Aadavaari maatalaku

by admin@ 24fps

 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

ఆదివారం, సమయం మధ్యాహ్నం రెండు గంటలు దాటి పది నిమిషాలయింది.

జూన్ నెల కావడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. షాపింగ్ చేసేవాళ్ళు, సరదాగా సినిమాకని బయల్దేరిన వాళ్ళు, ఏమీ తోయక బైకు లెక్కి ఊరున పడ్డవాళ్ళతో రోడ్లన్నీ నిండిపోయి ట్రాఫిక్ ఎప్పటిలానే గందరగోళంగా ఉంది.

ఆభిమన్యుడు పద్మవ్యూహాన్ని చేధించినట్లు, మూసాపేట ఫ్లైఓవర్ దగ్గర ట్రాఫిక్ జామ్ ను చేధించడానికి సతమతమవుతూ తన పరిస్థితికి కారణమయిన తన భార్యను గట్టిగానే నిందించసాగాడు సుకుమార్.స్కూటరు వెనుక సీట్లో కూర్చున్న అతని భార్య పద్మావతికి అతని మాటలేవి వినరాలేదు. సుకుమార్ నోట్లో నుండి ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తున్న నిందలన్నీ చెవులు బద్దలయ్యేలా మ్రోగుతున్న హారన్ మ్రోతల్లో కలిసిపోయయి.

గత రెండు రోజులుగా అదే పనిగా హైదరాబాదు సందుగొందులన్నితిరిగి తిరిగి అలసిపోయి కాసేపు సేదతీరుదామని సుకుమార్ మనసులో వున్నా, మరోవారంరోజుల్లో కొత్త ఇంట్లోకి మారకపోతే రోడ్డునపడ్తామన్న ఆలోచన అతని మనసులో తూనీగలా రొదపెడ్తుండడంతో తన ఆలోచనలకు స్వస్తి చెప్పి నత్తనడకలా సాగుతున్న ట్రాఫిక్ ప్రవాహం నుండి బయటపడే మార్గం వెతకసాగాడు. ఇదంతా ఏమీపట్టని పద్మావతి,తలని చీరకొంగుతో కప్పుకుని,పెట్ బాటిల్ నుండి పెప్సి తాగుతూ,తాము త్వరలో చేరబోయే కొత్త ఇంటిగురించి పగటి కలల్లో మునిగిపోయింది.

మూసాపేట్ నుండి రెండు కిలోమీటర్ల దూరమయినా లేని వివేకానందనగర్ చేరుకోడానికి సుకుమార్ కి మరో అరగంటపైగా పట్టింది. గంటకు పైగా ట్రాఫిక్ లో చిక్కుకుపోయి విసుగుతో వేసారిపోయిన సుకుమార్ రోడ్డుపక్కగా చెట్టుకింద స్కూటరాపి సిగరెట్టు వెలిగించాడు. ఇల్లు చూద్దామన్న ఆత్రుతతో ఎదురుచూస్తున్న పద్మావతికి తాపీగా సిగరెట్టు కాలుస్తున్న సుకుమార్ ని చూసి వళ్ళుమండిపోయింది. "పది నిమిషాలు ఓపిక పట్టలేరా? మా ఇంట్లో పొగత్రాగబడును అని ఇంటి ఓనర్ కి మీ సిగరెట్టు కంపుతో ముందుగానే ప్రకటించేయాలా?" అని చిర్రుబుర్రులాడింది. భార్య మాటలకి సమాధానం చెప్పాలన్న ఎటువంటి ఆసక్తి ప్రదర్శించకుండా తాపీగా మరో దమ్ము పీల్చి వదిలాడు సుకుమార్. తన ప్రశ్నలకు సమాధానమివ్వకుండా తన పనిలో తాను నిమగ్నమైపోయిన భర్తను చూసి రోషంగా పెప్సిబాటిల్ మూతతీసి ఒక్క గుటకలో ఖాళీ చేసి ధీర్ఘంగా ఊపిరి పీల్చింది పద్మావతి.

పెళ్ళయి పూర్తిగా రెండేళ్ళయినా కాని ఆ దంపతులు సమకాలీన సంబంధబాంధవ్యాలకు ఒక చక్కని ఉదాహరణ. పుట్టిన ప్రతి వ్యక్తి పెళ్ళి చేసుకు తీరాలని ఎక్కడ రాశారో ఏమో గాని, ఇలాంటి భార్యాభర్తలను చూస్తే అసలు పెళ్ళి అనే పదానికి అర్ధమేంటో? అనిపిస్తుంది.

పెళ్ళంటే నూరేళ్ళపంటని ఏవరో రాసేసి చేతులు దులిపేసుకొన్నప్పటికి నిజానికి పెళ్ళనే నావను సంసార సాగరంలో ఒడిదుడుకులు లేకుండా నడపడం చాలా కష్టం.గొడవలు, చిర్రుబుర్రులాటలు, రోషాలు, ఉక్రోషాలు సహజం. కానీ వీరిద్దరి సంగతి వేరు. రోడ్డు లో బైకు పై వెల్తున్నప్పుడు అక్కడక్కడా స్పీడ్ బ్రేకర్లుండడం సహజం. కానీ అడుగడుక్కీ స్పీడ్ బ్రేకర్లున్న రోడ్డుపై ప్రయాణం ఎంతటి నరకప్రాయమో కదా! సరిగ్గా అలాంటి జీవన పయనమే వీరిద్దరిది.

ఎదో వానాకాలపు చదువు చదివిన సుకుమార్ ఎమ్సెట్ పరీక్షల్లో అర్హత కూడ సాధించక పోవడంతో డొనేషన్ కట్టి కర్ణాటకలో ఇంజనీరింగ్ చదివించారు ఇంట్లోవాళ్ళు. నాలుగేళ్ళ కోర్సుని ఐదేళ్ళలో ముగించి,గాలికి తిరుగుతున్న సుకుమార్ కి సాఫ్ట్ వేర్ పుణ్యమా అని ఒక ఉద్యోగం దొరికింది. ఉద్యోగంలో చేరిన మొదటి రోజునుండే అతన్ని పెళ్ళిళ్ళ మార్కెట్లో అమ్మకానికి పెట్టారు ఇంట్లోవాళ్ళు. ఉద్యోగం ఇచ్చిన ఆర్థి క స్వాతంత్ర్యం, సందుకొకటిగా వెలసిన క్లబ్బులు, డ్యాన్స్ బార్లు అందించే సుఖసంతోషాలని వదులుకోవడం ఇష్టం లేకపోయినా, ఇంట్లో వారి బలవంతం కొద్ది పద్మావతి మెడలో తాళి కట్టేశాడు సుకుమార్. తప్పెవరిదని విచారించడం కష్టంగాని, పెళ్ళయిన మొదటి రోజు నుండి వారిద్దరి మధ్యా పొట్లాటలు, పొరపచ్చాలే తప్ప ముద్దు ముచ్చట్లకు తావులేకుండాపోయింది. అంతమాత్రాన వారిద్దరూ సుఖసంతోషలకు దూరమయ్యారనుకుంటే పొరపాటే! ఆనందదాయకమైన జీవితంకొరకు వారి మార్గాలను వారేన్నుకున్నారు.

గత రెండేళ్ళగా అద్దెకుంటున్ని ఫ్లాటుని రెండు నెలళ్ళో ఖాళీ చేయాలన్న వార్త వారిగుండెల్లో గుబులు పుట్టించింది. రియల్ ఎస్టేట్ ధరలు రెక్కలు కట్టుకుని ఆకాశాన్నంటటంతో సొంత ఇంటి ఆలోచనకు స్వస్తిచెప్పి మరో అద్దె ఇంటికోసం రెండు నెలలుగా అన్వేషిస్తున్నప్పటికీ ఇద్దరికీ నచ్చిన ఇళ్ళు దొరక్క రోడ్డున పడ్డారు వారిద్దరూ. అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ససేమిరా వద్దని మొరాయించుకు కూర్చున్న పద్మావతి మొండిపట్టు మూలాన దొరికిన ప్రతి ఇంటిని కాదని మరో ఇంటికోసం వెతకడం, పద్మావతి వద్దనడం, సుకుమార్కి చిర్రెత్తడం మామూలయిపోయింది.

ఎటు చూసినా అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లతో నిండిపోయిన హైదరాబాదు మహానగరంలో స్వేఛ్ఛగా ఉండే ఇండిపెండెట్ హౌస్ దొరకడం ఎంతకష్టమో తెలిసినప్పటికి, పేపర్ళొ చూసిన ప్రకటన పట్టుకుని ఊరికి ఆ చివరున్న దిల్ సుఖ్ నగర్ నుండి , ఊరికి ఈ చివరున్న వివేకానందనగర్లో ఉన్న ఇంటిని చూడ్డానికి బయల్దేరారు. పద్మావతి ప్రతి మాటకు ఎదురు చెప్పే సుకుమార్ ఈ ఒక్క విషయంలో మాత్రం తన పట్టు కాస్తా సడలించాడు. అందుకు కారణం ఆమె మీద ప్రేమ మాత్రం కాదు. ప్రతి రోజు దిల్ సుఖ్ నగర్ నుండి హైటెక్ సిటి కి ప్రయాణం చేయలేక విసిగిపోయిఉన్న అతనికి వివేకానందనగర్లో ఇళ్ళంటే మనసు కాస్త ఊరట చెందింనమాట నిజమే ! కానీ వారనుకున్న ఇళ్ళు అద్దెకు దొరుకుతుందో లేదో అన్న ఆలోచనల్లో మునిగిపోయిన సుకుమార్ , పద్మావతి కసురుగా "ఇంక వెల్దామా?" అన్న మాటలకు ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు. స్టాండు తీసి ఖాళీగా ఉన్న వివేకానందనగర రోడ్డుపై స్కూటర్ని వేగంగా పరిగెత్తించాడు.

* * * * * * * * * *

ఇంటి ముందు విశాలమైన పూల తోట. ఇంటి చుట్టూ గుబురుగా పెరిగిన చెట్లు. కాలుష్యానికి ,ట్రాఫిక్ రణగొణులకు దూరంగా వున్న విశాలమైన రెండతస్తుల భవనాన్ని చూడగానే హైదరాబాదు లో ఇంకా ఇలాంటి ఇళ్ళున్నాయా అని సుకుమార్ కి అనుమానం కలిగింది.

"ఎంత అద్దైన సరే ఈ ఇంట్లోనే అద్దెకు దిగుదామండీ!" అని ఆత్రుతగా తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చింది పద్మావతి.

"ఎంత అద్దైనా ఫర్వలేదా? నీదేంపోయిందిలే, చెమటోర్చి సంపాదించేది నేను కదా?" అని సమాధానం చెప్పాలని సుకుమార్ మనసులో ఉన్నా ఇంటి ఓనర్ ని కలిసే ముందు మూడ్ పాడుచేసుకోవడం ఇష్టం లేక మౌనంగానే ఉండిపోయాడు. ఆ ఇంటి గేటు వద్ద నిల్చోని 'కుక్కలున్నాయి జాగ్రత్త' అన్న బోర్డులేవి లేకపోవడంతో హాయిగా ఊపిరి పీల్చుకొని, చుట్టూరా పరిశరాలనొకసారి పరిశీలించి కాలింగ్ బెల్ బటన్ నొక్కాడు.

రెండు నిమిషాల పాటు ఎటువంటి సమాధానం లేకపోవడంతో అసహనంగా మరోసారి కాలింగ్ బెల్ నొక్కబోయేంతలో ఒక మధ్యవయస్కుడు ఇంటి తలుపులు తెరుచుకొని బయటకు వచ్చాడు. ఒక చేతిలో వార్తాపత్రిక, మరో చేతిలో సిగరెట్టుతో, మిలిటరి మేజర్లా పెద్దమీసాలతో ఉన్న ఆ వ్యక్తి గేటు వద్దకు వచ్చి ఎవరు కావలంటూ కళ్ళతోనే సైగచేశాడు. కరుకైన రూపం, చురుకైన దృష్టి కలిగిన ఆ వ్యక్తిని చూసి సుకుమార్ కాస్తా కంగారు పడీపోయి నోటమాటలేకుండా నిల్చుండీపోయాడు.

సమాధానం చెప్పకుండా బొమ్మలా నిలబడ్డ సుకుమార్ ని ఒక సారి కిందకూ పైకి పరిశీలనగా చూసి 'ఇల్లు అద్దెకుందని పేపర లో ప్రకటన చూసివచ్చాం' అని పద్మావతి హడవుడీగా చెప్పింది. "రెంటు ఏడువేలు.మొదటి అంతస్తులో ఇల్లు. ఇష్టమైతే లోపలికి రండీ. లేదంటే వెళ్ళిపోండి. అనవసరంగా ఇద్దరి సమయం వృధాకాకుండా వుంటుంది" అన్నాడా వ్యక్తి.

కనీసం ఇంటిలోపలికైనా అడుగుపెట్టనివ్వకుండా కఠినంగా మాట్లాడుతున్న ఇంటి ఓనర్ పై పీకలదాకా కోపమొచ్చింది సుకుమార్ కి. ఏడువేలంటే కాస్త ఏక్కువే గానీ, ప్రతి రోజు పెట్రోలు ద్వారా ఆదా అయ్యే డబ్బులు, వారాంతరాల్లో షాపింగ్,షికార్లకై చేసే ప్రయాణాలు, అన్నింటికీ మించి ఆదా అయ్యే సమయాన్ని కలుపుకుంటే ఇప్పుడు తాముంటున్న ఇరుకు ఇంటికంటే ఈ ఇల్లే మేలని నిమిషంలో లెక్కకట్టేశాడు.

"ఇళ్ళు మంచిగా ఉండాలి గానీ అద్దె కొంచెం ఏక్కువైనా ఫర్వాలేదండీ!" అని లేని నవ్వు తెచ్చిపెట్టుకుని సమాధానం చెప్పడు సుకుమార్.

"అలా ఐతే మీ కోసం అద్దె మరో వెయ్యి పెంచుతానులెండి" అని సమాధానం చెప్పిన ఆ వ్యక్తి వైపు హడలిపోయి అదోలా చూశారు ఆ భార్యాభర్తలిద్దరు.

అయ్యో మరీ అలా భయపడీపోకండి. సరదాగా జోక్ చేశానంతే!" అంటూ గేటు తెరిచి ఇంట్లోకి రమ్మని ఆహ్వానం పలికాడు.తమ అదృష్టం బాగానే ఉందని కాబోలు సుకుమర్, పద్మావతిలిద్దరూ ఒకర్నొకరు చూసుకొని చిరునవ్వులు చిందించారు. నిజానికి వారిద్దరూ ఒకే విషయం గురించి సంఘీభావంగా చిరునవ్వులు చిందించడం చాలా అరుదు. కాసేపు కోపంగాను, ఇంతలోనే జోకులేస్తూ సరదాగాను మాట్లాడే ఇంటి ఓనర్ తనని తాను లోకనాధంగా పరిచయం చేసుకున్నాడు.

ఇంటిలోకి అడుగుపెట్టగానే సుకుమార్ కి ఎంతో ఆనందం కలిగింది.క్రమంగా సర్దిన కప్ బోర్డులు, ఒక పధ్ధతి ప్రకారం అమర్చిన సామాగ్రి తో ఇల్లంతా ఎంతో బావుంది. ఇంటి నిండా ఉన్న ఆధునిక సామాగ్రి మంచి అభిరుచి గలవారెవరో ఎంపిక చేసినట్టుగా తెలిసిపోతుంది.టెలివిజన్ రిపోర్టర గా వారానికి నాలుగు రోజుల పాటు లొకమంతా తిరిగే లోకనాధానికి అంత ఓపిక ఉండక పోవచ్చు.నలభై కి తక్కువగానే వయసున్న లోకనాధానికి అంతటి అభిరుచి కలిగిన పిల్లలుండే అవకాశంలేదు.అలాంటి పరిస్థితుల్లో ఆ ఇంటిని అంత చక్కగా రూపుదిద్దిన ప్రతిభ కేవలం లోకనాధం భార్యదే అయ్యుండొచ్చని నిర్ణయించేశాడు సుకుమార్.

షుమారు గంటకు పైగా ఇంటి నలుమూలలా తిప్పి చూపించి, వాస్తు గురించి, మొక్కల పెంపకం గురించి, టెలివిజన్ రిపోర్టర్ గా తన ఉద్యోగం గురించి ఇంటి లో అద్దెకు దిగితే పాటించవలసిన నియమనిబంధనల గురించి లోకనాధం తన పాటికి తాను మాట్లాడుతున్నా సుకుమార్ మనసు మాత్రం వేరెక్కడో ఉంది .

ఇంటిని చూడు, ఇల్లాలిని చూడు అన్న పెద్దలమాటను అమలుపరిచే దిశలో , ఇంటిని చూసాడుకాని, ఇల్లాలిని చూడడానికి ఆత్రుతపడసాగాడు. లోకనాధం మాటలు , సుకుమార్ ఆలోచనలు ఏ మాత్రం పట్టించుకోకుండా, ఉన్న రెండు బెడ్ రూమ్ లలో ఏ రూమయితే తనకు అనుకూలంగా వుంటుందో అన్న తర్జన భర్జనల్లో పడిపోయింది పద్మావతి. తమతమలోకాల్లో మునిగిపోయిన ఆ ముగ్గురువ్యక్తులను తిరిగి ఈ లోకానికి తెచ్చిపడేసింది ఒక శ్రావ్యమైన పిలుపు.

"ఏమండీ! కాఫీ తేవాలా?" అంటు పై అంతస్తు తలుపు దగ్గరనిలబడ్డ ఒక స్త్రీ ని చూడగానే సుకుమార్ కి అర్థమైపోయింది, ఆమె ఖచ్చితంగా లోకనాధం భార్య అని.

లోకనాధం భార్య స్వాతి మరీ ఐశ్వర్యారాయంత అందగత్తె కాదుగాని, 35-40 మధ్య వయసులో మంచి రూపురేఖలతో చూడచక్కగా ఉంటుంది.తన అంచనాలకు తగ్గట్టుగానే అమె అందంగా ఉండడంతో తననుకున్నది నిజమేనని గర్వపడ్డాడు. తన భార్య కూడా స్వాతిలా అందంగానే ఉన్నా, ఆమెలా ఇల్లెందుకు సర్దుకోదో అర్దం కాక మరో వైపు దిగులుపడీపోయాడు.

స్వాతి తెచ్చిన కాఫీలు తాగి, రెండు నెలల అడ్వాన్స్ చెల్లించేసి మరో వారం రోజుల్లో కొత్తింట్లోకి మారుదామని నిర్ణయం చేసుకుని ఎక్కడ లేని ఉత్సాహంతో బయల్దేరారు సుకుమార్, పద్మావతులు. ఎప్పటిలాగానే ట్రాఫిక రద్దీ ఏక్కువగానే ఉన్నా, కొత్త ఇల్లు దొరికినఉత్సాహమో ఏమోగాని చిరునవ్వులు చిలికిస్తూ తమ పాతఇంటికి చేరుకున్నారా దంపతులు.

ఆ రాత్రి సుకుమార్ లోకనాధం భార్య స్వాతి గురించి కలకన్నాడు.సాధారణంగా రాత్రుల్లు చాలా సేపటి వరకు నిద్రపట్టని పద్మావతి ఆ రోజు హాయిగా నిద్రపోయింది.

* * * * * * * * * *

వారం రోజులుగా సామాన్ల ప్యాకింగ్, ఇల్లు షిఫ్టింగంటూ అలసిపోయిన సుకుమార్ కొత్తింట్లో అడుగుపెట్టిన మొదటిరోజు రాత్రి హాయిగా నిద్రపోయాడు. తర్వాత రోజు ఆదివారం కావడంతో ఉదయం పదకొండు వరకూ బెడ్ మీదనే పడుకొని బద్దకంగా దొర్లసాగాడు.

'గల గల పారుతున్న గోదారిలా' అంటూ 'పోకిరి' రింగ్ టోన్ తో మోగిన పద్మావతి సెల్ ఫోన్ రింగుకు పూర్తిగా మేలుకోన్నడు సుకుమార్. బెడ్ మీదనుంచి లేసి పద్మావతి గదిలోకొకసారి తొంగి చూశాడు. ఎవర్తోనో ఫోన్లో మాట్లాడుతున్న పద్మావతి, "ఏంకావాలి?" అన్నట్టుగా చేతితో సైగ చేసింది. సమాధానం చెప్పకుండా కిచెన్ వైపు బయల్దేరాడు. చెల్లాచెదరుగా పడేసిఉన్న కిచెన్ సామాగ్రి వైపోసారి చూసి పద్మావతిని మనసులోనే నిందించాడు. పది నిమిషాలపాటు వెతికి కష్టపడీ బ్రూ కాఫి కలుపుకోని బాల్కనిలోకి వచ్చి నిలబడ్డాడు.

అంతవరకు భార్యను మనసులోనే తిట్టుకుంటూ మూతిముడుచుకున్న సుకుమార్ మొహం,ఇంటి బయట నిల్చుని చెట్లకు నీళ్ళు పడ్తూ తనకేసి చూసి చిరునవ్వు నవ్విన స్వాతిని చూసి వెయ్యివాట్ల బల్బులా వెలిగిపోయింది . సుకుమార్ చాలాసేపటివరకు ఆమెనే చూస్తు ఉండీపోయాడు .అసలే మాత్రం పరిచయంలేని ఇంటిఓనర్ భార్యను అలా చూడడం తప్పని మనసొక వైపు ఉచిత సలహాలను మెదడుకి చేరవేస్తున్నప్పటికీ తను చేస్తున్నదాంట్లో తప్పేమీ లేదని సమాధనపరుచుకున్నాడు.

సుకుమార్ తీక్షణమైన చూపులు స్వాతికి గుచ్చుకున్నాయో ఏమో గాని ,మరో సారి తల తిప్పి వెనక్కు చూసి సుకుమార్ వైపు మరో చిరునవ్వు విసిరేసి తనపని లో తాను నిమగ్నమైపోయింది. తమిద్దరిలాగే లోకనాధం , స్వాతి లు కూడా రోజూ గొడవలు పెట్టుకొనే రకమేనా? లేక వారిద్దరు అన్యోన్య దాంపత్యానికి ఒక అత్యుత్తమ ఉదాహరణా? అన్న మీమాంస కలిగింది సుకుమార్ కి.

ఫోన్లో ముచ్చట్లాడటం ముగించిన పద్మావతి బాల్కనీకి చేరి, అక్కడ గుడ్లప్పగించి చూస్తున్న సుకుమార్ నుద్దేశించి "అలా గుడ్లప్పగించి చూడడడమేనా? లేక ఇల్లు సర్దేదేమైనాఉందా?" కోపంగా అంది. పద్మావతి మాటలకు ఈ లోకంలోకి వచ్చిపడ్డ సుకుమార్ తన ఆలోచనలకు భగ్నం కలిగించిన భార్యను లోపల్లోపలే తిట్టుకుంటూ ఇల్లు సర్దే పనిలో నిమగ్నమైపోయాడు.

సోమవారం ఉదయాన్నే లేచి బద్ధకంగా ఆఫీసుకు బయల్దేరిన సుకుమార్ కి బయట లాన్లో కూర్చుని కాఫీ తాగుతున్న స్వాతి కనిపించింది. ఆమెను చూడగానే అతని మొహంపై ఒక చిరునవ్వు ప్రత్యక్షమైంది. ఆ రోజు మొదల్కొని కనిపించినప్పుడల్లా తనను చూసి నవ్వే స్వాతి, పద్మావతి ని చూసి మాత్రం అంతగా సరదాగా ఉండకపోవడం గమనించాడు సుకుమార్.

ఇద్దరు అందమైన ఆడవాల్ల మధ్య సామాన్యంగానే ఉండే ఈర్ష్యాసుయలే అందుకు కారణమై ఉండొచ్చొని అనుకున్నాడు.ఏదేమైనప్పటికీ స్వాతి తన మీద ప్రత్యేకమైన అభిమానం చూపిస్తుందని మాత్రం సుకుమార్కి నమ్మకం కలిగింది.

* * * * * * * *

సుకుమార్ వాళ్ళు కొత్త ఇంట్లో చేరి నెలపైగానే అయిపోయింది. ఎప్పట్లాగానే పద్మావతి సుకుమార్ లు గొడవలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. వారానికొక కొత్త చీర కొంటూ తన డబ్బంతా కాజేస్తుందని సుకుమార్ చేసిన ఫిర్యదుకి , తన ఇంట్లో వారిచ్చిన కట్నం డబ్బులు తన ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెట్టే అర్హత తనకుందని గొడవపెట్టుకోవడం వారి జీవితంలోని తాజా సమాచారం.

ఒక రోజు సాయంత్రం సూపర్ మార్కెట్లో సామానులు కొంటున్న సుకుమార్ తో మాట మాట కలిపి పరిచయం పెంచుకునే ప్రయత్నం చేసింది స్వాతి. ఇంటి ఓనర్ భార్యతో చనువుగా మెలగడం ఎక్కడికి దారి తీస్తుందో అన్న భయం లోలోపల కలిగినా, ఆమే చనువు తీసుకోవడంతో సరదాగా మట్లాడడం మొదలుపెట్టాడు.

నెలలో సగం రోజులకు పైగా ఇంటికి దూరంగా ఉండే తన భర్త గురించి, రోజంతా పుస్తకాలు చదివే తన అలవాటు గురించి, ఇంకా తనకెలాంటి సినిమాలు ఇష్టమో, ఎలాంటి వంటలు ఐష్టమో అని గడగడ తన వ్యక్తిగత విషయాలను చెప్పిడంతో ఆపకుండా, సుకుమార్ ని అతని ఉద్యోగం గురించి అడిగి తెలుసుకోవటమే కాకుండ, "పద్మావతితో కూడా ఏదో ఒక ఉద్యోగం చేపించొచ్చు కదా!" అని సలహా ఇచ్చింది.

తనతో ఫ్రెండ్లీ గా ఉంటున్నంతమాత్రాన స్వాతి కి తనపై ఇష్టముందని ఖచ్చితంగా నిర్ణయించుకోలేక పోయాడు సుకుమార్. మామూలుగా దారిలో ఎదురైనప్పుడు సరదాగా మాట్లాడే స్వాతి ఒక రోజు ఏకంగా సుకుమార్ ఫోన్ నంబర్ కావాలని అడిగింది. ఫోను నంబరు తీసుకున్న వారం రోజుల తర్వాత ఒక రోజు ఆఫీసుకు ఫోన్ చేసి పొడిగా నాలుగు మాటలు మాట్లాడీ పెట్టేసింది స్వాతి.

ఆ రోజు నుంచి రెండు రోజులకొక సారైనా ఆఫీసుకు ఫోన్ చేయడం, ఏదో చెప్పాలని తటపటాయించడం, గట్టిగా అడిగితే ఏమీలేదని మాటదాటేయడం చేస్తున్న స్వాతి చేష్ఠలకు కారణం తనపై ఆమె పెంచుకుంటున్న ప్రేమేనని పక్కాగా నిర్ణయించేసుకున్నాడు. ఒక రోజు ఆఫీసు పనితో బాగా అలసిపోయి ఇంటికి చేరిన సుకుమార్ కి నిద్రలో ఒక కల వచ్చింది. ఉదయాన్నే నిద్రలేచిన సుకుమార్ కి కలంతా గుర్తులేదు గాని కలలో స్వాతి నవ్విన నవ్వులే పదేపదే గుర్తొచ్చి కొంచెం తికమక పడిపోయాడు.తనకు తెలియకుండానే స్వాతిపై మనసులో అభిమానాన్ని పెంచుకుంటున్నాడని అర్థమైపోయింది. చాలా రోజులుగా తన ఆఫీసు రిసెప్సనిస్టు పై కన్నేసిన సుకుమార్ స్వాతి పరిచయమైన దగ్గర్నుంచి ఆ మాటే మర్చిపోయాడు.అతనికి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా తుళ్ళిపడీ నవ్వుతున్నస్వాతి ముఖమే గుర్తొస్తోంది. బంగారంరంగు లో మేరిసిపోయే అమె మేని ఛాయ, విరబూసినా పుష్పాల్లాంటి కళ్ళు, పొడుగాటి మెడ, గులాబీరంగు అధరాలు అతని కళ్ళముందు ప్రత్యక్షమై ఇంతలోనే మాయమవుతుంటే తట్టుకోలేకపోయాడు. త్వరలో ఏదో ఒకటి చేసి తాడో పెడో తేల్చేసుకోవాలనుకున్నాడు. సరైన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు.

* * * * * * * * * *

ఆఫీసు పనిలో నిమగ్నమైపోయిఉన్నసుకుమార్ కి ఒక రోజు పద్మావతి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కొత్తగా రిలీజయిన సినిమా చూడ్డానికి వెళ్తుందని, ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని ఆ ఫోన్ కాల్ యొక్క సారాంశం. మామూలు రోజుల్లో ఐతే ఆ వార్త విని సుకుమార్ చాలా గొడవే చేసుండేవాడేకానీ ఆ రోజు సంతోషంగానే అనుమతి ప్రకటించేశాడు. సాధారణ విషయానికే నానా రాధ్ధాంతం చేశే తన భర్త అంత సులభంగా ఒప్పుకున్నందుకు ఆనందంగా సినిమాకి బయల్దేరింది పద్మావతి.

ఆఫిసులో పనులన్ని త్వరగా ముగించుకొని ఇంటి వైపు బయల్దేరాడు సుకుమార్ . వడి వడీ గా ఇంటికి చేరుకొని పద్మావతి ఇంట్లో లేదని మరో సారి ధృపీకరించుకొని తన పథకంలోని మొదటి భాగాన్ని పూర్తి చేశాడు.పూర్వం కాలేజి రోజుల్లో హాస్టల్లో కరెంటు పోగొట్టడానికి ఉపయోగించిన పాత చిట్కానొకదాన్ని ఉపయోగించి తమ ఇంట్లో కరెంటు పోగట్టగలిగాడు. తమ వాటా మెయిన స్విచ్ కూడా కింది వాటాలోనే ఉండడం, సమయానికి లోకనాధం ఊర్లో లేకపోవడం, అన్నింటికీ మించి పద్మావతి సినిమాకు వెళ్ళడం సుకుమార్ కి బాగా కలిసొచ్చాయి. తన ఇంట్లో కరెంటు పోయిందన్న నెపంతో కింది పోర్షన బెల్ నొక్కాడు సుకుమార్. మా ఆయన ఇంట్లో లేరనో, మరేదో కారణం చెప్పి తనని ఇంట్లోకి రానివ్వదేమోనన్న భయం కాస్తా క్షణాల్లో మాయమైంది సుకుమార్ కి. తనని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించడమే కాకుండా దగ్గరుండి మరీ అతనికిఫ్యూజు వేయడంలో సహాయం చేసింది స్వాతి.

ఆమెకు దగ్గర్లో నిలబడి ఆమ అందాన్ని ఆశ్వాదిస్తున్నా ఆమె ఎటువంటి ఆభ్యంతరం చెప్పకుండా వుండడంతో తనంటే స్వాతికి ఇష్టమన్న నమ్మకం కలిగింది. 'టీ తాగుతారా? భోజనం చేస్తారా? కనీసం కాఫీ ఐనా తాగుతారా?' అంటూ ఒకటికి నాలుగు సార్లు అడగడమే కాకుండా, "మీ భార్య నొక్కదాన్నే సినిమాకి పంపించారా? మీకు సినిమాలు ఇష్టం ఉండవా?" అన్న ప్రశ్నలతో స్వంతవిషయాల గురించి ఆడుగుతూనే, 'మా ఆయనకి సినిమాలకు, షికార్లకు టైముండదు. నాకేమో ఒక్కదానికీ వెళ్ళడం ఇష్టముండదు" అని ఆమె గురించి కూడా గడాగడా చెప్పేసింది స్వాతి.

"మీరేం దిగులు పడకండి, ఈ సారి మంచి సినిమా ఏదైనా చూడాలనిపిస్తే చెప్పండి, నేను దగ్గరుండి తీసుకెల్తాను" అని చెప్పి స్వాతి మొహంలో స్పందన కోసం ఏదురుచూశాడు. ఆమె ముఖంలో ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో, ఎందుకైనా మంచిదని "అఫ్కోర్స్ మనతోపాటు పద్మావతి కూడా వస్తుందనుకోండి" అని చెప్పి తన మాటల్లో వేరే అర్థమేమిలేనట్టుగా మాట మార్చేశాడు సుకుమార్. ఫస్ట షో సినిమా చూసి రాత్రి పదిన్నరకి ఇంటికి వచ్చిన పద్మావతి పై తన కోపాన్నంతా వెళ్ళగక్కాలని ప్రయత్నించాడు సుకుమార్.

కానీ ఇంటికి తిరిగి వస్తూ తన కిష్టమైన హైదరాబాది బిర్యాని పార్శిల్ చేపించుకు రావడమే కాకుండా దగ్గరుండి మరీ వడ్డించిన తన భార్యపై జాలి,ప్రేమలతో పాటు, నేరం చేస్తున్ననేమో నన్న పాపసంవేదనలతో కూడిన భావం సుకుమార్ మనసులో కలగడం మూలాన నిశ్శబ్దంగా బిర్యాని తిని నిద్రకుపక్రమించాడు. ఆ రాత్రి ఇద్దరు హీరోయిన్లతో పాటపాడుతూ, డ్యాన్స్ చేస్తున్నట్టుగా కలకన్నాడు సుకుమార్.

స్వాతి గురించి కలలు కనడం తప్పితే నిజజీవితంలో ఎటువంటి ఫలితాలు పొందలేక పోయిన సుకుమార్ కి రోజులు భారంగా గడవసాగాయి.ఒక వైపు పద్మావతి ఎక్కడలేని ప్రేమనంతా ఒలకబోయసాగింది. మరో వైపు స్వాతితో పరిచయం రోజు రోజు కి అభివృధ్ధి చెందసాగింది. ఎప్పుడూ లేని విధంగా ఆమె తనపై ప్రేమను కురిపించడంలో అర్థమేమిటో తెలియరాక ఒక వైపు, స్వాతి పై తనకున్న ప్రేమను ఎలా తెలియచేయలో తెలియక మరో వైపు మదనపడిపోసాగాడు.

తన సంధిగ్దావస్థను ఎవరి దగ్గరైనా వెల్లగక్కుకొని మనసులోని భారాన్ని తగ్గించుకుందామంటే తన బాధలు, సమస్యలు వేరొకరికి చెప్పుకునేంతటి నీతివంతమైనవి కావని తనకు బాగా తెలుసు. తన విషయాన్ని ఎవరికైన చెప్తే సానుభూతి చూపించడం కాదు కదా, తన నీతిమాలిన తనానికి నీచంగా అవమానిస్తారేమో అని అనుమానపడ్డాడు.

ఒక రోజు ఉదయాన్నే లేచి ఆఫీసుకి బయల్దేరిన సుకుమార్ కి సూపర్ మార్కెట్ నుంచి సామాన్లేవో కొనుక్కొని ఇంటికి తిరిగివస్తున్న స్వాతి ఎదురుపడీంది. ఆఫీసుకి లేటయ్యిందన్న హడవుడిలో ఆమెను చూసీచూడనట్టుగా ఒక చిరునవ్వు చిందంచి స్కూటర్ ని వేగంగా పోనిస్తుండగా "సుకుమార్" అన్న పిలుపు వినబడి సడన్ బ్రెక్ వేసి వెనక్కితిరిగాడు. దూరంగా నిలబడి తనవైపే చూస్తున్న స్వాతిని చూసి స్కూటర్ ని వెనక్కి మళ్ళించాడు.

ఆఫీసుకి లేటుగా వెళ్ళినందుకు తన మేనేజర్ కి ఏ సాకులు చెప్పాలో అలోచిస్తూనే, స్వాతి తననెందుకు పిలిచిందో అన్న అనుమానంతో ఆమె దగ్గరకు చేరుకుని స్కూటర్ని రోడ్డుపక్కగా ఆపి ఒక చిరునవ్వు చిందించాడు. "ఆఫీసుకి లేటయింది, అందుకే మిమ్మల్ని సరిగా గమనించలేదు. ఏమి అనుకోకండి" అని సంజాయషీ చెప్పుకున్నాడు. "అయ్యో అనవసరంగా నా వల్ల మీకు మరింత లెటవుతుందేమో! మీరు వెళ్ళండి మనం సాయంత్రం కూడ మాట్లాఆడవచ్చు" అంది స్వాతి.

"రోజూ ఉండే ఆఫీసే లెండి. మీరేం చెప్పలనుకున్నారో చెప్పండి" అన్నాడు సుకుమార్. "సరిగ్గ అదే విషయం చెప్దామనే నేనూ మిమ్మల్ని ఆపింది" అర్థం కానట్టుగా మొహం పెట్టాడు సుకుమార్. "మీరీ కొత్తింట్లోకొచ్చి షుమారు మూడు నెలలు దాటిపోయింది. కనీసం ఒక్కరోజైన మీరు శెలవుపెట్టడం చూడలేదు. రోజూ ఉండే ఆఫీసే గదా ఒక రోజు శెలవుపెట్టి హాయిగా ఇంట్లొ గడపొచ్చు గదా?" అంది స్వాతి. ఆ మాటలు విన్న సుకుమార్ షాక తిన్నాడు.

 శెలవు పెట్టి ఇంట్లో ఉండమని చెప్పి పరోక్షంగా తన మనసులోని మాటను బయట పెట్టేసిందని అర్థం చేసుకున్నాడు సుకుమార్ .ఆ తర్వాత ఆమె మాట్లాడిన మాటలేవి అతని చెవికి చేరలేదు.ఆమె తన ఉద్దేశాన్ని అంత స్పష్ఠంగా చెప్తున్నా కూడా తను అనవసరంగా కాలయాపన చేస్తూ అందిన అవకాశం చేజార్చుకుంతున్నాడేమో అనిపించింది.

 ఆ రోజు సుకుమార్ ఆఫీసయితే వెళ్ళాడు గాని అతని మనసు మనసులో లేదు.స్వాతి తనతో మాట్లాడిన మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తుండగా పని చేసే మూడ్ లేక సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకున్నాడు. ఉదయంనుంచి స్వాతిని చూడాలని తపించిపోతున్న సుకుమార్ కి ఇంటిబయట లాన్ లో కుర్చీ లో కూర్చున్న స్వాతి చిరునవ్వు తో స్వాగతం పలికింది.

ఆ రోజు మొదలు దాదాపుగా ప్రతి రోజు ఏదో ఒక సాకుతో మాట్లాడడం మొదలుపెట్టింది స్వాతి .ఇంట్లొ కరెంటు తీసేసి స్వాతితో పరిచయాన్నయితే పెంచుకున్నాడు గాని స్వాతి గుండెల్లో తన ప్రేమ జ్యోతిని త్వరలోనే వెలిగించాలని నిర్ణయించేసుకున్నాడు.మొదట్లో నిదానమే ప్రధానమని నమ్మిన సుకుమార్ ,ఇక ఆలస్యం చేస్తే అమృతం విషం అయ్యే ప్రమాదం ఉందని గ్రహించాడు. ఆగష్టు పదిహేను మంగళవారం రావడంతో సోమవారం శెలవు పెట్టేసి నాలుగు రోజులు ఇంట్లోనే వుండి తన ప్రయత్నాలు మొదలుపెట్టాలని నిర్ణయించేసుకున్నాడు.

* * * * * * * * * *

స్వాతంత్ర్యదినోత్సవాల కవరేజ్ కోసం లోకనాధం ఢిల్లీ వెల్లడం, సరిగ్గా అదే సమయానికి పద్మావతి స్నేహితురాలి పెళ్ళంటూ విజయవాడకు వెళ్ళిపోవడం,శుభశకునాలుగా తోచాయి సుకుమార్ కి.నాలుగురోజులు తామిద్దరే ఒంటరిగా ఉండబోతున్నారన్న నిజాన్నినమ్మలేకపోయడు. శనివారం ఉదయాన్నే లేచి నీట్ గా షేవింగ్ చేసుకుని తనకిష్టమైన జీన్స్ ప్యాంటు, పోకిరి స్టయిల్ ట్-షర్ట్ ధరించి అద్దంలో అరగంట పాటు చూసుకుని సోగ్గడిలా తయారయ్యి బయల్దేరాడూ. కింద పోర్షన్ బెల్ నాలుగు సార్లు కొట్టినా కూడా ఎవరూ రాకపోవడంతో "ఒక వేళ స్నానం చేస్తుందేమో!" అని ఊహించుకుని చాలా రొమాంటిక్ గా ఫీల్ అయిపోయాడు

కాసేపాగి మరోసారి గట్టిగా బెల్ కొట్టిన సుకుమార్ కి తలుపు తీసుకొచ్చిన వ్యక్తి ని చూసి కళ్ళు తిరిగినంత పనయ్యింది. ఎరుపెక్కిన కళ్ళతో, నోరుతెరిచి ఆవళిస్తూ ఎదురుగా నిలబడ్డ లోకనాధంని చూసి సుకుమార్ గుండె గుభేళుమంది. శుక్రవారం రాత్రే ఢిల్లీకి బయల్దేరిన లోకనాధం మళ్ళీ ఎందుకు ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడో, అతనికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక తడబడతుండగా అతని వెనకే ప్రత్యక్షమైన స్వాతి ని చూసి మరో సారి మామూలు మనిషయ్యాడు సుకుమార్. "నేనే వచ్చి నిన్ను టిఫిన్ చెయడానికి పిలుద్దామనుకున్నాను. రాత్రి చాల లేటయ్యింది. ఈయన గారు ఎప్పటిలాగనే ఫ్లైటు మిస్ చేసుకున్నారు." అని లోకనాధం వైపు చూసి "మీరెళ్ళి కాసేపు పడుకోండి! కనీసం ఈ రోజయినా కాస్తా ముందు బయల్దేరి వెల్లొచ్చు" అంది స్వాతి.

నిద్రమత్తులో తూలుతున్న లోకనాధం మరో మాట మాట్లాడకుండా బెడ్రూం వైపు వెళ్ళిపోయడు. దైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని నాలుగు ఇడ్లీలు తిని "నాకు పనుందండి. నేను వెళ్తాను" అని బయల్దేరిన సుకుమార్ ని ఉద్దేశించి "మీరు కూడ మీ భార్యతో కలిసి వెళ్ళాల్సింది. ఏ నాలుగు రోజులు మీకు బోరుకొట్టదా?" అడిగింది స్వాతి. బోరుకొట్టి నీరసపడిపోయిన జీవితంలో కాస్త రొమాన్స్ చేరుద్దామని నానా తంటాలు పడి ప్లాన్ చేసిన పథకం బోర్లాపడీందని దిగులుతొ నోటమాట రాక దిగులుగా ఒక చిరునవ్వు చిందించి బయటకు బయల్దేరాడు సుకుమార్.

ఉన్న నాలుగు రోజుల్లో ఒక రోజు వృధా అయిపోయిందన్న బాధను మాయం చేసుకోడానికి బార్లో కాసేపు కూర్చుని, తరవాత సినిమాకని బయల్దేరి, సాయంత్రం మరో సారి బారుకెళ్ళి రాత్రి పది గంటలకు ఇంటి మొహం పట్టాడు సుకుమార్.పదిన్నరప్పుడు ఇల్లు చేరుకుని కింది వాటా లో లైట్లు వెలగకపోవడం గమనించి లోకనాధం డిల్లీ వెళ్ళిపోయాడని అర్ధం చేసుకున్నాడు. ఒంటరిగా స్వాతి ఇంట్లొ నిద్ర పోతుంటుందని అనుకున్నాడు. ఈ సమయంలో వెళ్లి స్వాతి ని నిద్రలేపడం సబబు కాదేమో అని అనిపించింది సుకుమార్ కి. ఒకవేళ స్వాతి పై తన అభిప్రాయం తప్పేమో? ఆమెకు తన మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవేమో? అన్న అనుమానం కలిగింది సుకుమార కి. అదే నిజమైతే ఇంత రాత్రి వేళ తనెళ్ళి ఆమె నిద్రను భంగపరిస్తే తనకున్న చనువు కాస్త పోగుట్టుకున్నట్టవుతుందని ఆలోచించి తన ప్రయత్నాలను ఆదివారానికి వాయిదావేసుకున్నాడు. ఉదయం నుంచి అలసిపోయి ఇంటికి చేరిన సుకుమార్ కి బెడ్ మీద పడుకోగానే నిద్ర పట్టేసింది.

ఎంతసేపు పడుకున్నాడొ తెలియదు గాని, "ధబ్ ధబ్" మని తలుపు కొట్టిన చప్పుడు విని కళ్ళు నలుపుకుంటూ వెళ్ళి తలుపు తీసాడు. ఎదురుగా నిలబడీ ఉన్న స్వాతి ని చూసి తను చూస్తున్నది కలా?నిజమా? అన్న విషయం నిర్ధారించుకోలేకపొయాడు. గులాబి రంగు చీర కట్టుకుని, తలలో మల్లెపూలు పెట్టుకొని కొత్త పెళ్ళికూతురులా ముస్తాబై తన కళ్ళెదురుగా నిల్చుని ఉన్న స్వాతి అందాన్ని చూసి మత్తుదిగిపోయింది సుకుమార్ కి. ఇంత రాత్రి వేళ ఒంటరిగా ఉన్నానని తెలిసి ధైర్యం చేసి ఆమే నేరుగా వచ్చి తన తలుపు తట్టిందంటే తనెంతో అదృష్టవంతుడని మనసులోనే మురిసిపోయాడు.

"మంచి నిద్రలో ఉన్నట్టున్నారు. డిస్టర్బ్ చేసానా?" అడిగింది స్వాతి. "అవునండి. మంచి నిద్రలో ఉన్నాను. చాలా సేపు తలుపు కొట్టారా? మిమ్మల్ని వెయిట్ చేపించుంటే క్షమించండి " అన్నాడు సుకుమార్ . "ఇంత రాత్రి వేళ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు నేనే మీకు క్షమాపణలు చెప్పాలి" అంది స్వాతి. "దాంట్లో ఏముంది లెండి. ఇంత రాత్రి వేళ నన్ను నిద్రలేపారంటే ఏదో పెద్దవిషయమే ఉండిఉంటుంది.ఏంటో చెప్పండి." అన్నాడు చిలిపిగా సుకుమార్ . "ఇలా తలుపు దగ్గరే నిలబెట్టి మాట్లాడుతారా?" అడిగింది అంతవరకూ తలుపు దగ్గరే నిలబడ్డ స్వాతి. "ఆయ్యో, అలా అంటారేంటి. నిద్రమత్తులో ఉండి ఏంచేస్తున్ననో నాకే తేలియటం లేదు. రండి, సోఫాలో కూర్చోండి" అని హడవుడి చేసేసాడు సుకుమార్.

"అంత పెద్ద విషయమేమి కాదులెండి. ఇప్పుడే ఆయన్ను ఏర్ పోర్ట్ లో డ్రాప్ చేసి వస్తున్నాను. రేపు ఉదయాన్నే నేను విజయవాడ వెళ్ళాలి.వెళ్ళే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నాకేమో ఉదయం ఆరుగంటలకే ట్రైన్.అంత ఉదయాన్నే మిమ్మల్ని లేపడం ఇష్టం లేక ఇప్పుడు లేపాల్సి వచ్చింది. క్షమించండి" అంది స్వాతి, సోఫాలో కూర్చుంటూ.

స్వాతి మాటలు విన్న సుకుమార్ ఘోరంగా నీరసపడిపోయాడు శనివారం లోకనాధం మూలంగా వృధఆయిపోగా, మిగిలిన మూడు రోజులు స్వాతి విజయవాడ వెల్తుండడంతో అతన్లో ఎక్కడ లేని విచారం అలముకొంది.కానీ కళ్ళకెదురుగా పెళ్ళికూతురులా ముస్తాబైన స్వాతి ని చూసి సమయమేమీ మించిపి తన మనసులో చాలా రోజులుగా పదిలంగా భధ్రపరుచుకున్న ప్రేమను ఆమెకు అందివ్వాలనుకున్నాడు. మరలా ఇలాంటి అవకాశం రాదని, ఎలాగైనా అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదని ఆవేశపడిపోయాడు.

"ఇందులో క్షమించడానికేముందండి. నేను కూడా మీకు చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ముందు మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి." అన్నాడు.

"లేదు ముందు మీరే చెప్పండి" అంది స్వాతి.

"లేదు.లేదు. లేడిస్ ఫస్ట్ . ముందు మీరే చెప్పాలి." ఒత్తిడి చేశాడు సుకుమార్.

"ఏమీలేదండి. నేను రేపు విజయవాడ వెల్లాక నాలుగు రోజులపాటు చెట్లకు నీళ్ళు పట్టే వాళ్లే వుండరు. మీరెలాగూ శెలవు పెట్టి ఇంట్లోనే ఉంటారు కదా! ఈ నాలుగు రోజులు చెట్లకు నీళ్ళు పడ్తారా?" అని అడిగిన స్వాతి ప్రశ్నలకు సుకుమార్ మొహం ఎర్రగా మారిపోయింది.

తనపై స్వాతికి ప్రేమ దోమ ఏమీ లేదని , అనవసరంగా తనే పగటి కలలు కంటున్నాడని నిశ్చయిం చుకున్నాడు. తనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎక్కడో ఆలోచనల్లో మునిగిపోయిన సుకుమార్ ని చూసి "మీకేమైనా ఇబ్బందయితే వద్దులెండి. వేరేవాల్లకెవరికైనా చెప్తాను" అంది.

"ఈ విషయం చెప్పడానికా,బంగారంలాంటి నిద్రను పాడుచేసింది" అని మనసులో అనుకొని "అయ్యో మరీ అంత ఇబ్బందేమి కాదులేండి. చెట్లకు నీళ్ళేగా పట్టేస్తాను" అని లేని చిరునవ్వును తెచ్చుకుని చెప్పాడు సుకుమార్.

"చాలా థ్యాంక్సండి! చెట్లకేమైనా అయితే నేను భరించలేను" అంది స్వాతి. అందుకు సమాధానంగా నవ్వేసి ఊరుకున్నాడు సుకుమార్.చెప్పాలసిన విషయం చెప్పేసినా కూడా అక్కడినుంచి కదిలే ఉద్దేశం ఏమి లేనట్టు కూర్చున్న స్వాతి వైపు చూసాడు సుకుమార్.

అతని వైపు చూసి అదోలా ఒక నవ్వు నవ్వింది స్వాతి. కాసేపు ఆ గదిలో నిశ్శబ్దమ విలయ తాండవం చేసింది. "మొదతి సారి మీ ఇంటి కొచ్చాను. కనీసం ఒక కాఫి అయినా తాగమని అడగరా?", నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ అడిగింది స్వాతి. ఎంత తల బద్దలు కొట్టుకున్నా ఆమె ఉద్దేశమేంటో అర్థం కాలేదు సుకుమార్ కి.

"చెట్లకు నీళ్ళు పట్టే విషయం చెప్పెసింది గదా! కాఫి-గీఫి అంటూ ఏదో విషయాన్ని దాస్తుంది" అని పసిగట్టాడు తను. "అయ్యో అడగడమే మర్చిపోయాను. అయినా ఇంత రాత్రి పూట కాఫి తాగుతారని అనుకోలేదు. రెండు నిమిషాల్లో తెస్తాను" అని కిచెన్ లో దూరాడు. స్టవ్ మీద నీళ్ళు పెట్టి తన బెడ రూమ్ లో దూరి తల దువ్వుకుని ఫ్రెష్ అయ్యె ప్రయత్నంలో పడిపోయాడు. అంతరాత్రి వేళ స్వాతి తనను నిద్రలేపడానికి వేరే బలమైన కారణమేదోవుందని నిర్ణయించుకున్నాడు."ఒకవేళ స్వాతి విషయం బయటపెట్టడానికి సిగ్గు పడ్తుందేమో ? తనే చెప్పేస్తే ఎలా ఉంటుంది?" అన్న సంశయంలో తలమునకలు కాసాగాడు.

"ఏం చేస్తున్నారిక్కడ. నేను లోపలికి రావచ్చా?" అంటూ బెడ్ రూమ్ తలుపు దగ్గర నుల్చున్న స్వాతిని చూసి "ఇది ఖచ్చితంగా అదే" అని నిర్ణయించేశాడు సుకుమార్. "రండి.కూర్చొండి. మీ ఇల్లే అనుకోండి." అని ఆనందంగా స్వాగతం పలికాడు సుకుమార్.

బెడ్ మీద కూర్చుని "మీకు చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలని ఎదురు చూస్తున్నాను. కాని మీరు ఏమనుకుంటారో అని చెప్పలేదు. కాని ఆ విషయం మీకు చెప్పకుండా దాచలేను. అలాగని చెప్పలేను. ఏం చెయ్యాలో…." అని ఆగింది స్వాతి.

అక్కడ గడుస్తున్న ప్రతి క్షణం స్వాతి తనకు చాలా దగ్గరైపోతుందని,త్వరలో ఆమే వచ్చి తన కౌగిలిలో వాలడం తధ్యమని అనుకున్నాడు. ఆ క్షణం కోసమే ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగాడు. "మీ పరిస్థితిని నేనర్థం చేసుకోగలను.ధైర్యంగా చెప్పేయండి." అని చెప్పి ఆమెను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశాడు.

"ధైర్యం కావల్సింది మీకు. నేను చెప్పేది విని…." అని స్వాతి ఏదో చెప్పబోయేంతలో, "మీరనవసరంగా దిగులు పడ్తున్నారు. మీరు చెప్పకపోయినా నాకు ముందే తెలుసు. అందుకే పద్మావతిని ఊరికి పంపేశాను" అన్నాడు ఆమె వైపు చూసి రొమాంటిక్ గా నవ్వుతూ.

సుకుమార్ నవ్వుకి తలదించుకొంది స్వాతి. "సిగ్గేమో!" అనుకున్నాడు సుకుమార్.

"అంతా తెలిసి మీరింకా నవ్వుతూ ఉన్నారంటే మీరు చాలా గ్రేట్. నా భర్త ఊరెళ్ళినప్పుడల్లా అక్కడ వేరే ఎవర్తోనైన సంబంధం పెట్టుకుంటారేమో అని నరక యాతన పడిపోతాను. అలాంటిది స్వంత ఇంటిలోనే మీ భార్య వేరే వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి మీరింత ప్రశాంతంగా ఉన్నందుకు, మీ సహనాన్ని ఓపిక ను మెచ్చుకోవాలి", దించిన తల ఎత్తకుండా చెప్పింది స్వాతి. అంతవరకూ గాలిలో దూదిపింజంలా స్వర్గపుటంచుల్లో తేలిపోతున్న సుకుమార్ , స్వాతి అసలేం మాట్లాడుతుందో గ్రహించడానికి రెండునిమిషాలు పట్టింది.

కళ్ళల్లో నీళ్ళు తిరిగసాగాయి. "మీరీ ఇంట్లో చేరిన మొదట వారమే నాకామె విషయం తెలిసిపోయింది. చాలా సార్లు నీకు చెప్దామని ప్రయత్నించాను. చాలాసార్లు మీ ఆఫీసుకి కూడా ఫోన్ చేశాను. అయినా ధైర్యం చాల్లేదు. చాలా సార్లు మీ వ్యక్తిగత విషయాలు నాకెందుకులే అని వదిలేశాను గాని, నిన్ను, నీ అమాయకత్వాన్ని చూసి భరించలేక ఇవాళ ఎలా అయినా మీకు చెప్పితీరాలని నిశ్చయించుకోని వచ్చాను.అయినా పద్మావతి మీకు చేస్తున్న అన్యాయాన్ని తెలిసి తెలిసి ఎలా భరిస్తునారో నాకర్థం కావటం లేదు", తలెత్తి సుకుమార్ ని చూస్తూ అంది.

సుకుమార్ మొహం తెల్లగా పాలిపోయింది. అతని ఙానేంద్రియాలన్ని పని చేయడం మానేసాయి. శిలా ప్రతిమలా నిల్చుండిపోయాడు. కరెంటు షాక్ తిన్న కాకిలా నిటారుగా నిలబడి ఉన్న సుకుమార్ని చూస్తూ,

"మీరు చాలా గ్రేటండి. ఇంత విన్నాక కూడా మీలో పద్మావతిపై కోపం రాలేదంటే, మీరు చాలా గొప్పవాళ్ళు. మీలాంటి మంచి వారిని వదిలి తిరిగే పాడు బుద్ధి ఆమెకెందుకు కలిగిందో?", అందామె.

స్టవ్ మీద మరుగుతున్న నీళ్ళ్లలా మరిగిపోయింది సుకుమార్ మనసు. ఆమె మాటలేవి సుకుమార్కి వినిపించడంలేదు. భూమి రెండుగా చీలి పోయి తనను, ఈ పాడు లోకంనుంచి దూరంగా పాతాళానికి తీసుకుపొతే బావుండుననిపించింది. కళ్ళనుండి నీరు ఉబికి వచ్చాయి.

సుకుమార్నే దిగులుగా చూస్తూ మౌనంగా ఉండిపోయింది స్వాతి.

ఆ ఇంట్లో స్మశాన నిశ్శబ్దం.

సుకుమార్ కళ్ళల్లో కూలిన గాలిమెడల తాలూకు శిధిలాల సంకేతం.

దూరంగా ఎక్కడో టివీ లో ఖుషి సినిమాలోని "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" పాట లీలగా వినిపించింది.

* * * * * * * * *