Fuck! Life is like that
by admin@ 24fps
నేనీ ఇంగ్లీషోళ్ళ(United Kingdom) దేశానికొచ్చి షుమారు సంవత్సరం కావొస్తోంది. ఈ మధ్యనే చలి కాస్తా తగ్గి వాతావరణం బావుంటోంది. ఎండలు మన ఇండియాలోలా మండిపోకపోయినా ఒక మోస్తారుగానే వుంటున్నాయి. ఇలాంటి ఏండాకాలపు సాయంత్రాలలో evening walk కి వెల్తే బావుంటుందని నా భార్య ప్రతిరోజూ గొడవ పెడ్తుండడంతో ఈ మధ్యనే మా walks మొదలు పెట్టాం.
రోజూ మా ఇంటి తలుపు తీసి బయటకొచ్చే సరికి మాకు ఠంచనుగా స్వాగతం చెప్పేదొక పిల్లి పిల్ల. నల్ల రంగులో బొద్దుగా ముద్దుగా వుండే దాన్ని చూసి మా ఆవిడ తెగ ముచ్చట పడిపోయింది. ఏదో ఒకటి చేసి దాన్ని మచ్చిక చేసుకోవాలని మొదటిరోజే తెగ ప్రయత్నించంది పాపం. నాకీ కుక్కలు పిల్లులంటే అలర్జీ కాకపోయినా మరీ అంత ఇష్టముండదు. (ఎందుకని అడగొద్దు. అదో పెద్ద విషాద గాధ). అయినా సరే నా అర్థాంగి సంతోషం కోసం, “హలో” అని ఆ పిల్లి పిల్లను పలకరించడానికి ప్రయత్నం చేసాను.
“హలో, హౌఆర్యూలు మనుషులకు గానీ, పిల్లుల్ని, కుక్కల్ని వాటికర్థమయ్యే భాషలో సంబోధించాలి. నాలాగా” అని “మియ్యావ్, మియ్యావ్” అంటూ ఆ పిల్లిని అప్యాయంగా పలకరించింది నా సహధర్మచారిణి.
మా ఇద్దరి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఇక్కడి మనుషులాగే అది కూడా మా స్నేహ భావాన్ని అర్థం చేసుకున్నట్టులేదు. లేకపోతే ఈ నల్ల పిల్లి కూడా జాతి వివక్ష చూపిస్తోందో ఏమో అన్న అనుమానం కూడా కలిగింది.ఇవన్నీ కాకుండా ఆ పిల్లికి చెవుడేమో! అవే అనుమానాల్ని నా పత్ని తో వ్యక్తం చేస్తే absurd సాహిత్యం , సినిమాలు నా జీవితంలో ఎక్కువయిపోయి నా ఆలోచనలు కూడా absurd అయిపోయాయని విశ్లేషణ చేసేసింది. ఆవిడన్న మాటలకు నాకా పిల్లి మీద వున్న ఇంట్రెస్ట్ కాస్తా పోయింది.
ఆ రొజు మొదలుకుని మేము evening walk వెళ్ళిన ప్రతి సాయంత్రం మాకా పిల్లి పిల్ల ఎదురుకావడం , దానితో పరిచయం పెంచుకోవడానికి నా భార్యామణి శతవిధాలా ప్రయత్నించడం అలవాటయిపోయింది.
పది రోజులుగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. “మియ్యావ్ ,మియ్యావ్” అని ఎంతగా గొంతు చించుకుని అరిచినా అది దగ్గరకు మాత్రం రాదు. మేము దగ్గరికెల్తే తుర్రుమని పారిపోతుంది. ప్రతి రోజూ జరుగుతున్న ఈ తంతు చూసి నాకు జాలి కలిగింది.
” మియ్యావ్, మియ్యావ్” అని పిలిస్తే దానికర్థమవుతుందో లేదో అసలే ఇంగ్లీషు పిల్లి కదా! accent ప్రాబ్లమేమో! ఇక్కడి accent లో ప్రయత్నిస్తే ఏమైనా ఫలితముండొచ్చేమో” అని ఉచిత సలహా పడేసా!
” నిజమా! అదెలాగో కాస్తా వివరిస్తారా?” అని నా వైపు అదోలా చూసింది నా పెళ్ళం.
“నువ్వు ‘మియ్యావ్ , మియ్యావ్’ అంటున్నావు. కానీ ‘మ్యావ్, మ్యావ్’ అని ప్రయత్నిస్తే….” అని నీళ్ళు నమిలాను. నా ఆలోచన నాకే మూర్ఖంగా తోచింది.
నా బాధ అర్థమైందో ఏమో ఏమీ సమాధానం చెప్పకుండానే వుండిపోయింది .
నా ఆలోచనలేవి నా ఇల్లాలు దగ్గర అంగీకారం పొందనందుకో ఏమో నాకా పిల్లి మీద చాలా కోపమొచ్చింది. ఈ సారెప్పుడైనా ఒక్కడినే వున్నప్పుడు నాకెదురు పడితే రాయి తీసుకు కొట్టాలనిపించింది.
నిన్న సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికెళ్తుంటే సరిగ్గా అలాంటి అవకాశమే నాకు అందివచ్చింది. ఇంటి గేటు తెరవ బోతుండగా నాకెదురుగా నిల్చుని నన్నే చూస్తూ నిల్చుందా నల్ల పిల్లి. “ఏం చూసుకునే నీకింత పొగరు. పలకరిస్తే పలకవేంటి ? ” అని నిలదీసి ప్రశ్నించాలనిపించింది. అయినా ఆ పిల్లికి తెలుగర్థమవుతుందో లేదో నని అనుమానం కలిగింది. ఉన్న సమస్యలు చాలవన్నట్టు ఇప్పుడి పిల్లి నా జీవితంలో ఒక సమస్యగా తయారయిపోవడం నాకు విసుగు కలిగించింది. నెల రోజులుగా నిర్విరామంగా కృషి చేస్తున్నా మొండిపట్టు పట్టి పలకరింపకపోవడం నాకు చాలా కోపాన్ని తెచ్చింది.
ఇదంతా ఒకవైపైతే నా ఇంటావిడ ఇంటర్నెట్ లో గంతలు గంటలు “పిల్లుల్ని మచ్చిక చేసుకోవడమెలా” అనే విషయం గురించి పరిశోధనలో మునిగిపోయింది. కూరలు చేయడానికి recipe కోసం తప్పితే కంప్యూటర్ వైపే రాని నా house wife ని నాకు దూరం చేసి కంప్యూటర్కి దగ్గర చేసిన పిల్లంటే నాకు వళ్ళుమండిపోయింది.
కోపం , విసుగు కలగలిపిన నేను ఉండబట్టలేక, గేటుకెదురుగా నిల్చుని నన్నే చూస్తున్న పిల్లిని చూసి “fuck you” అనేశాను.
అప్పటి వరకూ కోపంగా కళ్ళల్లోకి చూస్తున్న ఆ పిల్లిపిల్ల ఒక్కసారిగా దీనంగా మారిపోయి, “మ్యావ్” అనుకుంటూ తోకాడించుకుంటూ వెళ్ళిపోయింది.
ఒక్కసారిగా నాకు “యురేకా! యురేకా!” అని గంతులేయాలనిపించింది. అప్పటికప్పుడు ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి నా భార్య తో ఆ విషయాన్ని చెప్పాలని పరిగెత్తాను. కానీ ఇంట్లోకి అడుగు పెడ్తుండగా అనుమానం కలిగింది.
ఏమని చెప్పాలి ? ఇక్కడివాళ్ళలాగే ప్రతిమాట ముందు ఒక fuck, వెనక ఒక fuck ను చేసర్చేస్తే ఈ పిల్లిని మచ్చిక చేసుకోవడం సులభమనా? పిల్లి భాషకు వేర్వేరు accent లు0టాయంటేనే నన్ను విచిత్రంగా చూసింది నా వైపు. ఇప్పుడెల్లి ఈ విషయం చెప్తే నాకు పూర్తిగా పిచ్చని నిర్ణయానికొచ్చేస్తుందని అనుమానం కలిగి ఆ విషయాన్ని నాలోనే దాచేసుకున్నాను.
ఆ తర్వాత గంట తర్వాత నా సతీమణి తో కలిసి evening walk కి బయల్దేరితే మరోసారి ఎదురుపడిందా మార్జాలం. నన్ను చూసి హడలిపోయినట్టుంది. ఎప్పటిలాగే మావైపు గుర్రుగా చూడకుండా “మ్యావ్ ,మ్యావ్” అంటూ దీనంగా పలకరించింది. దాంతో నా బెటర్ హాఫ్ , “హమ్మయ్య! ఇనాళ్ళకి నా మీద కనికరం కలిగినట్టుంది” అని ఆ పిల్లి పిల్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. కానీ అసలు రహస్యం మాత్రం ఆ పిల్లికి , నాకూ , ఇప్పుడు మీకూ తప్ప ఎవ్వరికీ తెలియదన్నది మాత్రం సత్యం.
“Fuck! Life is like that.”
Comments
హహహ…
మీ అనుభవం వింటే నవ్వొచ్చింది. పిల్లులు కూడా మనతో ఆడుకుంటున్నాయి.
ఇంగ్లీషు వాళ్ళని ఏముంది ? ప్రపంచమంతటా నిరంతర అశ్లీల ధ్యానమే. మా గుంటూరులో ప్రతివాడూ విధాయకంగా స్మరించే “ఆ మూడు” బూతు పదాలు లేకుండా సంభాషణకి జవం జీవం రావని వాళ్ళ అబిప్రాయం.
భలే రాశారు. ఒక పిల్లి మనలో అలజడి కలిగించడం సరేగానీ, దాన్ని ఇలా తెరకెక్కించడం బాగుంది.