Sunshine

by admin@ 24fps

కథ:

2057 వ సంవత్సరం. సూర్యుని శక్తి నానాటికి క్షీణించి పోతుంది. భూమండలమంతా మంచుతో కప్పబడిపోయింది. ఉష్ణోగ్రత అత్యంత హీన స్థాయికి దిగజారిపోయి మానవ మనుగడ ప్రశ్నార్థకమైంది. త్వరలో ఎదో ఒకటి చేయకపోతే అతి కొద్ది రోజుల్లో భూమిపై మానవ మాత్రులెవరూ మిగలరు. భూమండలంపై ఉష్ణోగ్రతను సాధారణ స్థాయి కి తీసుకురావాలంటే చల్లారిపోతున్న సూర్యున్ని భగభగ మండించాలి. ఆ ప్రయత్నంలో అత్యంత వ్యప్రయాసలకోర్చి ఇకారస్-2 అనే వ్యోమనౌకను నిర్మిస్తారు శాస్త్రజ్ఞులు.ఇకారస్-2 కంటే ముందు ఇకారస్-1 అనే అంతరిక్ష నౌక ఏడేళ్ళ క్రితం ఇదే పనిమీద బయల్దేరినప్పటికి అక్కడనుంచి ఎటువంటి సంకేతాలు అందకపోవడంటో మానవాళి తమ చివరి ఆశలను ఇకారస్-2 పై పెట్టుకుంటారు. మానవప్రయత్నంతో అణుబాంబు పేల్చి big-bangని సృష్టించి స్వయంప్రకాశమానమైన సూర్యున్ని మరో సారి ఉజ్వలంగా వెలిగేలాచేసే ప్రయత్నంలో ఎనిమిదిమంది నావికులతో కూడిన ఇకారస్-2 సూర్యుని వైపుగా బయల్దేరుతుంది.సంవత్సరాల తరబడి ప్రయాణం చేశాక మెర్క్యురి గ్రహం చేరుకుంటుంది ఇకారస్-2. త్వరలోనే గమ్యం చేరబోతున్నామన్న ఆనందంలో ఉన్న నౌకా సిబ్బంది భూమండలంలోని తమ సహచరులతో సమాచార అనుసంధాన్ని కోల్పోతారు.

ఇదే సమయానికి తమని రక్షించండంటూ ఇకారస్-1 నుండి సంకేతాలని అందుకొంటారు. ఇకారస్-1 తో సంబంధం లేకుండా తము ముందుకు సాగిపోవాలని కొందరు, ఇకారస్-1 వైపుగా వెళ్ళి అందు-లో ఉన్న మరో బాంబు ని కూడా సాధించగలిగితే తమ వద్ద రెండు అవకాశాలున్నట్టవుతుందని మరికొందరు వాదిస్తారు. మానవుల ఉనికికి పెనుసవాలుగా మారిన పరిస్థితుల్లో ఉన్న ఒక్క అవకాశము చేజారినప్పటికి, ఇకారస్-1 నుండి తాము సాధించబోయే రెండో బాంబు తప్పక ఉపయోగపడే అవకాశం ఉందనే వాదనను మొదట్లో కాదని తోసిపుచ్చినప్పటికి, కొన్నాళ్ళ తర్వాత అకస్మాత్తుగా జరిగే ఓక విపత్తు తమ నౌకను ఇకారస్-1 వైపు గా మళ్ళించేలా చేస్తుంది.

ఏడెళ్ల క్రితం భూమినుంచి బయల్దేరిన ఇకారస్-1 అసలేమయింది? అందులోని సిబ్బంది ఇంకా బ్రతికే ఉన్నారా?ఇకారస్-2 సిబ్బంది ఇకారస్-1 లోనికి ప్రవేశించగలిగారా? ఇకారస్-2 సిబ్బంది సూర్యున్ని తిరిగి తేజోవంతం చేయగలిగారా? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే Danny Boyle దర్శకత్వం వహించిన ఇంగ్లీష్ సినిమా Sun Shine చూడవలిసిందే!  

విశ్లేషణ: గతంలో Trainspotting,28 days later వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన Danny Boyle రూపొందించిన Sun Shine ఈ సంవత్సరం విదుదలైన మంచిసినిమాల్లో ఒకటి. అంతరిక్ష నౌకల్లో ఇతర గ్రహానికి ప్రయాణించడం ఆధారం చేసుకొని గతంలో వచ్చిన 2001:A SPace Odussey, Solaris వంతి సినిమాలను ఈ సినిమా గుర్తుకుతెస్తుంది. కేవలం special effects పై ఆధారపడకుండా మంచి కథ, కథనం, పాత్రల నడవడికలు, వారి మధ్య జరిగే వాగ్వివాదాల తో కూడుకున్న ఈ సినిమా, పై సినిమాలలాగే మనుషుల స్వభావాలను మన కళ్ల ముందు సాక్షాత్కరింపచేయాలనే ఉద్దేశంతో నిర్మింపబడింది.

ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల జాబితాల్లో ముందుండే Stanley Kubrick దర్శకత్వం వహించబడ్డ 2001: A Space Odyseey, రష్యన్ సినిమా చరిత్రలోనే కాకుండా ప్రపంచ సినిమా చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కల్పించుకున్న Andrei Tarkovsky చే దర్శకత్వం వహించబడ్డ Solaris సినిమాల స్థాయిలో Sunshine సినిమాను నిలబెట్టలేకపోయినప్పటికీ తనదైన శైలి లో Danny Boyle ఒక మంచి సినిమా ను మనకందించారని చెప్పొచ్చు. కథాపరంగా పైన పేర్కొనబడ్ద సినిమాలకంటే ఈ సినిమా కథ ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. నిజానికి కథను ప్రేక్షకులకు అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టు ఉండడమే SunShine సినిమా యొక్క పెద్ద ప్రతిబంధకం. ప్రపంచంలోని అత్యుత్తమ సినిమాలు, సినిమా చూసిన ప్రేక్షకులకు ఆలోచించడానికి ఎంతో కొంత అవకాశాన్ని కలిగిస్తాయి. సినిమాహాలు వదిలి వెళ్ళాక కూడా ఆ సినిమాల్లో నిక్షిప్తమై ఉన్న అంశాలను పొరలుపొరలుగా విడదీసి మన మేధస్సుకి పని పెడ్తాయి. సరిగ్గ ఈ విష్యం లోపించడం మూలానే Sun shine ప్రపంచ సినిమా చరిత్రలో తనకో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకునే అవకాశాని కోల్పోయిందని నా అభిప్రాయం. నిజానికి Danny Boyle దర్శకత్వ ప్రతిభను అనుమానించాల్సి వస్తుందిక్కడ. ఈయన మంచి సినిమాలే తీస్తారు గాని, ఎక్కడో పప్పులో కాలేస్తారు. గతంలో 28 Days Later సినిమా కూడ ఇంతే! సినిమా మొదలయిన కాసేపు ఒక అత్యుత్తమ సినిమా చూస్తున్న భావన మనలో కలుగ చేసి సినిమా చివరకు చేరేతాప్పటికి అదే భావాన్ని ప్రేక్షకులలో నిలుపలేకపోతాడు.

 ఈయనే దర్శకత్వం వహించిన 28 weeks later అనే సినిమా కూడ త్వరలో మనముందుకి రాబోతుంది.నా దృష్టిలో ఈయన రూపొందించిన Trainspotting ఇప్పటి వరకు వచ్చిన ఈయన సినిమాల్లో అత్యుత్తమమైనధి. ఇంగ్లాండు లోని 3 mills స్టూడియో (ఇదే స్టూడియో లో రెండేల్ల క్రితం నేనొక లఘు సినిమా రూపొందించాను. ఏడిశినట్టుంటుంది. అయినా అది వేరే విషయం. )లో నిర్మింపబడ్డ ఈ సినిమా హాలీవుడ్ సినిమాల స్థాయిలో special effects తో తప్పక చూడదగ్గ సినిమా! Dont miss it!