Confessions

by admin@ 24fps

మొత్తానికి అనీష్ తన సంచలనాత్మక సినిమా 'Confessions of a filmmaker-నా వీడియో డైరీ' ని విజయవంతంగా చిత్రీకరించి ఈ మధ్యనే ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రదర్శించారు.

ఆనంద్, గోదావరి చిత్రాల ద్వార తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన శేఖర్ కమ్ములకు మిత్రుడు, ఆనంద్ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించిన అనీష్ కురువిల్లా చిత్రీకరించిన Confessions…. తెలుగు సినీ ప్రపంచంలో పెద్దసంచలనాన్నే సృష్టించింది సినిమా తీయాలని కలలు కనే వేలదిమంది కుర్రాళ్ళలాగే హైదరాబాదులోని కృష్ణానగర్ చేరుకుని పదేళ్ళపాటు నానావెతలుపడి, తన లక్ష్యం నెరవేరదని నిశ్చయించుకొని ఆత్మహత్యకు పూనుకొన్న ఒక కళకారుడు తన ఆత్మఘోషని వీడియో కెమెరాలో చిత్రీకరించడమే ఈ చిత్ర కథ.

youtube లో tailer ద్వారా తన సినిమా ఎలా ఉండబోతుందో ముందుగానే తెలియచేసిన అనీష్ అనుకున్నట్టుగానే తన సినిమా ద్వారా ప్రస్తుత తెలుగుసినిమా పరిస్థితులపై వేడి బాణాన్ని సంధించాడు. పొద్దున లేచిన దగ్గర్నుంచీ ఎవరు ఎవరిని దెం*రు,ఎవరు ఎవరి స* వత్తారు, ఎవరు ఎవర్తో దెం**చుకున్నార్న్న విషయాలు తప్పితే తెలుగు సినిమా ప్రపంచంలో కళ కు తావులేదనే సత్యాన్ని మనకు తెలియచెప్పాలనే ప్రయత్నం ఒక విధంగా మంచిదే అయినప్పటికీ, ఆ విషయాలు మనందరికీ తెలియచేయడంతో తెలుగు సినిమాకు జరిగే మంచేమిటో అర్థంకాదనే చెప్పాలి.

ఇరాక్ పై, ఆఫ్గనిస్తాన్ పై అర్థంలేని యుధ్ధం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు బుష్ పై కసితో, గదిలో ఒక మూలకూర్చుని, బుష్ పై చేతబడి ప్రయత్నం చేసే స్కూలు పిల్లవాడి ప్రయత్నం ఎంత అమాయకంగా ఉంటుందో, 75 ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగు సిన్మానంతటినీ ఒక సినిమాతో ప్రక్షాలన చేద్దామన్న అనిష్ ప్రయత్నం కూడ అంతే అమయాకంగా ఉందనే చెప్పాలి.

Confessions…లో చెప్పినట్టు, నటన అనే పదానికి అర్థమైన తెలియని నటులు, సినిమాకొక భాష-వ్యాకరణం ఉంటాయని కూడా తెలియని దర్శకులు, సంగీతంలోని 'స రి గ మ 'లు కూడ తెలియని సంగీత దర్శకులతో కూడుకొన్న మన సినీ ప్రపంచంలో, తమ తమ ఇష్టాలు, అవసరాలు, కోర్కెలు తీర్చుకోడానికి సినిమాను ఒక మాధ్యమంగా ఉపయోగించారని, ఉపయోగించుకుంటున్నారని, ఉపయోగించుకుంటారని మనకు తెలిసిన విషయమే. కాకపోతే Confessions.. ద్వారా అనీష్ ఏమి సాధిద్దామనుకున్నడో!

నిజమే తెలుగు సినిమా పరిస్థితి నీచాతి నీచానికి దిగజారిపోయింది. కళకిక్కడ చోటు లేదు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు నిర్మాతలు, దర్శకులు, నటులు, తమ తమ తమ్ముల్లు, కొడుకులను నటులుగా పెట్టి సినిమాలు తీసేస్తున్నారు. సినిమాను తమ వంశపారంపర్యంగా సంకురించిన ఆస్తిలా వాడేసుకుంటున్నారు.అంత మాత్రాన తెలుగు సినిమాకొచ్చిన ఘోరమేమి లేదు. మంచి సినిమాలు తీయలనుకునేవాళ్ళు అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. ఎల్లప్పుడు వుంటారు. ఒక నీలకంఠ ని తీసుకోండి! ఒక మోహనకృష్ణ ని తీసుకోండి! మంచి సినిమాలు తీయాలనే తపన వారిలో కనిపిస్తుంది. ఆ ప్రయతనంలో విజయం సాధించడానికి సమయం పట్టవచ్చు.

కాని చీకట్లో గుడ్డిదీపంలా అక్కడో ఇక్కడో మిణుకు మిణుకుమంటున్నాయి తెలుగు నక్ష్త్రాలు. అంతెందుకు మొన్న Berlin Film Festival ఒక వెలుగు వెలిగిన వనజ మన తెలుగు సినిమా కాదా? ఈంక్ చిత్రం ద్వారా తనలోని భావాలను తెరపై చిత్రరూపమిచ్చిన మన భరణి గారు తెలుగు వాళ్ళు కాదా? ఎన్నో అవార్డులు గెలుచుకున్న తిలాదానం మన తెలుగు సినిమా కాదా? హిందీ వాళ్ళు Macbeth ని Maqbool పేరుతో తీసే సమయానికి మన వాడైన Mohan Koda యెల్లమ్మ సినిమాను తీయలేదా? అంతెందుకు తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకొన్న వంశీ తీసిన సినిమాల సంగతేంటి? French సినిమాకొక Godard ఉన్నట్టు మనకూ ఒక వంశీ ఉన్నాడని గర్వంగా చెప్పుకోవచ్చు.

చిరంజీవి కున్న Star status ఉపయోగించుకుని అతని తమ్ముల్లు, కొడుకు, అల్లుడు సినిమాల్లోకి రంగప్రవేశం చేస్తే,NTR పుణ్యమా అని ఒక పెద్ద కుటుంబమే సినిమా రంగంపై స్వైర విహారం చెసేస్తోంది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.ఎంతోమంది సినిమాను వాడుకున్నారు. ఇది ఇంతటితో ఆగదు. సినిమాల ద్వార సంపాదించిన ఖ్యాతిని వాడుకుని ఎంతోమంది ఎన్నెన్నో మెట్లు ఎక్కేశారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇదంతా పచ్చి నిజం. కాని వారికా అవకాశం కల్పించింది మన్మేనన్నది కూడ పచ్చి నిజం. నేటి మన సినిమాకు పట్టిన రోగం కుదరాలంటే మార్పు అవసరం. కాని Confessions…లాంటి సినిమాల ద్వార అలాంటి మార్పు వస్తుందనుకుంటే మాత్రం అది భ్రమే అవుతుంది. గుడ్డు ముందా, పిల్ల ముందా అన్న అభంగురమైన ప్రశ్న లాగే , మన సినిమాలు కూడ , "ప్రేక్షకులు చూస్తున్నరు కాబట్టే మేమిలాంటి సినిమాలు తీస్తున్నామని నిర్మాతలు, వాళ్ళలాంటి సినిమాలు తీస్తున్నరు కాబట్టే మేము చూస్తున్నామని ప్రేక్షకులు" సరిపెట్టుకోవడంతో మార్పు ఇప్పట్లో వచ్చే సూచనలు కనిపించకపోయినప్పటికి, ప్రపంచ నలుమూలల్లోను మన ఉనిఖిని చాటుకుంటూన్న మనవాళ్ళు ప్రపంచాన్నే కాదు, ప్రపంచ సినిమాలను కూడ చూస్తున్నారనేది సత్యం. ఆ సినిమాలు మనవాళ్ళ కళ్ళు తెరిపించడం ఖాయం.అలాగే DVD ల రూపంలో ప్రపంచ నలుమూలల నుండీ సినిమాలు మనకిప్పుడు లభ్యమవుతున్నాయి. ప్రజలు చదువుకుంటూన్నారు. చదువు నేర్పిన విజ్ఞానం ఊరికే పోదు. Internet ద్వార ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు ప్రజలు. నిన్న మొన్నటి దాకా English భాషకే పరిమితమైన Internet సౌకర్యం నేడు తెలుగు భాషలో లభ్యమవుతోంది.మళ్ళీ ప్రజల్ళో కళాపోషణ కు అవకాశం కలుగుతోంది. సినిమా తీయాలంటే కోట్లు కోట్లు కుమ్మరించాలసిన అవసరం లేదు. లక్ష రూపాయల్లో కూడ సినిమ తీయగలిగే రోజులివి. రోజులు మారుతున్నయి. ప్రజలూ మారుతున్నరు. ఈ మార్పు ఒక స్థిరమిన రూపం దాలచడానికి కొన్నేళ్ళు పడ్తుంది. అప్పుడూ సినిమాలూ మారుతాయి.

Confessions…సినిమా ద్వారా అనీష్ ఈ మార్పులో భాగమై ఉంటే బావుండేది. సుడిగాలిలా సంచలనం సృష్టించడం కాదు మనకు కావల్సింది. పిల్లగాలిలా వచ్చి లోకమంతా ఆవరిచడమే మన ప్రయత్నం కావాలి. తెలుగు సినిమాని ఉధ్ధరించడమే అనీష్ బాధ అయ్యుంటే ఆయన Confessions..తీసుండేవాడు కాదు. కేరళ నుంచి వచ్చి ఆంధ్రలో స్థిరపడ్డ అనీష్ తన స్వంత రాష్ట్రం ఐన కేరళలోని దర్శకులనుంచి ప్రేరణ పొదుండాల్సింది.మంచి సినిమాలు కావాలంటే మంచి సినిమాలు తీయాలి. అంతే కాని చెడ్డ సినిమాలగురించి మరో చెడ్డ సినిమా తీస్తే అది మరో చెడ్డ సినిమా అవుతుందే గానీ సినిమాకేమీ మంచి జరగదు.

ఒక అదూర్ గోపాలకృష్ణన్ లాగానో,జాన్ అబ్రహంలాగానో మంచి సినిమా తీసే ప్రయత్నం చేసుంటే బావుండేది. అంత దాకా ఎందుకు Dollor Dreams, ఆనంద్, గోదావరి సినిమాలు ఈయన స్వంత సినిమాల్లంటివే కదా?మరి ఆ సినిమాలు తీసి ఈయనేమి సాధించినట్టూ. ఆ సినిమాలను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడనికి వారికెదురైన అడ్డకులేమిటో? ఇలా అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుని, ఇప్పుడు వాళ్ళెవరో ఎవరినో దె**తున్నారని తన సినిమా ద్వారా చెప్పడానికి కారణం, ఆ అవకాశం తనకు రాలేదన్న ఈర్ష్యాసూయలే కారణమేమోనని ప్రజలు అనుకునే ప్రమాదంలేదంటారా? ఏదేమైనప్పటికీ ఈ నెల 12వ తేది ప్రదర్శించిన మొదటి షోనే ఆఖరి షో అని ప్రకటించి మరో సంచలనం సృష్టించాడు అనీష్. కాబట్టి మనమీ సినిమాని సినిమా హళ్ళల్లొ చూసే అదృష్టం(?) కోల్పోయినప్పటికీ Internet ద్వారానో, DVD రూపంలోనో చూసే అవకాశం త్వరలో మనకు లభించబోతుంది. అనీష్ తన సినిమా ద్వారా తెలుగు సినిమాకు చేకూర్చిన మేలెంతో తెలియదుగాని ఎన్నో విఛ్ఛిత హృదయల ఘోషను తన సినిమాలో చూపించే ప్రయత్నం ఒక విధంగా ప్రశంసనీయం. అంతే కాకుండా సినిమా తీయగల ధమ్ముంటే పెద్ద పెద్ద నిర్మాతల అవసరం లేదని నిరూపించి తెలుగు సినిమా చరిత్రలో independent సినిమాకు నాంది పలికాదన్న మాట మాత్రం నిజం.అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. తెలుగు సినిమా కుళ్ళిపోయిందని, మార్పు రావలని కలవరించిన అనీష్ భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు తీస్తారో చూద్దాం!

PS:అదనీ ఇదనీ ఎంత రాసినా కూడా అనీష్ ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను.అనీష్ కి గుర్తుందో లేదో కానీ ఒక రెండేళ్ళ క్రితం నేనతన్ని మా TV లో ఒక ప్రోగ్రాం కోసం శేఖర్ కమ్ముల వాళ్ళింట్లో అతని ఇంటర్వూ తీసుకున్నాను.