Malli Mastan Babu

by admin@ 24fps

నేను చిన్నప్పుడు స్కూల్లో (సైనిక్ స్కూల్ కోరుకొండ) చదువుకొనే రోజుల్లో మల్లి మస్తాన్ బాబు అని ఒక సీనియర్ ఉండేవాడు. నేను తొమ్మిదో క్లాసులో ఉండగా అతను +2 ముగించి వెల్లిపోయాడు.
మా ఇద్దరిది నెల్లూరు జిల్లానే కావడంతో కాస్త ప్రాంతీయ అభిమానం ఉండేది. నాకాయన త్రికోణమతి(trignometry) సరిగా అర్థం చేపించడానికి చాల కృషిచేశారు.

అదెప్పుడో పదేల్ల నాటి మాట. నిన్న google దేని కోసమో శోధన చేస్తుంటే అనుకోకుండా మస్తాన్ బాబు గురించి తెలిసింది. ప్రపంచం లోని అతి ఎత్తైన ఏడు శిఖరాలను కేవలమ 171 రోజుల్లో అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు మస్తాన్ బాబు.

ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి తెలుగు తేజాన్ని అజరామరం చేయడమే కాకుండా, ప్రపంచంలోని అతి ఎత్తైన ఏడు శిఖరాలు అధిరోహించిన ఏకైక భారతీయునిగా ప్రపంచ చరిత్ర పుటల్లో మన దేశానికి స్థానం కలిగించాడు.

నెల్లూరు జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన మస్తాన్, సైనిక్ స్కూల్లో చదువుతుండగా, ప్రతి రోజు హాస్టల ముందు గల పార్క్ లో గల ఉదయభాస్కర్ (ఎవరెస్టుని అధిరోహిస్తూ మరణానికి గురైన సైనిక్ స్కూల్ విధ్యార్థి) సీనియర్ శిలాప్రతిమను చూసి ప్రేరణ చెంది, ఏదో ఒక రోజు ఎవరెస్ట పర్వతాన్ని అధిరోహించాలని నిశ్చయించుకున్నాడు.

ఉన్నత విద్య కొరకై NIT జమ్షెడ్పూర్ లో ఇంజనీరింగ్ ముగించి , అటు పిమ్మట IIT ఖరగ్పూర్ లో MTech పూర్తి చేసి, సత్యం కంప్యూటర్స్ లో ఉద్యోగం పొందాడు.

ఎవరెస్టు ఎకాలన్న చిన్నప్పుడు కన్న కలలు కొన్నాల్లు మూలనపడ్డాయి.

మూడేల్ల పాటు చేసిన ఉద్యోగం సంతృప్తినీయక పోవడంతో, 2002 లో IIM కలకత్తా లో MBA కోర్సులో చేరాడు మస్తాన్. అక్కడే మల్లి ఆశలు మళ్ళీ చిగురించాయి. IIM లో మల్లి స్థాపించిన ఎడ్వంచర్ క్లబ్ ద్వారా మనాలి వద్దగల పీర్పంజల అన్న పర్వత శ్రేణిని అధిరోహించగలిగాడు.ఆ అనుభవం నేర్పిన పాఠాలు, ఎవరెస్టు అధిరోహించడం కేవలమ కల కాదు, నిజం చేయొచ్చు అన్న నమ్మకం కలిగింది మస్తాన్ కి.

అతని కలలను సాకారం చేసుకోడానికి 2005 డిశెంబరులో బయల్దేరి ఎవరెస్ట పర్వతాన్ని, అమెరికాలోని డెనాలి రష్యా లోని ఎల్బ్రస్ , టాంజానియా లోని కిలిమంజారో, అంటార్కిటికా లోని వింసన్ మాసిఫ్ , అర్జెంటినా లోని అకోన్కగువా, ఆస్ట్రేలియా లోని కొస్చుజ్స్కో పర్వతాలను 171 రోజుల్లో అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టీంచాడు.అధిరోహించిన ప్రతి శిఖరానికి తోడుగా తన చిన్ననాటి హీరో ఉదయభాస్కర్ చిత్రాన్ని తీసుకెళ్ళి తనకు స్పూర్తినిచ్చిన వ్యక్తికి శ్రద్ధాంజలి పలికాడు మస్తాన్ బాబు.

వచ్చే సంవత్సరం మన దేశంలోని 29 రాష్ట్రాల్లోను, 29 రోజుల పాటు వరసగా మేరథాన్ రేసు పరిగెట్తడానికి సన్నాహాలు చేస్తున్న మస్తాన్ బాబుకి నా అభినందనలు.

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న మాటకు మస్తాన్ మనకున్న సజీవ సాక్ష్యం.