సినిమా తీసేలా ప్రోత్సాహిద్దాం. మొదటి ప్రయత్నంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం కల్పిద్దాం. www.confessionsofafilmmaker.com కి వెళ్ళి సినిమా చూసొద్దాం. ఆయన చేసిన తప్పులు తెలియజేద్దాం.