Winds of Change

by admin@ 24fps

ఈ ప్రపంచంలో నిత్యమైనది, నిరంతరమైనది, శాశ్వతమైనది ఏదైనా ఉందంటే అది మార్పు మాత్రమే!

విశ్వంలో జరిగే క్రమ పరిణామల ఫలితంగానే నేడు మనమీ స్థితిలో ఉన్నాము. ప్రతిరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచం మార్పుకి గురవుతూనేఉంది.మనలోను మన జీవితాల్లోను క్షణక్షణం ఎన్నో పరిణామాలు సంభవిస్తూనేఉన్నాయి.

సినిమాలు మన జీవితాలకు ప్రతిబింబమైనప్పుడు, మన జీవితంలానే సినిమాలు కూడా మార్పూ చెందాలి.చెందుతాయి కూడా! పౌరాణిక సినిమాలనుండీ సాంఘిక సినిమాల వైపు గా దిశ మార్చిన మన తెలుగు సినిమాలు, బాపు తీసిన “సాక్షి” సినిమాతో స్టూడియో సెట్లను వదిలివచ్చాయి. రాంగోపాల్ వర్మ తీసిన “శివ” సినిమాతో పాత చింతకాయ పచ్చడిలా ఉన్న మన సినిమాల శైలి కొత్త పుంతలు తొక్కింది. సాంకేతిక విప్లవంఇచ్చిన నైపుణ్యంతో నేడు మన సినిమాలు మంచి నైపుణ్యంతో మలచబడుతున్నాయి.కానీ తమ స్వంత అవసరాల కొరకై సినిమా పరిశ్రమను తమ స్వంతదిగా చేసుకుని సినిమాలను తమకనుకూలంగా మలుచుకోవలనే ప్రయత్నంలో సినిమా జగత్తులో మార్పుకి చోటులేకూండా చేస్తున్నారు.దీనికి తోడుగా అజ్ఞానం,అవివేకం, సినిమా తారలను దైవసమానంగా భావించి పూజించడం, తెగింపులేకపోవడం, సినిమాలను కళాత్మక ధోరణి తో కాకుండా కేవలం వ్యాపారత్మక ధోరణితోనే చూడడం  లాంటి ఎన్నో ఆంశాలు తోడయ్యి ప్రస్తుత మన తెలుగు సినిమా యొక్క గడ్డు పరిస్థితికి దారితీశాయి.

కానీ ఇదేమీ ప్రమాదకరమైన పరిస్థితి కాదు. ఒక విధంగా చూస్తే మన తెలుగు సినిమాలే కాదు, ప్రపంచంలోని అన్ని సినిమా పరిశ్రమలు ఇలాంటి గడ్డూ పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. ఇందుకు అనేక కారణలు ఉన్నాయి.

సినిమా తీయాలంటే ఎవరున్నా లేకపోయినా ఒక నిర్మాత కావాలి. తన దగ్గరున్న డబ్బులు సినిమాలో పెట్టుబడి పెట్టిన నిర్మాత తన పెట్టిన సొమ్ముని రెండీంతలు చేసుకూందామనుకోవడంలో ఎటువంటి తప్పులేదు. ఒక వేళా నిర్మాత మరీ ఎక్కువగా వ్యాపారాత్మక ధోరణి లేనివాడైతే కనీసం తన పెట్టుబడి తనకు తిరిగివస్తే చాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలోనే తన సినిమాను జనరంజకంగా ఉండాలని , తద్వారా తన సొమ్ము తనకి తిరిగొస్తుందని సమాధానపడతాడు. కాని ఏ సినిమా జనామోదం చెందుతుందో, ఏది జనామోదం చెందదో అని అంచనా వేసుకోవడానికి అతనికున్న ఒకే ఒక్క సాధనం గతంలో వచ్చిన సినిమాల ఫలితమే! ఫలానా కథతో సినిమా తీస్తే హిట్టయింది, ఫలాన హీరోయిన్ తో సినిమా తీస్తే ఫట్టయింది, అన్న విషయాలు లెక్కలోకి తీసుకుని ఫలానా సినిమాలాగే మరో సినిమా తీస్తే విజయం సాధించవచ్చు అన్న నిర్ణయానికొస్తాడు. నిర్మాతకా పునర్నివేశం అందచేసింది ప్రేక్షకులే, అంటే మనమే. మనకు ఫలానా సినిమాలే నచ్చుతాయని నిర్మాతలు (దర్శకులు, రచయితలు కూడా!)నిర్ణయించేసుకుని మనకు మళ్ళీ మళ్ళీ అలాంటి సినిమాలే అందివాలన్న ప్రయత్నమే సమస్యలన్నింటికీ మూలకారణం.

Feedback loop అని ఒక మూలసూత్రం ఒకటుంది. మనిషి ఎదుగుదలలో ఈ సూత్రం ఎంతో ముఖ్య పాత్ర వహించింది.ఉదాహరణకు మనం వేపకాయ తిన్నామనుకోండి. మన మేధస్సు మనకు “ఈ కాయ చేదుగా ఉంది” అని negative feedback అంద చేస్తుంది.అలాగే మామిడికాయ తిన్నామనుకోండి. అప్పుడు మన మేధస్సు మనకు “ఈ కాయ తియ్యగా బావుంది” అని positive feedback అందచేస్తుంది. అందుకే మనం వేపకాయ తినము. మామిడికాయ తింటాము. సరిగ్గా అలాగే సినిమా బావుంటే హిట్టు చేసి Positive feedback అందచేస్తాము. లేదంటే ఫ్లాపు చేసి negative feedback అందచేస్తాము. ప్రేక్షకుల feedback ఆధారంగానే చాలా వరకు సినిమాలు నిర్మింపబడతాయి.

ప్రపంచంలోని ఏమూలనైనా ఈ సూత్రం పనిచేసినప్పటికీ మన తెలుగుదేశంలో ఈ సూత్రానికొక మినహాయింపు ఉంది. ఆ మినహాయింపే మన సినిమాలనీ పరిస్థితికి తీసుకొచ్చింది. అదే Star System. నానా కష్టాలూ పడి పైకొచ్చి పేరుప్రఖ్యాతలుగాంచిన నటులు తమ తమ పుత్రరత్నాలకు తమ ప్రఖ్యాతిని వారసత్వంగా అందచేశారు. తండ్రి నచ్చిన అభిమానులు కొడుకుని నచ్చారు. ఆ నటరత్నల పుత్రరత్నాల మొహంలో సుతారమూ నటన అనే ఆనవాళ్ళెక్కడ కనిపించనివ్వకుండా బండరాళ్ళవలెనో, మట్టిముద్దవలెనో బిగదిసుకు కూర్చున్నప్పటికీ, మాటైనా సరిగ్గ పలుకలేక పొడిపోడిగా సణుగుతూనో, అర్థం పర్థం లేకుండా కేకలేస్తూనో, గోలచేస్తూనో సంభాషణలు చెప్పినప్పటికీ అభిమానులు ఆదరించడంతో చాలామంది తారలు హీరోలుగా పరిశ్రమలో నిలదొక్కుకుని మన సహనానికి పరీక్ష పెడుతున్న మాట నిజమే! తమకున్న డబ్బుతో అందని ఎత్తుకు ఎదిగిన ఈ తారల మరింత ఎదుగుదలకు దర్శకులు, నిర్మాతలు సహకరించడంతో మన సినిమాల పరిస్థితి నీచాతి నీచానికి దిగజారిపోయింది.

కానీ ప్రేక్షకుల అంచనాలకు, ఆకాంక్షలను పక్కనపెట్టి తమ సినిమాలను తమ ఆత్మ సంతృప్తి కొరకై, తమలోని కళాత్రష్ణను తెలియచేయటనికొరకై కొంతమంది తీసే సినిమాలు ఒక్కోసారి సినిపరిశ్రమకొక కొత్త దిశను నిర్దేశిస్తాయి, లేదా మంచి సినిమా చూసిన అనుభూతిని ప్రేక్షకులకు మిగులుస్తాయి.మన తెలుగు సినిమా చరిత్రలో అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో బాపు, విశ్వనాధ్, వంశీ, రాంగోపాల్ వర్మ, కృష్ణ వంశీ లాంటి వారు ప్రముఖులు.ప్రపంచ సినిమా చరిత్ర చూస్తే మనకు Quentin Tarantino, Godard, Vittorio De Sica రూపంలో మనకెందరో దర్శనమిస్తారు.

మన తెలుగు సినిమా చరిత్రలో నవకల్పనకు మరోపేరుగా నిల్చిన వంశీ లాంటి వారు మరికొందరుండుంటే మనకీ 1950లలో France లో ఎగిసిన నవ తరంగం (New Wave)లానో, Italy లో మేల్కొన్న సరికొత్త వాస్తవికత (neo-realism)లానో, Denmarkలో నిర్దేశించిన నిశ్చితాభిప్రాయం(Dogme-95) లానో మనలోనూ ఒక ఉద్యమం మొదలయ్యుండేది.ఇప్పటికైనా జరిగిన నష్టమేమీలేదు. ప్రేక్షకుల్లో మేల్కొలుపు రావాలి. తమ negative feedback తో సినిమాలు బాగోలేవని తీసేవాళ్ళకు తెలియచెప్పాలి.

సినిమాలు తీయాలి అనే కలలు కనే వాళ్ళు ఫలాన హీరోతో, ఫలానా హీరోయిన్ తో సినిమాలు తీయాలని కలలు కనడంమాని మంచి కథ, మంచి కథనాలు సృష్టించాలి. నవకల్పనలు చేయాలి. నవతరంగం ఎప్పుడు వస్తుందా! మనమూ ఎక్కి ఊరేగుదామని ఎదురు చూడకుండా మనమే నవత, మనదే  నవతరం అని ముందుకు సాగాలి. Winds of Change తేవాలి.